త్వరలోనే మంచిరోజులు వస్తాయని విజయమ్మ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలోనే మంచిరోజులు వస్తాయని విజయమ్మ భరోసా

త్వరలోనే మంచిరోజులు వస్తాయని విజయమ్మ భరోసా

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

నీళ్లు లేవు.. కరెంటు లేదు.. పెన్షన్లు లేవు
రచ్చబండలో విజయమ్మకు ప్రజల మొర
జగన్ వస్తారు... త్వరలోనే మంచిరోజులు వస్తాయని విజయమ్మ భరోసా

సాక్షి, హైదరాబాద్: ‘‘మాకు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవమ్మా... చేద్దామంటే కూలీ దొరకడం లేదు..!’’
- ఓ మహిళ ఆవేదన

‘‘మా ఊళ్లో కరెంటు లేదు. ఎప్పుడొస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియదు...’’
- మరో మహిళ ఫిర్యాదు

‘‘గతంలో వచ్చే పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. ధరలేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఇలా అయితే ఎలా బతికేది...?’’
- ఓ వృద్ధుడి ప్రశ్న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి శనివారం చేవెళ్లలో ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమంలో జనం గోడు ఇదీ! అడ్డగోలుగా పెరిగిపోతున్న ధరలు, కరెంటు కష్టాలు, వ్యవసాయంలో నష్టాలు ఇలా అనేక అంశాలపై ఒక్కొక్కరుగా తమ బాధలను విజయమ్మకు చెప్పుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో ఆయన సతీమణి విజయమ్మ.. ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోవడానికి రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. చేవెళ్ల, అంగడి చిట్టెంపల్లిల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చేవెళ్లలో వైఎస్ పదేళ్ల క్రితం ప్రజాప్రస్థానం ప్రారంభించిన చోటుకు దగ్గరల్లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో నిర్వహించిన రచ్చబండలో గంటకు పైగా మాట్లాడారు. ‘‘కరెంటు సరఫరా బాగా జరుగుతోందా? పెన్షన్లు అందుతున్నాయా?’’ అని ఆరా తీయగా జనం నుంచి ‘‘లేదు.. లేదు’’ అన్న సమాధానాలే వచ్చాయి. మహిళలు తమ సమస్యలు ఆమెకు నివేదించారు. 

‘‘నా భర్తకు పెన్షన్ వచ్చేది. మధ్యలో ఆయనకు అపెండిసైటిస్ నొప్పి వస్తే ఆపరేషన్ చేయించుకుని ఇంటిలో పడుకుని ఉన్నారు. అదే సమయంలో ఆరె మైసమ్మ గుడి వద్ద సర్కారోళ్ల మీటింగ్ జరిగింది. మమ్మల్ని రమ్మన్నారు. అనారోగ్యంతో ఉన్నందు వల్ల నేను, మా ఆయన వెళ్లలేదు. మీటింగ్‌కు రాలేదని మా ఆయన పెన్షన్‌ను నిలిపేశారు’’ అని ఓ మహిళ వాపోయింది. అప్పట్నుంచి అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేదన్నారు. మరో మహిళ లేచి... రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారన్న మాటే గాని, ఇతర నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. ఓ మహిళ కరెంటు బిల్లులను చూపుతూ.. తమ ఇంట్లో కరెంటు వాడకం తక్కువగానే ఉన్నా నెలకు 220 నుంచి రూ.250 బిల్లు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు తమ బిల్లు రూ.90 దాటలేదన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ప్రతి నెలా కచ్చితంగా రూ.200 పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు రావడం లేదని ఓ వృద్ధురాలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. విజయమ్మ ఆమెను ఓదార్చారు. రూ.185కు 9 సరుకులు సరఫరా చేసే పథకం అమలవుతోందా? అని విజయమ్మ ప్రశ్నించగా.. లేదని మహిళలు పేర్కొన్నారు.

త్వరలోనే మంచి రోజులు వస్తాయి..: జగన్ అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి రోజులు వస్తాయని, వైఎస్ పథకాలన్నింటినీ కొనసాగించి తీరుతారని విజయమ్మ ప్రజలకు భరోసానిచ్చారు. మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే కుటుంబం వైఎస్‌దని ఆ ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. జగన్ అధికారంలోకి రాగానే.. చిన్న పిల్లలు పాఠశాల లకు వెళ్లేలా అమ్మఒడి పథకం ప్రారంభిస్తారని చెప్పారు. పేద విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నతస్థాయి వరకూ విద్యను చెప్పిస్తారన్నారు. వృద్ధుల పెన్షన్లు రూ.200 నుంచి రూ.700కు పెంచుతామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పోలీసును నియమింపజేస్తారన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తారన్నారు. రచ్చబండ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా పార్టీ కమిటీ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. నేతలు జనక్‌ప్రసాద్, విజయ్‌చందర్, గట్టు రామచంద్రరావు, జంపన ప్రతాప్, దేప భాస్కర్‌రెడ్డి, గోనె ప్రకాశ్, ఎస్.ధన్‌పాల్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి, రూపానందరెడ్డి, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, సంజీవరావు, కొల్లి నిర్మలా కుమారి, రాచమల్ల సిద్ధేశ్వర్, కొండా రాఘవరెడ్డి, అమృతాసాగర్, హైదరాబాద్ కార్పొరేటర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: