లక్ష కనెక్షన్లకు ఉచితం కట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష కనెక్షన్లకు ఉచితం కట్

లక్ష కనెక్షన్లకు ఉచితం కట్

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013

పాత నిబంధనలు సరికొత్తగా తెరపైకి
2004 నుంచి 9 ఏళ్ల బిల్లులూ కట్టాలంటూ తాఖీదులు
ఏడాదికి ఏకంగా రూ. 10,000 దాకా బాదుడు
మీటర్లే లేకున్నా విచిత్ర పద్ధతుల్లో లెక్కింపు
ఇక నుంచి నెలనెలా బిల్లు బాదుడు
పైగా రైతుల గోళ్లూడగొట్టేలా సర్వీస్ చార్జీల మోత
ఎనిమిదేళ్ల కాలానికి రూ.1,920 దాకా వడ్డింపులు
వాటిని కట్టని రైతుల ఇంటి కరెంటు కనెక్షన్ కట్!
మరో 4, 5 లక్షల కనెక్షన్లకూ పొంచి ఉన్న ముప్పు

 ఉచిత విద్యుత్‌కు పరిమితులు విధించేందుకు ప్రభుత్వం పలు రకాలుగా పథక రచన చేస్తోంది. ఇందుకోసం పాత నిబంధనలను సరికొత్తగా తెరమీదకు తెచ్చింది. వాటిప్రకారం 1,17,480 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసింది! అంటే 3.7 శాతం వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడిందన్నమాట. ఇందుకు మాగాణి 2.5 ఎకరాల కంటే ఎక్కువగా ఉండటం, వ్యవసాయ కనెక్షన్లు 3 కంటే ఎక్కువ ఉండటం వంటి సాకులు చూపింది. ఆ కనెక్షన్లపై రైతుల నుంచి విద్యుత్ చార్జీల వసూలును కూడా ప్రారంభించింది. అది కూడా 2004 నుంచి! అంటే రైతుల నుంచి సుమారు 9 ఏళ్ల పాటు బకాయిలను కూడా రాబట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో బిల్లుల జారీ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

ఇక ఐఎస్‌ఐ మోటారు పంపు సెట్లు లేవనే సాకుతో త్వరలో మరో 4 నుంచి 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇలా మొత్తంగా పథకాన్నే మెల్లిగా అటకెక్కించే దిశగా కదులుతోంది. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న నిబంధనలు 2004 నుంచీ ఉన్నవే. కానీ అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వాటిని ఏ రోజూ అమలు చేయలేదు. నిబంధనలెలా ఉన్నా రైతులపై భారం మోపకూడదని ఆయన భావించారు. అందుకే ఆదాయపు పన్ను చెల్లించే, కార్పొరేట్ రైతులను మినహాయించి మిగతా ఏ ఒక్క రైతు నుంచీ చార్జీలు వసూలు చేయలేదు. కానీ వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ఈ పాత నిబంధనలకు బూజు దులిపింది!

అన్నదాతపై ‘పాత’ మోత

వాస్తవానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే కొన్ని నిబంధనలు విధించారు. కానీ వైఎస్ హయాంలో వాటిని ఎప్పుడూ పాటించలేదు. కానీ... పాత నిబంధనలను కొత్తగా తెరపైకి తెస్తున్న ప్రభుత్వం, రైతుల నుంచి పాత బకాయిలను కూడా వసూలు చేస్తోంది. ఇలా 2004 నుంచీ పాత బకాయిలు చెల్లించాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 1.17 లక్షల పై చిలుకు వ్యవసాయ కనెక్షన్లకు ఇప్పటికే బిల్లుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. సగటున ఒక్కో రైతుకు రూ.10 వేల నుంచి 15 వేల దాకా పాత బకాయిలు వడ్డిస్తోంది. కానీ ఇలా పాత బకాయిలను వసూలు చేయడం సరికాదని విద్యుత్ చట్టం స్పష్టంగా చెబుతోంది. అందులోని సెక్షన్ 56, క్లాజ్ 2 ప్రకారం ‘బకాయి ఉన్న విషయాన్ని వినియోగదారునికి రెండేళ్ల లోపు తెలియజేసి వాటిని వసూలు చేసుకునే అవకాశం విద్యుత్ సంస్థలకుంది. రెండేళ్లకు పైగా బకాయి ఉంటే ఆ విషయాన్ని వినియోగదారుకు తెలియచేయకుండా బిల్లు వసూలు చేయకూడదు. అతనికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయకూడదు’. అలా చూస్తే ప్రభుత్వానికి రెండేళ్ల లోపు బకాయిలను మాత్రమే వసూలు చేసుకునే వెసులుబాటుంది. అయినా విద్యుత్ చట్టానికి నిలువునా తూట్లు పొడుస్తూ రైతులపై స్వారీ చేస్తోంది.

బిల్లింగ్.. బహు చిత్రం..!

వాస్తవానికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేవు. దాంతో వాటికి 2004 నుంచి పాత బకాయిలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఒక విచిత్రమైన లెక్కను తెరపైకి తెచ్చింది. సాగుకు 5 హెచ్‌పీ సామర్థ్యమున్న మోటార్లు వాడుతున్నారు. దానికి గంటకు 3.73 యూనిట్ల కరెంటు కాలుతుంది. సాగుకు రోజుకు 7 గంటలు ఉచిత విద్యుత్ ప్రాతిపదికన రోజుకు 26.11 యూనిట్లు, నెలకు 783.3, యూనిట్లు, ఏడాదికి 9,399.6 యూనిట్లు కాలుతుంది. కేటగిరీని బట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి రూపాయి టారిఫ్ చొప్పున ఏడాదికి రూ.5,000 నుంచి రూ.10,000 దాకా బిల్లు చెల్లించాలంటూ ఒక్కో రైతుకు నోటీసులు పంపుతున్నారు. 2004 నుంచీ కట్టలేదు గనుకమొత్తం తొమ్మిదేళ్ల కాలానికి బిల్లు చెల్లించాలంటూ నోటీసులిస్తున్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులుండవన్నది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు రోజుకు 7 గంటల చొప్పున ఏడాది పొడవునా ఎలా లెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. సాగుకు రోజుకు 7 గంటలు కరెంటివ్వడం లేదని ప్రభుత్వ అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అయినా కేవలం ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా ఇలాంటి చిత్ర విచిత్ర లెక్కలు, బిల్లుల మోతలకు తెర తీశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నెన్నో ని‘బంధనా’లు

రైతుల నుంచి ప్రతి నెలా వసూలు చేయాల్సిన సర్వీసు చార్జీలను కూడా వైఎస్ హయాంలో ఏనాడూ వసూలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటిని 2004 నుంచీ రాబట్టుకోజూస్తోంది! నెలకు రూ.20 చొప్పున ఏడాదికి రూ.240 లెక్కన 2011 దాకా 8 ఏళ్లకు రూ.1,920 మేరకు సర్వీసు చార్జీల బకాయిలను వసూలు చేస్తోంది. వాటిని రాబట్టుకునేందుకు ఇంటి కరెంటు బిల్లుకు, పంటకు లంకె వేసింది! ఇంటి కరెంటు బిల్లులోనే వ్యవసాయ సర్వీసు చార్జీ బకాయిలను కూడా కలిపి మరీ బిల్లులు జారీ చేస్తోంది. చెల్లించని రైతుల ఇంటి కరెంటు కనెక్షన్ కట్ చేసింది. పైగా సర్వీసు చార్జీని 2012 నుంచి నెలకు రూ.30కి పెంచింది. 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి ఉన్న రైతులతో పాటు 3 కంటే ఎక్కువ కనెక్షన్లున్న ఆరుతడి పొలం యజమానుల నుంచి కూడా చార్జీల వసూలు ప్రారంభించారు. వీటితో పాటు మున్ముందు ‘ఐఎస్‌ఐ మోటారు పంపు సెట్టు ఉండాలి’ వంటి డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఎం) నిబంధనలను కూడా తెరపైకి తెచ్చి మరో నాలుగైదు లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేయజూస్తోంది.
Share this article :

0 comments: