ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు...

ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు...

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

కేసులకు భయపడి...
హైదరాబాద్‌లో అతి విలువైన భూములను ఐఎంజీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టిన కుంభకోణం, ఎమ్మార్ కేసు చంద్రబాబును నీడలా వెన్నాడుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి ఈ కేసుల భయం కూడా కారణమని టీడీపీ వర్గాలే అంటుంటాయి. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి అసలు ఒప్పందం కుదిరింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే! ఆయన దగ్గరుండి మరీ ఆ ఒప్పందం కుదిర్చారు. అయినప్పటికీ ఎమ్మార్ కేసును విచారిస్తున్న సీబీఐ మాత్రం ఆ కేసులో ఏనాడూ బాబు జోలికి వెళ్లలేదు. ఆయనను కనీసం విచారించలేదు. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీకి 850 ఎకరాల విలువైన భూములను బాబు కారుచౌకగా కట్టబెట్టారు. ఈ కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేందుకే ఆయన కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారన్న వాదనలున్నాయి. తనపై విచారణ జరగకుండా ‘మేనేజ్’ చేసుకునేందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బాబు గట్టిగా నిలబడలేకపోతున్నారని అంటున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరికి రూ.200 కోట్లు బదిలీ చేశానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ వాంగ్మూలమిచ్చిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జరిపిన దర్యాప్తు వివరాలేవీ బయటికి పొక్కకపోవడం వంటి పలు ఉదంతాలు పై వాదనలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. 

సర్కారు పడిపోకుండా అ‘విశ్వాసం’...
ఉప ఎన్నికలు రాకుండా, అదే సమయంలో ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్-టీడీపీ పక్కా అవగాహన మేరకు నడచుకుంటున్నాయి. అవిశ్వాసం పెట్టలేదన్న మచ్చను చెరుపుకునేందుకు తాజాగా బాబు మరో ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. దాని ప్రకారం, మే నెలలో ప్రారంభమయ్యే రెండో విడత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలన్న ప్రణాళికతో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోదన్న నిర్ధారణకు వచ్చాకే ఆ పని చేస్తారని తెలుస్తోంది. ‘ఇటీవల వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాకైతే ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండదు. ఆ సమయంలో అవిశ్వాసం పెడితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు ఉంటుంది’ అన్నది వ్యూహమంటున్నారు. పైగా 15 మంది ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు జరిగే ఆస్కారముందని కాంగ్రెస్, టీడీపీ భయపడుతున్నాయి. అందుకే వారిపై వేటు వేసేనాటి నుంచి అసెంబ్లీ కాల పరిమితి ఏడాది లోపు ఉండేలా చూసి ఉప ఎన్నికలను తప్పించుకునే ఆలోచనతో అవి ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. 

వైఎస్ అనంతరం పెనవేసుకున్న బంధం..
వైఎస్ మరణించిన తర్వాత నుంచి కాంగ్రెస్‌కు చంద్రబాబు సన్నిహితమయ్యారన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా జగన్‌పై సీబీఐ విచారణ జరిపించేలా తెరవెనక తతంగం జరిగినప్పటి నుంచి కాంగ్రెస్‌కు ఆయన బలమైన మిత్రునిగా మారారు. అప్పటినుంచీ కాంగ్రెస్‌కు టీడీపీ అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తూనే వస్తోంది...
* కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి టీడీపీ ఏకంగా పోటీకే దూరంగా ఉంది! పైగా టీడీపీ జెడ్పీటీసీలందరినీ కాంగ్రెస్ ఆర్థిక సాయంతో నిర్వహించిన క్యాంపుకు తర లించి మరీ పోలింగ్ రోజు దాకా వారిని ‘కాపాడుకున్నారు’ చంద్రబాబు. వారందరితో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయించారు కూడా! చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి కిరణ్‌తో బాబు చేతులు కలిపారు. టీడీపీ జెడ్పీటీసీల రెండో ప్రాధాన్యతా ఓట్లన్నింటినీ కాంగ్రెస్‌కే వేయించారు.
* ఇలా కడప, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్‌కు సహకరించినందుకు బదులుగా అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలు టీడీపీ అభ్యర్థికి సహకరించారు.
* 2011లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పరస్పరం రెండో ప్రాధాన్యతా ఓట్లు వేసుకున్నాయి! టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు వేసినట్టు ఓట్ల లెక్కింపులో బయటపడింది.
* బాబు-కిరణ్ పరస్పర సహకార వైఖరి రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలోనూ బట్టబయలైంది. కీలకమైన ఈ పదవికి రాష్ట్ర ప్రముఖులెవరినీ కాదని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన, అది కూడా తెలుగే రాని జస్టిస్ కక్రూ పేరును ప్రభుత్వం ప్రతిపాదిస్తే అందుకు బాబు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్నా ఆయన్ను ‘విస్మరించారు’!
* ఇక సమాచార హక్కు కమిషనర్ల (ఆర్టీఐ) నియామకంలోనూ కిరణ్‌కు బాబు అండగా నిలిచారు. ఏకంగా ఎనిమిది మంది కమిషనర్ల నియామకానికి ప్రతిపాదిస్తే ఒక్కరి విషయంలోనూ చంద్రబాబు అసమ్మతి కూడా వ్యక్తం చేయలేదు. పైగా ఆ జాబితాపై సాక్షాత్తూ గవర్నరే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కూడా బాబు కనీసం నోరు విప్పలేదు.
* చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐల పరిమితి పెంపు నిర్ణయంపైనా బాబు ఇలాగే వ్యవహరించారు. ఆ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుందని ప్రకటించి కూడా... రాజ్యసభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా యూపీఏకు అనుకూలంగా వ్యవహరించినా పట్టించుకోలేదు!
* 2012 మేలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా టీడీపీ బాహాటంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. తమకు గట్టి పట్టుందని చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లోని రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లన్నింటినీ గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థులకు వేయించారు. ఫలితంగా ఆ స్థానాల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీకి అక్కడున్న క్రియాశీలక సభ్యుల సంఖ్య కంటే కూడా తగ్గాయి. దాంతో పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి ఆరు చోట్ల కాంగ్రెస్-టీడీపీ పరస్పరం సహకరించుకున్నాయి.
* సమగ్ర విధానం రూపొందించాకే పరిశ్రమలకు భూ కేటాయింపులుంటాయని అసెంబ్లీలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా కర్నూలు జిల్లాలో ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యెకరాలను తక్కువ ధరకే కట్టబెట్టినా బాబు కిమ్మనలేదు.
* రోశయ్య హయాంలో హైదరాబాద్‌నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో రూ.200 కోట్ల పైగా విలువైన 9.14 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కూడా, నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని మరీ బాబుకు అతి సన్నిహితుడైన జీఎన్ నాయుడుకు కేటాయించింది!

* అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం మలపనగుడి అటవీ ప్రాంతంలోని అత్యంత విలువైన 25 హెక్టార్ల ఓబుళాపురం గనులను చంద్రబాబుకు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అతి సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థకు ధారాదత్తం చేయాలని కిరణ్ సర్కారు నిర్ణయించింది! అందుకోసం ప్రభుత్వ రంగంలోని ఏపీఎండీసీ నోట్లోనే మట్టి కొట్టింది. ఆ గనుల లీజును ఏపీఎండీసీకే ఇవ్వాలని 2005లో వైఎస్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం తోసిరాజంది. ఇందుకోసం.. అటవీ అనుమతులు తెచ్చుకోవడంలో ఏపీఎండీసీ శ్రద్ధ చూపడం లేదంటూ కుంటిసాకులను తెరపైకి తెచ్చింది. ఆ కారణంగా మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదంటూ ఏపీఎండీసీకి నోటీసులు కూడా ఇచ్చింది. తమ ప్రయత్న లోపం లేదని సంస్థ మొత్తుకున్నా విన్పించుకోలేదు. అసలు ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత తనదేనన్న వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ‘విస్మరించింది’! 

అవిశ్వాసంలో దోబూచులాట...
అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌చేస్తే, ‘ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు. ఒకరు చెబితే పెట్టాలా?’ అంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమయ్యే దాకా కాలయాపన చేసి, ప్రభుత్వం పడిపోదని రూఢీ చేసుకున్నాక మాత్రమే అవిశ్వాసం ప్రతిపాదించడం బహిరంగ రహస్యమే. ఇక తాజాగా వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సందర్భంగానైతే మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాబు స్వయంగా గట్టెక్కించారు.

కరెంటు చార్జీలు, ఆర్టీసీ వడ్డన, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, ఆధార్ గందరగోళం, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, మంచినీటి కొరత, గిట్టుబాటు ధరల లేమి, హామీల అమలులో వైఫల్యం... ఇలా అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనా ప్రధాన ప్రతిపక్ష నాయకునిలో చలనమైనా లేకపోవడం చరిత్రలో బాబుకు ముందు ఎప్పుడూ లేదు! పైగా ప్రభుత్వాన్ని నిలదీయాలని, పడగొట్టాలని విపక్షాలన్నీ కోరినా ‘తటస్థ వైఖరి’ మాటున ప్రభుత్వాన్ని బాహాటంగా గట్టెక్కించారు. ప్రభుత్వం మైనారిటీలో పడినట్టు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌తో స్పష్టమైనా, కేవలం బాబు నిస్సిగ్గు నిర్ణయమే కాంగ్రెస్‌కు శ్రీరామరక్షగా మారింది. 

‘మూడో’ శక్తి ఉండొద్దు!
రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలన్న లాలూచీ రాజకీయ అవగాహన కాంగ్రెస్, టీడీపీల వైఖరిలో కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. ‘అయితే కాంగ్రెస్, లేదంటే టీడీపీ మాత్రమే’ అధికారంలో ఉండాలనే అంతర్గత అవగాహనతో అవి ‘ముందుకెళ్తున్నాయి’. మూడో ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ఎదిగితే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడుతున్నాయి. ఆ దుస్థితిని ఎలాగైనా తప్పించుకునేందుకు ఎంతటి నైచ్యానికైనా అవి వెనుదీయడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టయి 10 నెలలు దాటుతున్నా, ఆయనకు బెయిలు రాదని చంద్రబాబు పదేపదే చెబుతుండటం కూడా ఇరు పార్టీల కుట్రకు అద్దం పడుతోంది. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి, వారి సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం మనుగడే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ రాజకీయ జూదమాడుతున్నాయి. 

బాబుకు భలే ప్రతిఫలం...
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీకి సారథిగా ఉంటూ కూడా... మూడేళ్లుగా ఆ పార్టీతో అంటకాగుతున్నందుకు బాబుకు మంచి ప్రతిఫలమే లభించింది.
* ఏ కేసూ బాబు మెడకు చుట్టుకోలేదంటే కాంగ్రెస్ పెద్దల అండదండల వల్లేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది
* ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ ముందు సాక్షిగా జగన్‌విచారణకు హాజరైనప్పుడు, ఆ గనులను కేటాయించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని రుజువు చేసే జీవోను ఆయన అధికారులకు అందజేశారు. అదే విషయాన్ని బయట మీడియాకు కూడా చెప్పారు. దానిపై సీబీఐ ఆగమేఘాల మీద స్పందించింది! దాని పూర్వాపరాలేంటో తెలుసుకోకుండానే, కనీసం విచారణ కూడా చేయకుండానే, ఈ వ్యవహారంతో బాబుకు ఎలాంటి సంబంధమూ లేదంటూ కొన్ని గంటల్లోనే క్లీన్‌చిట్ ఇచ్చేసింది. తర్వాత కూడా ఏనాడూ బాబును విచారించేందుకు కూడా సీబీఐ సాహసం చేయలేదంటే, అప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఆయన మంచి ‘టచ్’లో ఉండటమే కారణమంటారు.
* ఎమ్మార్ కేసులో ఒప్పందం కుదిరిన నాడు ఏం జరిగిందో తేలాలంటే బాబును విచారించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తమైనా సీబీఐ ఆ ప్రయత్నమే చేయలేదు.
* కాంగ్రెస్‌తో లాలూచీకి బాబు పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. బాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ టీడీపీ నేత, కాంట్రాక్టర్‌కు అగమేఘాలపై రూ. 200 కోట్ల బిల్లులు మంజూరవడం అప్పట్లో ఓ సంచలనం. 

ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు...
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కలిసి ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి పన్నిన కుట్రలు, కుయుక్తులకు లెక్కే లేదు! వైఎస్ కుటుంబాన్ని ప్రజా క్షేత్రంలో, రాజకీయంగా దెబ్బ తీయడం అసాధ్యమని తేలిపోవడం వల్లే ఇలాంటి కుట్రలకు తెర తీశారు.
* కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేసీ వేయగానే బాబు కూడా తన మనుషులతో జగన్‌పై మరో పిటిషన్ వేయించారు. రెండు పిటిషన్లలోనూ ఒకే పత్రాలున్న వైనం.. వాటి కుమ్మక్కును వద్దన్నా పట్టించేసింది! పైగా ఆ పత్రాలన్నీ సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం నుంచి టీడీపీ సేకరించినవేనని కూడా తేలిపోయింది.
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలోనేమో... విచారణ జరపాలంటూ హైకోర్టు తీర్పు వచ్చీ రాగానే సీబీఐ ఆగమేఘాలపై 30 బృందాలను ఏర్పాటు చేసి మరీ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. కానీ బాబు అక్రమార్జనపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పుడు మాత్రం అదే సీబీఐ ‘సిబ్బంది లేమి’ సాకు చూపింది. బాబు స్టే తెచ్చుకునేదాకా తాత్సారం చేసింది. అప్పటికే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో బాబు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఆయనపై ఈగ కూడా వాలలేదు.
* ఒకపక్క సీబీఐ విచారణ సాగుతుండగానే మరోపక్కన బాబు తన మనుషులను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రం ఇప్పించిన గంటల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ స్పందించి, జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులిచ్చింది. 

‘ఢిల్లీ’లో గుసగుసలు...!
ప్రజా సమస్యలపై కేంద్రంతో మాట్లాడే సాకుతో ఢిల్లీ వెళ్లడం, ప్రభుత్వ పెద్దలతో ఏకాంతంగా భేటీ అవడం బాబుకు పరిపాటిగా మారింది.
* టీడీపీ నేతలతో పాటుగా ప్రధానిని కలిసిన బాబు, వారందరినీ కనుసైగతో బయటికి పంపి తాను ఏకాంతంగా ముచ్చటించారు
* జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఒకరోజు ముందు కూడా బాబు ఢిల్లీలో అత్యంత గోప్యంగా అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరంతో చీకట్లో భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత స్వయంగా చిదంబరమే ఈ రహస్యాన్ని లోక్‌సభ సాక్షిగా బయటపెట్టారు!
* పీఆర్పీ విలీనానికిముందు అవిశ్వాస తీర్మానం డిమాండ్ వచ్చినప్పుడు, అలా చేయబోనని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చూస్తానని సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌కు బాబు ఫోన్ చేసి మరీ హామీ ఇచ్చిన విషయం పత్రికల్లో వచ్చింది!
Share this article :

0 comments: