మళ్లీ రాజన్న రాజ్యం వస్తేనే పండగ: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ రాజన్న రాజ్యం వస్తేనే పండగ: షర్మిల

మళ్లీ రాజన్న రాజ్యం వస్తేనే పండగ: షర్మిల

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013


పెరిగిన ధరలు, కరెంటు చార్జీలతో రాష్ట్రంలో ప్రజలు బతకడమే కష్టంగా మారిందని, ఉగాది వచ్చినా ప్రజలు పండగలా జరుపుకొనే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘గ్రామాల్లో ఎక్కడా కరెంట్ లేదు.. పొలాలకు లేదు.. ఇళ్లకు లేదు. బిల్లు మాత్రం నాలుగింతలు వస్తోంది. సాగుకు నీరు లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు అందక పిల్లలకు చదువు లేదు.. ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. 

ఉప్పు, పప్పు, బెల్లం అన్ని ధరలూ పెరిగిపోయాయి’ అని ఆమె మండిపడ్డారు. ‘నిజమైన ఉగాది రాజన్న రాజ్యంలోనే వస్తుంది. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. ఆ డబ్బు ఇంటికి తీసుకువచ్చి ఆడవారి చేతుల్లో పెట్టినప్పుడే నిజమైన పండగ వస్తుంది’ అని ఆమె అన్నారు. జగనన్న ఆధ్వర్యంలో త్వరలోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణాజిల్లా నూజివీడు నియోజక వర్గంలో సాగింది. 

నూజివీడు మండలం గొల్లపల్లిలో జరి గిన రచ్చబండలో షర్మిల మాట్లాడుతూ.. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమ్మా.. పండగకు ఎంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నారు? చేతులెత్తండి’ అని అడిగారు. పిల్లలు మాత్రమే చేతులెత్తారు. ‘సరే.. పండగకు ఫలహారాలు ఎంతమంది చేసుకున్నారు?’ అని షర్మిల మరోప్రశ్న వేశారు. కొద్దిమంది మాత్రమే చేతులెత్తారు. పెరిగిన ధరలతో ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని అక్కడివారంతా అన్నారు. దీంతో షర్మిల స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా మర్రిబంధం, గొల్లపల్లిలలో షర్మిల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే..

ప్రజలు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా?
‘రాజశేఖరరెడ్డి బతికిఉంటే ఇప్పుడు ఇస్తున్న నెలకు 20 కిలోలకు బదులుగా 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నవి 20 కిలోలు మాత్రమే. మనం మరో పది కిలోల బియ్యం బయట కొనుక్కోవాల్సి వస్తోంది. బయట మార్కెట్‌లో కిలో బియ్యం రూ. 30 వేసుకున్నా పదికిలోలు అంటే రూ.300 అవుతుంది. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు నెలకు ఈ రూ.300 మిగిలేవి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి బియ్యం 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచకుండా.. ధరను రూ. 2 నుంచి రూ.1కి తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల మీకు మిగులుతుంది కేవలం 20 రూపాయలే. అంటే ఏడాదికి రూ.240. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వస్తోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఇంకా ఒక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక పథకం పెట్టింది. 

ఈ పథకంలో ఉప్పు, నూనె, కారం, పంచదార ఇస్తారట. ఆ ప్యాకెట్లపై ముఖ్యమంత్రి బొమ్మ కూడా వేసుకుంటారట. దీనివల్ల ఒక్కో కుటుంబానికీ నెలకు రూ.100 మిగులుతుందంట. అంటే అటు బియ్యంలో, ఇటు దీనిలో కలిపి కుటుంబానికి ఏడాదికి రూ.1500 మాత్రమే మిగులుతాయి. అదే రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు ఐదేళ్లలో కనీసం 20 వేల రూపాయలు మిగిలి ఉండేవి. ఈ ముఖ్యమంత్రి మిగిల్చింది 1500 మాత్రమే. ఇది చూసి ప్రజలు ఓటు వేయాలట. ప్రజల్ని ఆయన పిచ్చివాళ్లు అనుకుంటున్నారు. (ప్రజలనుద్దేశించి) ఏమ్మా మీరు పిచ్చివాళ్లా? మీరు అమాయకులా? నెలకు వంద రూపాయలు మిగిలితే సరిపోతుందా?

ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆయుష్షు లేదు
కరెంట్ నిల్ - బిల్ ఫుల్ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది. విద్యుత్ చార్జీల పేరుతో ఏకంగా రూ.32 వేల కోట్ల భారం వేసి ప్రజల రక్తం పిండాలనుకుంటున్నారు. వ్యాట్ పేరుతో మరో రూ.10 వేల కోట్ల భారం వేశారు. ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆయుష్షు లేదు. మహా అయితే ఆరు నెలలో, సంవత్సరమో ఉంటుంది. వీరి పాపం పండింది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. ‘ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారు. 

తెలుగుదేశం, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. త్వరలోనే జగనన్న ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో రైతేరాజు అవుతాడు. రాజన్న రాజ్యం రాగానే రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండవు. గుడిసెలు లేని రాష్ట్రంగా మారుస్తాం. ప్రతి ఒక్కరికీ పక్కాగృహాలు వస్తాయి. వృద్ధులు, వితంతువులకు పింఛన్ రూ.700, వికలాంగులకు రూ.1000కి పెరుగుతుంది. మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు వస్తాయి. ఏ ఒక్కరూ డబ్బులేక చదువుకోవడం మానివేసే పరిస్థితి ఉండదు. పిల్లల్ని బడికి పంపించే తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాం.’

13.5 కిలోమీటర్లు సాగిన యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 117వ రోజు గురువారం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం సీతారామపురం నుంచి ప్రారంభమైంది. మర్రిబంధం, మీర్జాపురం, గొల్లపల్లి మీదుగా పోనసానపల్లి క్రాస్‌రోడ్స్ వరకు సాగింది. మార్గమధ్యంలో పామాయిల్, మొక్కజొన్న రైతులతో మాట్లాడి షర్మిల సమస్యలు తెలుసుకున్నారు. మహనీయుడు జ్యోతిరావు పూలే 187వ జయంతి సందర్భంగా మర్రిబంధంలో ఆయన చిత్రపటానికి షర్మిల నివాళుల ర్పించారు. పోనసానపల్ల్లిలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె 13.5 కిలోమీటర్లు మేర నడిచారు. ఇప్పటివరకూ మొత్తం 1,586.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, నాయకులు సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు, గోసుల శివభరత్‌రెడ్డి, ముసునూరి రత్నబోస్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: