బాబు భరోసానే కిరణ్‌కు అండ.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు భరోసానే కిరణ్‌కు అండ..

బాబు భరోసానే కిరణ్‌కు అండ..

Written By news on Friday, April 26, 2013 | 4/26/2013

- వైఎస్సార్ సీపీ నేత జనక్‌ప్రసాద్ ధ్వజం
- విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను పీక్కుతింటున్నారు
- ఢిల్లీ పెద్దలు, బాబు అండ చూసుకుని పెనుభారం మోపారు
- వైఎస్ హయాంలో ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదు
- రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి కిరణ్, చంద్రబాబులకు లేదు
- బయ్యారం గనులపై టీడీపీది తప్పుడు ప్రచారం 

 హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో పెత్తందారీతనం రాజ్యమేలుతోందని, ప్రజలకు జవాబుదారీ తనం లేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంటెత్తు పోకడలతో మూడు నెలలకోసారి విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి విధానాలను ప్రజలు, సొంత పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా అవేవి పట్టించుకోకుండా ఢిల్లీ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు అండ చూసుకొని ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జనక్‌ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. విద్యుత్‌చార్జీల పెంపు, కరెంటు కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలతో కలిసి ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా ఈ ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని, పేదలపై విద్యుత్ చార్జీల భారం మోపడం లేదంటూనే రూ.34 వేల కోట్ల భారం మోపారని చెప్పారు. ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో4లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, 20లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. 

బాబు భరోసానే కిరణ్‌కు అండ..
టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న భరోసా చూసుకొని కిరణ్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని పీల్చుకుతింటున్నారని జనక్‌ప్రసాద్ పేర్కొన్నారు. ‘చంద్రబాబు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్‌ను గొడ్డళ్లతో, కొడవళ్లతో నరకాలంటారు. కాంగ్రెస్ నేతల చొక్కాలు పట్టాలని పిలుపిస్తారు. దద్దమ్మ ప్రభుత్వం అంటూనే అదే సర్కారును తన భుజాలపై మోస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

అవిశ్వాసం సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడారని ధ్వజమెత్తారు. కిరణ్ పాలన అచ్చం చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటి పాలనను గుర్తుచేస్తోందని తెలిపారు. బాబు హయాంలో కూడా విద్యుత్ చార్జీల ధరలు తగ్గించమని ఉద్యమిస్తే పోలీసుల చేత కాల్పులు జరిపించారని, రైతులపై కేసులు పెట్టారని, బాబును ఆదర్శంగా తీసుకున్న కిరణ్ అవే విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్‌ది ప్రజారంజకపాలన..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనంతా ప్రజారంజకంగా సాగిందని జనక్ పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండా సువర్ణ పాలన అందించారన్నారు. వంటగ్యాస్ ధరను కేంద్రం పెంచినా ఆ భారం ప్రజలపై పడకుండా ఆదుకున్న మహానేత వైఎస్ అని అన్నారు. వైఎస్ మరణం తర్వాత ప్రభుత్వ ఆదాయం రూ.60 వేల కోట్లు పెరిగినా చార్జీలు పెంచి ప్రజలను పీల్చుకుతింటోందన్నారు.

ఐఎంజీ భూములు, నిజాం షుగర్‌లపై మాట్లాడరేం!
బయ్యారం గనుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఐఎంజీ భూములు, నిజాం షుగర్‌ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని జనక్‌ప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున 540 ఎకరాలను దిక్కూమొక్కూలేని ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు కారు చౌకగా కట్టబెట్టారన్నారు. వందల కోట్ల విలువ చేసే నిజాం షుగర్స్‌ను తప్పుడు విధానాలు అవలంభించి తన బినామీ నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. బాబు తన హయాంలో కొన్ని వేల ఎకరాల భూములను అమ్మడమేకాక, ప్రభుత్వ పరిశ్రమలను దివాలా తీయించి తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి వారికి లేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ హయాం నాటి సువర్ణయుగం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని జనక్‌ప్రసాద్ చెప్పారు.
Share this article :

0 comments: