సీఎం కిరణ్ సరుకుల పొట్లం పథకం.. ఓ బూటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం కిరణ్ సరుకుల పొట్లం పథకం.. ఓ బూటకం

సీఎం కిరణ్ సరుకుల పొట్లం పథకం.. ఓ బూటకం

Written By news on Monday, April 29, 2013 | 4/29/2013

ఆయన తన కష్టాలు చూసుకొని మాత్రం కన్నీళ్లు పెడతారు: షర్మిల
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు
ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే.. 
చంద్రబాబు మద్దతివ్వకుండా సర్కారును కాపాడారు
సీఎం కిరణ్ సరుకుల పొట్లం పథకం.. ఓ బూటకం
బయ్యారం గనుల విషయంలో ఈ ప్రాంత గిరిజనులకు కిరణ్ అన్యాయం చేశారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పాదయాత్ర చేస్తున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ‘చంద్రబాబు గారూ.. మీరు చాలా కష్టపడుతున్నారు’ అని ఆయన పార్టీకి చెందిన నేతలు ఎవరో అన్నారట.. అందుకు చంద్రబాబు బదులిస్తూ ‘అవును చాలా కష్ట పడుతున్నా’ అని చెప్పి కన్నీళ్లు పెట్టారట! ప్రజల కష్టం చూసి ఒక్క సారి కూడా కన్నీళ్లు పెట్టని చంద్రబాబు నాయుడు ఆయన కష్టం చూసి మాత్రం తెగబాధపడిపోయారట. ఇవాళ రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు.
ఈ చేతగాని ప్రభుత్వాన్ని దింపేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే.. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయవద్దని చంద్రబాబు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబుకు ప్రజలపై ప్రేమే ఉంటే ఆ అవిశ్వాసానికి మద్దతిచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏనాడో ఇంటికి సాగనంపేవారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పల్లెల్లో, గిరిజన తండాల్లో సాగింది. ఈ సందర్భంగా ముచ్చెర్లలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె కొద్దిసేపు ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

సరుకుల పొట్లం ఓ బూటకం...
‘‘వైఎస్సార్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే తాను రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నానని ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. మహానేత వైఎస్ బతికే ఉంటే ఈ రోజు 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి 20 కిలోలే ఇస్తున్నారు. వైఎస్ ఉంటే ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం అదనంగా వచ్చేవి. కిలో రూ. 35 అనుకున్నా.. 10 కిలోల బియ్యానికీ రూ.350 ప్రతి నెల ప్రతి కుటుంబానికీ మిగిలేవి. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2 బియ్యాన్ని రూపాయికి తగ్గించడం వల్ల ఒక్కో కుటుంబానికి ఇప్పుడు మిగులుతున్నది కేవలం రూ.20 మాత్రమే. ఇది చాలదన్నట్లు ఇప్పుడేమో సరుకుల పొట్లం పథకంతో ప్రతి కుటుంబానికి రూ. 100 మిగిలిస్తున్నానని కిరణ్ చెప్పుకుంటున్నారు. ఆ సరుకుల పొట్లం ఒక బూటకం. ఆ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. ఆ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసినా రూ. కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ ఈ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పథకాన్ని ప్రారంభించడానికని ఘనంగా మీటింగులు పెట్టి, ప్రచారం కల్పించుకోవడం కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఏదైనా బాగా చేతనవుతుంది అంటే అది కేవలం ప్రచారం చేసుకోవడం మాత్రమే’’ అని షర్మిల దుయ్యబట్టారు.

కిరణ్.. గిరిజనులకు అన్యాయం చేశారు..
‘‘వైఎస్సార్ బయ్యారం గనులను ప్రైవేటు పరం చేయబోతే, తాను విశాఖ ఉక్కుకు ఇచ్చానని ఈ రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. వైఎస్సార్ బయ్యారం గనులను రక్షణ స్టీల్స్‌కు ఇచ్చినప్పుడు, ఆ గనులు ఎప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకే చెందాలని, తెలంగాణ ప్రాంతంలోనే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పారు. మీరు ఇక్కడి ఖనిజాన్ని విశాఖ స్టీల్స్‌కు తరలిస్తూ ఈ ప్రాంత గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? బయ్యారం గనుల్లోని ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్న మీరు ఒక్క సారి ఈ ప్రాంత గిరిజనుల మొఖం చూసి చెప్పండి వాళ్లకు అన్యాయం చేశారని మీకే తెలుస్తుంది’’ అని షర్మిల విమర్శించారు.

13.4 కిలోమీటర్ల మేర యాత్ర
పాదయాత్ర 134వ రోజు ఆదివారం షర్మిల ఖమ్మం నియోజకవర్గం శివాయగూడెం శివారు నుంచి నడక ప్రారంభించారు. మంచుకొండ, బూడిదంపాడు, రాంరెడ్డినగర్, పండితాపురం, ముచ్చెర్ల మీదుగా నడిచారు. ఇదే గ్రామ శివారులోఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. మధ్యలో కాలు నొప్పి వచ్చినప్పటికీ.. దాదాపు 8 కిలోమీటర్లు అలా నొప్పిని భరిస్తూనే నడిచారు. ఆదివారం 13.4 కిలోమీటర్లు యాత్ర చేశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎంవీ మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, స్థానిక నాయకులు మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వరరావు, రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్, భానోత్ పద్మావతి, దళ్‌సింగ్ తదితరులున్నారు.

షర్మిల ఎడమ కాలికి గాయం
షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ సీఎస్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మడమ భాగంలోని కండరానికి గాయమైందని, కనీసం ఒకరోజు విరామం తీసుకోవాలని వారు సూచించారు. దీంతో సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యాత్ర తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 134, కిలోమీటర్లు: 1,809.4
Share this article :

0 comments: