సీమ జనం నోట మన్ను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమ జనం నోట మన్ను

సీమ జనం నోట మన్ను

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

* బ్రహ్మణి స్టీల్స్‌ను అడ్డుకుని పేదల పొట్ట కొట్టిన పాలక, ప్రతిపక్షాలు
* దివంగత వైఎస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే భయంతోనే కుతంత్రం
* కరువు పీడిత రాయలసీమలో ప్రజల ప్రమాణాలు పెంచేందుకు వైఎస్ యత్నం
* లక్షలాది మందికి ఉపాధి కల్పించే ‘బ్రహ్మణి స్టీల్స్’కు మహానేత రూపకల్పన
* ‘సీమ ఉక్కు హక్కు’పై ఆది నుంచీ విషం కక్కిన టీడీపీ, ఎల్లో మీడియా
* రాతిగుట్టల భూములను సెలయేళ్లు, పచ్చికబయళ్లు అంటూ అసత్య కథనాలు
* ఎకరం రూ. 25 వేల వరకూ ధరకు కేటాయించినా ఉచితంగా ఇచ్చినట్లు యాగీ
* అఖిలపక్షం వెళ్లి చూసి ఆ భూములు ఎందుకూ పనికిరావని తేల్చిన వైనం
* తప్పుడు ఆరోపణలతో కోర్టుకు, సీబీఐ దర్యాప్తు వరకూ లాగిన దుష్టత్రయం
* అక్కడ నాణ్యమైన ఖనిజం లేదని సీబీఐ దర్యాప్తులో తేల్చినా వక్రభాష్యాలు
* బ్రహ్మణి నిర్మాణంలో జాప్యం పేరుతో ఒప్పందం రద్దుచేసిన కాంగ్రెస్ సర్కారు
* అప్పటికే బ్రహ్మణి రూ. 1,350 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా తేల్చిన ఈడీ
* ఏళ్ల తరబడి ప్రాజెక్టులు ప్రారంభించని సంస్థలపై నోరు మెదపని సర్కారు..
* బ్రహ్మణి స్టీల్స్ నుంచి అత్యుత్సాహంతో భూములను లాక్కున్న వైనం
* మహానేత వైఎస్‌పై కక్ష సాధించేందుకే ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ

దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు బ్రహ్మణి స్టీల్స్‌ను అడ్డుకున్నామని పాలక, ప్రతిపక్షాలు.. వారికి బాకాలూదే ఎల్లో మీడియా సంబరపడుతుండవచ్చు. వైఎస్ కీర్తి సిగ నుంచి కలికితురాయిని లాగి పారేశామని ఉప్పొంగిపోవచ్చు. వాస్తవానికి ఇది ఒక పెద్ద విషాదం. 21 మంది ఆత్మార్పణ చేస్తే కానీ మనకు విశాఖ స్టీల్ ప్రాజెక్టు రాలేదు. విశాఖ స్టీల్ లాంటి మెగా ప్రాజెక్టు.. అదీ కరువు పీడిత రాయలసీమలో రాకుండా పోయిన దానికి చింతించాలి.

ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే వేలాది కుటుంబాల అన్నంలో మన్ను పడిందానికి రోదించాలి. వరుస కరువులతో, కక్షలు కార్పణ్యాలతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాయలసీమ కరువు పీడిత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మహానేత వైఎస్ నడుంకట్టారు. కానీ.. రాజకీయ కక్షల కారణంగా.. ఒక ప్రాంతం ఆర్థిక, సామాజిక పరిస్థితులను సమూలంగా మార్చివేసే భారీ ప్రాజెక్టు గొంతు నులిమేశారు. సీమ ప్రజల తలరాత మార్చగలదనుకున్న దివంగత మహానేత కలల ప్రాజెక్టును చిదిమేశారు.

రాయలసీమలో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే బృహత్తరమైన బ్రహ్మణి స్టీల్స్ ప్రాజెక్టుకు వైఎస్ బాటలు పరిచారు. కానీ.. ‘బ్రహ్మిణి స్టీల్స్’ కార్యరూపం దాలిస్తే ఆ మహానేత పేరు ఎక్కడ చిరస్థాయిగా నిలిచిపోతుందో అన్న భయంతో ఆధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై కడప జిల్లా జమ్మలమడుగు వద్ద నిర్మాణంలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని భూస్థాపితం చేశాయి. అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న వైఎస్‌పై ఉన్న కక్ష తీర్చుకోడానికి కరువు ప్రజల అన్నం గిన్నెలో మన్నుపోసేందుకు పాలక, ప్రతిపక్షాలు తెగించాయి. కాదు.. బరి తెగించాయి.

రాష్ట్రంలో ఓ మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటయితే, రాష్ట్రం పారిశ్రామికంగా మరో ముందడుగు వేస్తుందని, అది ఏర్పాటయ్యే ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమయితే, ఆ ప్రాంతమంతా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వైఎస్ భావించారు. వైఎస్సే కాదు, జనం బాగుకోసం ఆలోచించే ఏ నేత అయినా అలాగే ఆలోచిస్తారు. ఆలోచించాలి కూడా. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు అలాంటి నేతలు కరువయ్యారు.

తొలి నుంచీ విషం కక్కటమే...
వెనుకబడ్డ ప్రాంతంలో ఉక్కు కర్మాగార నిర్మాణానికి ముందుకు వచ్చిన కారణంగా ఓబుళాపురంలో ఇనుప ఖనిజం మైనింగ్ లీజుల కేటాయింపులో బ్రహ్మణి స్టీల్స్ యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తే అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏదో కొంప కొల్లేరైనట్లు యాగీ చేసింది. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా.. బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన భూములపై చిలువలు పలువలుగా వర్ణిస్తూ రాతలు రాసింది. ముందు నుంచి ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాయి.

బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన భూములు ముద్దనూరు, జమ్మలమడుగు మధ్య వట్టి రాతి గుట్టలు. సేద్యానికి కాదు కదా కనీసం ఊపగడ్డి అయినా మొలవని భూములు. తొండలు కూడా గుడ్లు పెట్టని ఆ బీడు భూములను భూతల స్వర్గాలుగా వర్ణిస్తూ ఎల్లో మీడియా కథనాలు రచించింది. గల గలా పారే సెలయేళ్లు, వాగులు, వంకలు, జింకలు, నెమళ్ల నాట్యాలు, పక్షుల కిలకిలా రావాలతో విరాజిల్లే ఆ భూములను కారుచౌకగా కట్టబెట్టారంటూ కథనాలను ఎల్లో మీడియా రాసింది.

వైఎస్ సర్కారు బ్రహ్మణి స్టీల్స్‌కు విలువైన భూములను అతితక్కువ ధరకు కేటాయించిందని చెప్పేందుకు అనేక అబద్ధపు కథనాలను వండి వార్చింది. దీంతో ఈ విషయమై అసెంబ్లీలో వివిధ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయగా, వైఎస్ ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని పరిశీలన నిమిత్తం పంపింది. బృందం బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన భూముల్లో పర్యటించింది. వంకలు, జింకలు, సెలయేళ్లు ఎక్కడా లేవని, ఇవి ఎందుకూ పనికిరాని రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండిన పనికిరాని భూములని బృందం కూడా మీడియా సమక్షంలోనే ధ్రువీకరించింది.

అక్కడ ‘చంద్ర తంత్రాలు’ లేవు... 
ఎందుకూ పనికి రాని భూములైనా, ఆ రోజు వైఎస్ ప్రభుత్వం వాటిని బ్రహ్మణికి ఉచితంగా కట్టబెట్టలేదు. ఎకరా రూ. 18 వేలు చొప్పున 10,560 ఎకరాలు ఫ్యాక్టరీకి, ఎకరా రూ. 25 వేలు చొప్పున 3,500 ఎకరాలను విమానాశ్రయానికి గాను కేటాయించింది. ఈ భూములకు సమీపంలోనే చారిత్రక గండికోట, రెండు ఎత్తయిన కొండల నడుమ లోయ(గాడ్జ్)లో ప్రవహించే పెన్నా నది, కడప, కర్నూలు, అనంతపురం మూడు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో టూరిజం కేంద్రంగా కూడా అభి వృద్ధి చెందే అవకాశాలున్నాయి.

వైఎస్ సర్కారు బ్రహ్మణి స్టీల్స్‌కు భూమి కేటాయింపులో కానీ, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి ఇనుప గనుల లీజుల మంజూరులో కానీ వైఎస్ సర్కారు ఆశ్రీత పక్షపాతం చూపలేదు. మాదాపూర్‌లో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టి ‘జయభేరి’ భూములకు విలువ పెంచుకునే ‘చంద్ర తంత్రాలు’ లేవు. ఇంత భారీ ఫ్యాక్టరీ వస్తున్నప్పటికీ ఇక్కడ భూముల ధరలు ఏమాత్రం పెరగలేదు. అసలు ఆ భూములు ఎందుకూ పనికిరానివనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

సీబీఐ విచారణలో తేలిందేమిటి? 
భూమి కేటాయింపులో తమ బుకాయింపు చెల్లకపోయేటప్పటికి బ్రహ్మణి యాజమాన్యానికి కేటాయించిన ఓబుళాపురం మైనింగ్ లీజులను చంద్రబాబు, ఎల్లో మీడియా వివాదాస్పదం చేసి, సీబీఐ విచారణ దాకా తీసుకెళ్లాయి. ఓబుళాపురం గనుల వ్యవహారంలో సీబీఐ విచారణలో తేలిందేమిటి? గనుల కేటాయింపు అక్రమమని ఎక్కడా అనలేదు. ఓఎంసీకి గనుల కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా కోల్పోయినట్లు సీబీఐ పేర్కొనలేదు.

అయినా ఓఎంసీకి లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని వైఎస్ సర్కారు దోచిపెట్టిందంటూ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ కలిసి గోబెల్స్ ప్రచారం సాగించాయి. వేల కోట్ల ఖనిజ సంపదను వైఎస్ ప్రభుత్వం ఓఎంసీకి అడ్డగోలుగా దోచిపెట్టిందంటూ ‘ఈనాడు’ పత్రికైతే మరీ బరితెగించి అనేక అబద్ధపు కథనాలు రాసింది. కడపలో ఫ్యాక్టరీని నేరుగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో లీజుల కేటాయింపులో అక్రమాలు సాగాయని గోబెల్స్ ప్రచారం సాగించింది.

చివరకు మహానేత వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా ఈ అంశాన్ని కోర్టు వరకూ లాగి సీబీఐ విచారణ జరిపించేలా కాంగ్రెస్, ఎల్లో మీడియా, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు సాగించాయి. అసలు ఓబుళాపురం గనుల్లో నాణ్యమైన ఇనుప ఖనిజమే లేదని సీబీఐ విచారణ ద్వారా తేల్చింది. ఓఎంసీకి లీజు కేటాయించిన ప్రాంతంలోని ముడి ఖనిజం ఎగుమతికి పనికిరాదని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) నిర్ధారించినట్లు సీబీఐనే పేర్కొంది. 2007-2010 సంవత్సరాల మధ్య ఈ ప్రాంతం నుంచి 29 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఎగుమతి చేసినట్లు సీబీఐ పేర్కొంది. అయితే ఈ లీజు ప్రాంతం నుంచి తవ్వింది 1.45 లక్షల టన్నులు మాత్రమేనని స్పష్టంచేసింది.

వాస్తవాలను మరుగుపరచి... 
మరి అక్కడ ఖనిజమే లేనప్పుడు లక్షల కోట్ల ఖనిజ సంపదను ఓఎంసీకి వైఎస్ సర్కారు ఎలా దోచిపెట్టిందో మాత్రం ఎల్లోమీడియా చెప్పదు. అసలు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడాల్సిందిపోయి మరింతగా అడ్డగోలు కథనాలు రాస్తూనే ఉండటం శోచనీయం. కాకపోతే కర్ణాటకలో ఖనిజాన్ని తవ్వి ఓబుళాపురం గని నుంచి తవ్వినట్లు చూపారన్న అభియోగం మాత్రమే సీబీఐ చేసింది. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు వివాదం కారణంగానే ఓబుళాపురం గనుల లెసైన్సులను కేంద్రం తాత్కాలికంగా రద్దు చేసిందన్న వాస్తవాన్ని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మరుగున పరుస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే మహానేత వైఎస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసుతోనే పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్యాక్టరీని అడ్డుకునే దారుణానికి ఒడిగట్టాయి. గనుల లెసైన్సులు తాత్కాలికంగా రద్దు కావటం, అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితులు అన్నింటికీ మించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా యాజమాన్యానికి పాలక, ప్రతిపక్షాలు కలుగచేసిన పలు ఇబ్బందుల కారణంగా బ్రహ్మణి స్టీల్స్ నిర్మాణంలో జాప్యం అనివార్యమయింది.

బ్రహ్మణి ఒప్పందం రద్దు ఎలా సమంజసం?
నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రాజెక్టును రద్దు చేయటం సరైన చర్య అనుకుంటే, రాష్ట్రంలో ఇప్పటికి ఏ ఒక్క ప్రాజెక్టూ రూపుదాల్చి ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకూ నిర్దేశించిన కాల పరిమితిలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టునైనా పాలకులు చూపగలరా? భారీ స్టీల్ ప్లాంటు ఏర్పాటు అనేది యజ్ఞంతో సమానం. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన విశాఖ ఉక్కు విస్తరణ పనులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో కార్ల తయారీ యూనిట్‌ను ఒప్పందం మేరకు ఎంఎల్‌ఆర్ మోటార్స్ 2008 నాటికే పూర్తి చేయాలి. ఇప్పటికీ ఈ కార్ల తయారీ యూనిటే ఏర్పాటు కాలేదు. అయినా ప్రభుత్వం ఈ కంపెనీకి ఐదుసార్లు సమయాన్ని పొడిగించిందే కానీ, కంపెనీకి కేటాయించిన 225 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోలేదు. చివరకు కార్ల తయారీ కాకుండా చిన్నపాటి వాణిజ్య వాహనాలను తయారు చేస్తామని కంపెనీ పేర్కొంటే.. ఇందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే కొంతమేరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో భూమిని వెనక్కు తీసుకోవటం సరికాదని స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు.

బీడు భూముల్లో భూస్థాపితం కాక తప్పదు... 
నాడు అసెంబ్లీలో కూడా వైఎస్ ఒక విజ్ఞప్తి చేశారు. ‘నాపై ఉన్న వ్యతిరేకతతో వెనకపడ్డ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవద్దు, వెనకబడ్డ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వస్తే ఒక్క బ్రహ్మిణినే కాదు, ప్రతిపక్ష నేతలు ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది’ అంటూ అసెంబ్లీలో విజ‘ప్తి చేశారు. నాణ్యమైన ఇనుప ఖనిజం దొరికే ప్రాంతాన్ని నాడు వైఎస్ ఏపీఎండీసీకి రిజర్వు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఈ 25 హెక్టార్లలో మైనింగ్ లీజును ‘తెలుగుదేశం పార్టీ’ వారికి చెందిన ఎస్సార్ మినరల్స్‌కుకట్టబెట్టటానికి రంగం సిద్ధం చేసింది. వైఎస్ పట్ల అక్కసుతో పాలక, ప్రతిపక్ష పార్టీలు వెనకబడ్డ ప్రాంతంలో పది మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం కావాల్సిన ప్రాజెక్టును అడ్డుకున్నామని సంబర పడవచ్చు కానీ, భవిష్యత్తులో ఈ పార్టీలను రాయలసీమ బీడు భూముల్లోనే ప్రజలు భూస్థాపితం చేయక మానరు.

రద్దయిన లీజుల్లో 22 కాంగ్రెస్ వారివే
మైనింగ్ అక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కర్ణాటకలో అక్రమ తవ్వకాలు జరిపారన్న కారణంగా 49 మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు రద్దు చేస్తే అందులో 22 లీజులు కాంగ్రెస్ పార్టీవారివే. బీజేపీ వారివి 3 లీజులు ఉన్నాయి. ఇలా అక్రమ మైనింగ్ కారణంగా లీజులు కోల్పోయిన నలుగురికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఒకరికి టిక్కెట్ ఇచ్చింది. కర్ణాటకలో రద్దయిన 49 లీజుల్లో గాలి జనార్దనరెడ్డికి సంబంధించిన మైనింగ్ లీజు ఒక్కటే ఉందన్న విషయం గమనార్హం.

దివంగత వైఎస్‌పై కక్ష తీర్చుకోవటానికే... 
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకుని అసలు నిర్మాణ పనులే చేపట్టని సంస్థలు అనేకం ఉన్నాయి. వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం బ్రహ్మణి విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపింది. బ్రహ్మణి స్టీల్స్ ఇప్పటికే రూ. 1,350 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయం బ్రహ్మణి యాజమాన్యం ప్రకటించటమే కాదు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు బ్రహ్మణి స్టీల్స్ కర్మాగారంలో కొలతలు వేసి మరీ నిగ్గుతేల్చిన నిజం. ఇందులో రూ. 884 కోట్ల షేర్లను ఈడీ ‘అటాచ్’ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కర్మాగార నిర్మాణానికి బ్రహ్మణి యాజమాన్యం ఖర్చు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయలేదన్న కారణంతో భూములు వెనక్కు లాక్కోవటంలో ఆంతర్యం చనిపోయిన వైఎస్‌పై కక్ష తీర్చుకోవటమే. ఒప్పందం మేరకు నిర్మాణం చేపట్టలేదన్న కారణంగా భూములు వెనక్కు తీసుకున్న ప్రభుత్వం, తనవైపు నుంచి జరిగిన ఉల్లంఘనలపై నోరుమెదపటం లేదు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం బ్రహ్మణికి గండికోట ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. అసలు గండికోట ప్రాజెక్టే పూర్తి కాలేదు. ఇలా ప్రభుత్వం వైపు నుంచి జరిగిన జాప్యాలకు పాలకులు ఏం సంజాయిషీ ఇచ్చుకుంటారు..?

బ్రహ్మణిపై అవ్యాజ్య ప్రేమ ఎప్పుడూ లేదు...
వెనకబడ్డ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వైఎస్ పరితపించారే కానీ, ఆ పేరుతో బ్రహ్మణి పట్ల అవ్యాజ్య ప్రేమను ఎప్పుడూ చూపలేదనే విషయం చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే తేటతెల్లమవుతుంది. వాస్తవంగా ఓబుళాపురం ప్రాంతంలో ఓఎంసీ 93.5 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం ముందుగా దరఖాస్తు చేసింది. ఇందులో 25 హెక్టార్లలో మేలైన ఇనుప ఖనిజం ఉంది. దీనికోసం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) దరఖాస్తు చేసింది. లీజు మంజూరు నిబంధనల్లో ముందు ధరఖాస్తు చేసిన వారికి ముందుగా లీజు మంజూరు చేయాలన్న నిబంధన ఉంది. దీని ప్రకారం వైఎస్ సర్కారు మొత్తం 93.5 హెక్టార్ల మైనింగ్ లీజును ఓఎంసీకే కేటాయించవచ్చు. అయితే వైఎస్ అలా చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలనే తపనతో వెనుక దరఖాస్తు చేసిన ఏపీఎండీసీకే 25 హెక్టార్లలో లీజు కేటాయించాలని అప్పటి వైఎస్ సర్కారు నిర్ణయించింది. మిగిలిన 68.5 హెక్టార్లను మాత్రమే ఓఎంసీకి మైనింగ్ లీజు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

68.5 హెక్టార్లలో మైనింగ్ లీజు పొందిన ఓఎంసీ అదే ప్రాంతంలో దాదాపు 25 హెక్టార్లలో అప్పటికే మైనింగ్ చేస్తోంది. ఈ మైనింగ్ లీజులు మంజూరు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కావటం గమనార్హం. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ముందుకు వచ్చినందునే దీనికి మైనింగ్ లీజు ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఓఎంసీపై వైఎస్ ఎలాంటి ఆశ్రీత పక్షపాతం చూపలేదనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. బ్రహ్మణి యాజమాన్యం గతంలో మైలవరం జలాశయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నించగా ‘హమ్మ.. బ్రహ్మణి’ పేరుతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మణి అక్రమ నీటి తోడకానికి అడ్డుకట్ట వేసి, సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. దివంగత నేత వైఎస్ వెనకబడ్డ ప్రాంతంలో ఫ్యాక్టరీ రావటానికి ప్రయత్నించారే కానీ బ్రహ్మణి మీద అవ్యాజ్య ప్రేమ చూపింది ఎప్పుడూ లేదు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=61518&Categoryid=1&subcatid=18
Share this article :

0 comments: