ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను ప్రహసనంగా మారుస్తున్న సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను ప్రహసనంగా మారుస్తున్న సర్కారు

ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను ప్రహసనంగా మారుస్తున్న సర్కారు

Written By news on Monday, April 15, 2013 | 4/15/2013

జూన్‌లో ఎన్నికలు లేనట్టే.. కనీసం 3 నెలలు లేదా నిరవధిక వాయిదా!
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యమే తప్ప ఆచరణ శూన్యం
వీలైనంత కాలం సాగదీసి, ఏదో ఒక సాకుతో అటకెక్కించే ప్రయత్నం
2001 జనాభా లెక్కలను ఆధారం చేసుకుంటే కోర్టు వివాదాలకు ఆస్కారం
ఎందుకంటే అతి త్వరలో అమల్లోకి రానున్న 2011 జనాభా లెక్కలు
అప్పుడు వాటి ఆధారంగానే స్థానిక ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెరగనుండటమే ఇందుకు కారణం
నేరుగా 2011 లెక్కలతో ఎన్నికలకు వెళ్లి ఆ వర్గాలకు లబ్ధి చేకూర్చే చిత్తశుద్ధీ లేని సర్కారు

సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ఓ ప్రహసనంలా మార్చేస్తోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయాలే ఎదురైన నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో జరిగే ఈ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సర్కారు వెనకా ముందాడుతోంది. అందుకే.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమంటూ ఏదో బయటికి మేకపోతు గాంభీర్యం కనబరుస్తోందే తప్ప, ప్రభుత్వ వైఖరిలో మాత్రం అలాంటి ధైర్యం అసలే కన్పించడం లేదు. పైగా ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మరోవైపు 2011 జనాభా లెక్కలు అతి త్వరలో అమల్లోకి రానున్నాయి. వాటి ఆధారంగా పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ విధంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరేందుకు వీలుగా 2011 లెక్కలు అమల్లోకి వచ్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పే పాటి చిత్తశుద్ధి కూడా ప్రభుత్వంలో లోపించింది.

2011 జనాభా లెక్కలు నోటిఫై అయ్యేలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడని పక్షంలో, వాటినే ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు. అప్పుడు రిజర్వేషన్ల ఖరారు మొదలుకుని మొత్తం ప్రక్రియను మొదటి నుంచీ ప్రారంభించాల్సి ఉంటుంది. అందుకు కనీసం మూడు నెలలన్నా పడుతుంది. ఒకవేళ 2011 జనాభా లెక్కలు నోటిఫై అయ్యే లోపే, 2001 లెక్కల ఆధారంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసినా... దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ విషయం న్యాయస్థానాల దాకా వెళ్లే ఆస్కారం లేకపోలేదు. అప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడక తప్పదనే వాదన విన్పిస్తోంది. ఇలా ఏదోలా పంచాయతీ ఎన్నికలను వీలైనంత కాలం సాగదీస్తే... అప్పటికి సాధారణ ఎన్నికల ‘మూడ్’ వచ్చేస్తుంది. లోక్‌సభకు, అసెంబ్లీకి వచ్చే అక్టోబర్, లేదా నవంబర్ నెలల్లోనే ముందస్తు ఎన్నికలు వచ్చే ఆస్కారం లేకపోలేదన్న వాదన కూడా విన్పిస్తోంది. ఒకవేళ అదే జరిగితే పంచాయతీ ఎన్నికలను నిరవధికంగా అటకెక్కించవచ్చన్నది కూడా ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కన్పిస్తోందంటున్నారు. ఏం చేసైనా సరే... సాధారణ ఎన్నికలకు ముందే ‘పంచాయతీ’ రూపంలో ప్రజా తీర్పుకు సిద్ధపడాల్సిన ప్రమాదాన్ని తప్పించుకోవడమే వారి ఉద్దేశమన్న వాదన ప్రబలంగా విన్పిస్తోంది. అంతిమంగా ఎటూ వాయిదా తప్పదన్న ధీమాతోనే, ‘ఏ క్షణంలోనైనా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధం’ అంటూ ప్రభుత్వం బీరాలు పోతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అడుగడుగునా అదే వైఖరి 

పంచాయతీ ఎన్నికల విషయమై ప్రభుత్వ వ్యవహారశైలి మొదటి నుంచీ అంటీముట్టని విధంగానే ఉంటూ వస్తోంది. ఏ క్షణంలోనైనా ఆ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా... పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించడంతో సరిపెట్టిందే తప్ప, అందుకు ఎలాంటి గడువునూ ప్రభుత్వం విధించలేదు. రిజర్వేషన్లను ఖరారు చేసి, వాటిని ఫ్రభుత్వం ఆమోదించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిస్తే తప్ప ఎన్నికల నోటిఫికేషన్ జారీకి అవకాశం లేదు. రిజర్వేషన్ల ఖరారు విధివిధానాలపై పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం రూపొందించిన మార్గదర్శకాలు సోమవారానికి పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందుతాయని సమాచారం. 

తర్వాత ఖరారు ప్రక్రియ పూర్తవడానికి కనీసం 20 రోజులన్నా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంమీద ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21,594 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ లోగానే 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలన్న అంశంలో మాత్రం అధికారులకు ఎలాంటి స్పష్టతా లేదు. ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే అలా చేస్తామని వారంటున్నారు. 2011 జనాభా లెక్కలు నోటిఫై అయిన తరవాత, వాటి ఆధారంగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయిస్తే మొత్తం ప్రక్రియ కనీసం మరో రెండు మూడు నెలలు ఆలస్యమవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్‌లో జరిగేలాకన్పించడం లేదంటున్నారు. త్వరగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెరిగి వారికి లబ్ధి కలుగుతుంది. ప్రభుత్వ పెద్దల్లో మాత్రం... అదే విషయాన్ని పేర్కొంటూ, 2011 లెక్కలు అందుబాటులోకి వచ్చాకే ఎన్నికలు జరుపుతామని చెప్పేపాటి చిత్తశుద్ధి కూడా లోపించింది!

ముమ్మర ఏర్పాట్లలో ఈసీ: రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వారితో సమావేశం కానున్నారు. ఈసీగా తాము చేయాల్సిన పని తాము పూర్తి చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల జాబితాను తమకందిస్తే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. అయితే రిజర్వేషన్ల జాబితాను తమకు ఎప్పుడిస్తారన్న విషయాన్ని ప్రభుత్వాన్నే అడగాలని సూచించడం విశేషం

2011 జనాభా లెక్కలొస్తే...

అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 2011 జనాభా లెక్కలను ఏప్రిల్ 17న గానీ, మూడు నాలుగు రోజులు అటూ ఇటుగా గానీ జనగణన శాఖ ప్రకటించే ఆస్కారం ఎక్కువగా కన్పిస్తోంది. 2013 ఏప్రిల్ మూడో వారంలో జనాభా లెక్కలను నోటిఫై చేస్తామని గతంలో సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లోనూ జనగణన విభాగం స్పష్టం చేసింది కూడా. అదే జరిగితే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత కూడా 2001 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించజూస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ఎందుకంటే తాజా జనాభా లెక్కలతో రిజర్వేషన్లపరంగా లబ్ధి పొందేది దళిత, గిరిజన, బలహీన వర్గాలేనని వారు గుర్తు చేస్తున్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. గత పదేళ్లలో ఈ వర్గాల జనాభా ఎంతగా పెరిగితే ఆ మేరకు రిజర్వేషన్లలో కూడా వారి శాతం పెరగాలి. తద్వారా ఆ మేరకు ఆయా వర్గాలకు రాజకీయాధికారం కూడా పెరిగి రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. అలాగాక 2001 జనాభా లెక్కల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరిగే పక్షంలో... పంచాయతీల్లో తమకు న్యాయంగా పెరగాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని పొందేందుకు వారు మరో ఐదేళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై వారు కోర్టు తలుపులు తట్టే అవకాశముంటుందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అదీగాక, మున్సిపల్ ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహిస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాంటప్పుడు మున్సిపాలిటీల్లాగే స్థానిక సంస్థలైన పంచాయతీల ఎన్నికలను మాత్రం 2001 లెక్కల ప్రాతిపదికన ఎలా నిర్వహిస్తారన్నది మరో మౌలిక ప్రశ్న. 
Share this article :

0 comments: