ఇదేం చార్జి ‘చీట్’ ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదేం చార్జి ‘చీట్’ !

ఇదేం చార్జి ‘చీట్’ !

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013


‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఏడు అంశాల్లో దర్యాప్తు మిగిలి ఉందంటూ సుప్రీంకోర్టుకు గతంలో నివేదిక
దర్యాప్తు పూర్తిచేసి ఒకే తుది చార్జిషీటు వేస్తామని సెప్టెంబర్‌లో హామీ
అలా వేశాక జగన్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
ఆ ఏడంశాల్లో నాలుగవ అంశమే దాల్మియా సిమెంట్
తీరా ఏడు నెలలు గడిచాక ఇప్పుడు ఒక్క దాల్మియాపైనే చార్జిషీటు
మిగిలిన అంశాలపై మరిన్ని చార్జిషీట్లుంటాయని పరోక్ష సంకేతాలు!
సుప్రీంకోర్టు ఉత్తర్వులనూ లెక్కచేయని సీబీఐ తీరు
తుది చార్జిషీటు వేసేస్తే జగన్‌కు బెయిలు వస్తుందనే భయం
ఒక్కో కోర్టులో ఒక్కో మాట, జగన్‌ను వ్యతిరేకించే మీడియాతో దోస్తీ
అరెస్టు నుంచి బెయిలు దాకా ప్రతిచోటా నిబంధనలకు తూట్లే
సాధ్యమైనంతవరకు ఆయన్ను జనానికి దూరంగా ఉంచే యత్నం
రాజకీయ బాసుల్ని మెప్పించటానికి విలువలకు నీళ్లొదిలిన సీబీఐ

మంథా రమణమూర్తి, సాక్షి: ప్రజాభిమానం సంపాదించిన ఒక నాయకుడిని జనానికి దూరంగా ఉంచటానికి పన్నిన కుట్ర మరీ పచ్చిగా బయటపడుతోంది. నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కేసి, అత్యున్నత న్యాయ వ్యవస్థలను సైతం ధిక్కరిస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న సీబీఐ తీరు... ఔరా అనిపిస్తోంది. మాటలకు చేతలకు పొంతన లేకుండా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థ ఏం చేయకూడదో దాన్నే చేస్తుండటం స్పష్టంగా కళ్లకు కడుతోంది. ‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో ఒక దర్యాప్తు సంస్థగా తనకున్న లక్ష్మణరేఖలన్నిటినీ సీబీఐ ఇప్పటికే ఉల్లంఘించేసింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జనానికి దూరం చేయడానికి ఆఖరికి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వంగా ఇచ్చిన హామీని సెతం పక్కనబెట్టేసింది. సుప్రీం తీర్పునూ ధిక్కరించింది.

ఈ కేసు దర్యాప్తులో ఆది నుంచీ ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీసిన సీబీఐ... ఇంకా ఏడంశాలు మిగిలి ఉన్నాయని, వాటిపై దర్యాప్తు పూర్తి చేసి ఒకే ఒక తుది చార్జిషీటు వేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. సీబీఐ న్యాయవాది పరాశరన్ పేర్కొన్న ఈ అంశాలను తన ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపిన సుప్రీంకోర్టు... ఆ చార్జిషీటు వేశాక, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ సీబీఐ మరోసారి దారితప్పింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు వస్తుందన్న భయంతోనో మరే కారణంతోనో కానీ... ఇప్పటికీ తుది చార్జిషీటు వేయలేదు. సరికదా సుప్రీం తీర్పును ధిక్కరిస్తూ సోమవారం మరో మధ్యంతర చార్జిషీటు దాఖలు చేసింది. పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన ఏడంశాలకు గాను... దాల్మియా సిమెంట్స్ అనే ఒక అంశాన్ని మాత్రమే దీన్లో పేర్కొంది. అంటే ఇంకా ఆరు అంశాల్లో దర్యాప్తు మిగిలి ఉందని, వీటిపై మరిన్ని చార్జిషీట్లు వేస్తామని చెప్పకనే చెప్పింది.

ఒకో కోర్టులో ఒకో మాట...

బహుశా... ఏ కేసులోనూ, ఏ దర్యాప్తు సంస్థా ఈ రకంగా చేసి ఉండలేదేమో!! జగన్‌మోహ న్‌రెడ్డి కాకుంటే... ‘సాక్షి’ కాకుంటే... సీబీఐ కూడా ఈ కేసులో ఇలా చేసి ఉండేది కాదేమో!! ఎందుకంటే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అన్నిచోట్లా పొంతనలేని మాటలు చెప్పటం... చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవటమే ఈ కేసులో వైచిత్రి. సుప్రీంకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు పిటిషన్ వేసినప్పుడు... కోర్టు బెయిలిచ్చేస్తుందేమో అని సీబీఐ చాలానే భయపడింది. అందుకే... ఏడంశాలపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, ఆయనకు బెయిలిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని వాదించింది. అదే సీబీఐ... రెండు నెలలు గడిచేసరికి గతేడాది డిసెంబర్‌లో హైకోర్టులో మాట మార్చింది. 90 రోజుల్లో చార్జిషీటు వేయలేదు కనక స్టాట్యుటరీ బెయిలు ఇవ్వాలని జగన్ తరఫు లాయర్లు పేర్కొనటంతో... ‘‘ఆయన్ను అరెస్టు చేసింది ఆ ఏడంశాల్లో కాదు. వాన్‌పిక్ కేసులోనే. దాన్లో చార్జిషీటు వేశాం కనుక స్టాట్యుటరీ బెయిలు ప్రసక్తే లేదు’’ అంటూ వాదించింది. పెపైచ్చు అన్ని అంశాలకూ కలిపి ఒకే తుది చార్జిషీటు వేస్తామని హైకోర్టులో కూడా సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టంగా చెప్పారు.

కానీ మళ్లీ అందుకు పూర్తి భిన్నంగా సీబీఐ వ్యవహరించింది. ఇటీవల సీబీఐ కోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా... త్వరలో మూడు సిమెంట్ కంపెనీల వ్యవహారంపై చార్జిషీటు వేస్తామని సీబీఐ చెప్పటంతో సీబీఐ తీరును జడ్జి తప్పుబట్టారు. ‘‘ఒకే చార్జిషీటు వేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పారు కదా?’’ అని కూడా ప్రశ్నించారు. కానీ దానికి సీబీఐ ఏమని జవాబిచ్చిందో తెలుసా...? తాము సుప్రీం కోర్టుకు ఆ విషయాన్ని మౌఖికంగానే చెప్పాం తప్ప లిఖితపూర్వకంగా కాదని..!! మరి లిఖితపూర్వకంగా సీబీఐ ఈ వాదన చేసినట్లు, దాన్ని నెరవేర్చాక పిటిషనర్ బెయిలు దరఖాస్తు వేయొచ్చని పేర్కొంటూ సుప్రీం ఉత్తర్వులెందుకిచ్చింది? ఇక్కడ తప్పు సీబీఐదా... లేక సుప్రీంకోర్టుదా? ఇంకా ఘోరమైన అంశమేంటంటే సీబీఐ కోర్టులో వాదనల సందర్భంగా మూడు సిమెంట్ కంపెనీలకు సంబంధించి త్వరలో చార్జిషీటు వేస్తామని చెప్పిన సీబీఐ... సోమవారం ఒకే ఒక సిమెంట్ కంపెనీ పెట్టుబడికి సంబంధించి చార్జిషీటు వేయటం. అంటే కింది కోర్టులో చెప్పినదాన్ని కూడా పాటించలేదన్న మాట!!!.

అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.. మరి ఇప్పుడు?

దర్యాప్తు పూర్తయి తుది చార్జిషీటు వేశాక బెయిలు కోసం దరఖాస్తు చేయొచ్చని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయని పక్షంలో స్టాట్యుటరీ బెయిలు అడిగే హక్కు నిందితుడికి ఉంటుందని, దీన్ని సుప్రీంకోర్టు కాదుకదా ఎవ్వరూ ఆపజాలరని పేర్కొంటూ జగన్ తరఫు లాయర్లు గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనల సందర్భంగా సీబీఐ ప్రస్తావించిందల్లా సుప్రీంకోర్టు తీర్పునే. దర్యాప్తు పూర్తయి తుది చార్జిషీటు వేశాకే బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం చెప్పిందని, అందుకని బెయిలివ్వరాదని వాదించింది. చివరకు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించింది. ఇలా అన్నిచోట్లా సుప్రీం తీర్పును గుర్తుచేస్తూ వాదించిన సీబీఐకి ఇప్పుడు అది గుర్తుకు రాలేదా? దర్యాప్తు పూర్తిచేసి ఒకే తుది చార్జిషీటు వేస్తామని సుప్రీంకు తానిచ్చిన హామీ కానీ, అలా చేయాలని సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులు గానీ దీనికి గుర్తు లేవా? దేనికోసం ఇదంతా? కాంగ్రెస్ పెద్దలను మెప్పించి పదోన్నతులు తెచ్చుకోవటానికా? లేక వేరొక ఎల్లో పార్టీని మెప్పించి ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకోవటానికా? వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ ఇలా టార్గెట్ చేసి వేధిస్తున్నది దేనికోసం? ఎవరికైనా ఒక మనస్సాక్షి అనేది ఉంటుందిగా..! అది సీబీఐకి లేదా?

సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే...

గత ఏడాది మే 27న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అది కూడా మరో 24 గంటల్లో కోర్టుకు హాజరై సొంత పూచీకత్తుపై బెయిలు తీసుకుంటారనగా!! అలా బెయిలు తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయలేమన్న ఉద్దేశంతో హడావుడిగా అర్ధరాత్రి అరెస్టు చేసింది. బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కిందికోర్టు, హైకోర్టు తిరస్కరించటంతో ఆగస్టులో జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై వాదప్రతివాదాలు జరిగాయి. దర్యాప్తు ఏ దశలో ఉందని సుప్రీంకోర్టు అడగటంతో... సీబీఐ ఒక నివేదిక సమర్పించింది. దాన్లో ఈ కేసుకు సంబంధించి ఏడంశాల్లో దర్యాప్తు ఇంకా సాగుతోందని తెలియజేసింది. మరి దర్యాప్తు పూర్తి చేయటానికి ఎన్నాళ్లు పడుతుందని కోర్టు ప్రశ్నించటంతో... మరో మూడునెలలు సరిపోతుందని సీబీఐ న్యాయవాది పరాశరన్ బదులిచ్చారు.

సీబీఐ మాట ప్రకారం... అది అక్టోబరు నెల కాబట్టి డిసెంబరు 31 నాటికి దర్యాప్తు పూర్తికావాలి. కానీ మళ్లీ మళ్లీ పొడిగింపులు అడగకూడదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు 2013 మార్చి 31 నాటికల్లా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పింది. అయితే సీబీఐ అడిగిన మూడు నెలల గడువుకన్నా అధికంగా మరో మూడు నెలలు ఇవ్వటాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం తీవ్రంగా వ్యతిరేకించారు. మరో ఆరునెలలు జగన్‌ను జైల్లో ఉంచటం సరికాదని, ఉత్తర్వుల్లో అలాంటి గడువును పేర్కొనవద్దని గట్టిగా వాదించారు. ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని మన్నించిన సుప్రీం కోర్టు... తన ఉత్తర్వుల్లో ఎలాంటి గడువు తేదీనీ పేర్కొనలేదు. అయితే సీబీఐ సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తిచేసి ఒకే తుది ఛార్జిషీటును వేస్తామందని, అలా వేశాక బెయిలు కోరవచ్చని స్పష్టంగా పేర్కొంది.

జగన్‌మోహన్‌రెడ్డి తరఫు లాయరు వాదనను మన్నించి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో గడువును పేర్కొనలేదు. లేనిపక్షంలో అది ఈ ఏడాది మార్చి 31వ తేదీని గడువుగా పేర్కొని ఉండేది. దీనర్థం... సీబీఐ అంతకుముందే ఛార్జిషీటు వేయాల్సి ఉందని..!! కానీ సీబీఐ ఏం చేసిందో తెలుసా? సుప్రీంకోర్టు తనకెలాంటి గడువూ పెట్టలేదని, తాము దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని పేర్కొంటూనే... మార్చి 31వ తేదీని కూడా దాటేసింది. దీనికన్నా దివాలాకోరు తనం ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా? ఇదంతా చాలదన్నట్లు... మూడు నెలల్లో ముగిస్తామని చెప్పిన 7 నెలల తరవాత... సోమవారంనాడు ఒకే అంశంపై చార్జిషీటు వేయటం!!. ఒక వ్యక్తిపై, ఒక కుటుంబంపై దర్యాప్తు సంస్థ ఇంతలా పగబట్టడం బహుశా! భారతదేశ చరిత్రలో ఇంకెన్నడూ జరిగి ఉండలేదేమో!! వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల్లో తిరుగులేని ఆదరణ లేకపోయినా ఇలా జరిగి ఉండేది కాదేమో!! రాష్ట్రంలో అన్నిటా విఫలమైన రాజకీయ పార్టీలకు తిరుగులేని ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించటం... ప్రతి ఎన్నికలోనూ విజయభేరి మోగించటమే ఆయన నేరమా?


చార్జిషీట్ల ప్రహసనం...
జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టులో దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ... మార్చి 31న ఒక ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జిషీటంటే దర్యాప్తు పూర్తయ్యాక కోర్టుకిచ్చే తుది నివేదిక. కానీ సీబీఐ ఇదే కేసులో ఏప్రిల్ 23న మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. మే 7వ తేదీన ఇంకొకటి, ఆగస్టులో మరొకటి వేసింది. ఇంకా ఛార్జిషీట్లు వేస్తూనే ఉంటామని చెప్పింది. ఇది జగన్‌ను బెయిలుపై బయటకు రాకుండా చేయటానికేని ఎన్నో విమర్శలు రావటమే కాదు. ప్రతి సందర్భంలోనూ రుజువవుతూ వస్తోంది కూడా!!

ఆది నుంచీ రాంగ్ రూట్లోనే...

ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించటంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి వై.ఎస్.జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధానారోపణ. కేంద్రంలోనైనా... ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినపుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా? కాదా? అని. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారా లేక నిబంధనల ప్రకారమే అదంతా జరిగిందా అని. నిజంగా ప్రభుత్వ నిర్ణయం తప్పు అని తేలితే... అప్పుడు ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పోఒప్పో పట్టించుకోలేదు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసి... ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయీ ఎలా వచ్చిందో శోధిస్తోంది. సదరు ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూస్తోంది. ఒకవేళ పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనని వాదిస్తూ వారిని వేధిస్తోంది. దారుణమేంటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెడుతోంది. పెపైచ్చు వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకించే ఒక వర్గం మీడియాకు లీకులిచ్చి మరీ కథనాలు రాయిస్తూ... వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయటమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీన్నేమంటారు?

గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టుకు ప్రత్యేక నోట్‌ను సమర్పించిన సీబీఐ... ఈ కేసుకు సంబంధించి ఏడంశాల్లో దర్యాప్తు ఇంకా సాగుతోందని తెలియజేసింది. అవి...

1.సాండూర్ పవర్ లిమిటెడ్ 2.జగన్‌మోహన్ రెడ్డికి చెందిన భారతీ/రఘురామ్ సిమెంట్స్‌కు మైనింగ్ లీజు మంజూరు 3.పెన్నా సిమెంట్స్, ఇతర గ్రూపు కంపెనీలు 4. దాల్మియా సిమెంట్స్, 5.ఇండియా సిమెంట్స్ 6. సూట్‌కేసు కంపెనీలుగా పేర్కొనే కోల్‌కతా, ముంబాయిల్లోని కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడులు 7. ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్‌హబ్.

ఈ అంశాలన్నీ దాదాపు రూ.3000 కోట్లకు సంబంధించినవని, వీటిపై దర్యాప్తు సాగిస్తున్నామని కూడా సీబీఐ తెలిపింది. ‘‘.... ఏమాత్రం సమయం వృథా చేయకుండా సీబీఐ ఈ అంశాలపై దర్యాప్తు సాగిస్తోందని పరాశరన్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని, ఆ వెంటనే ఒకే ఛార్జిషీటు దాఖలు చేస్తామని ఆయన కోర్టుకు హామీనిచ్చారు. ఇరువురి వాదనలూ విన్నాక, సీబీఐ నివేదిక చూశాక ఈ దశలో జోక్యం చేసుకోలేకపోతున్నాం. అందుకని ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. అయితే పైన పేర్కొన్న అంశాలపై సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసి తుది ఛార్జిషీటును దాఖలు చేసిన వెంటనే బెయిలు కోసం పిటిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చరు. అలాంటి పిటిషన్ వేసిన పక్షంలో కోర్టు స్వతంత్రంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’’ 
Share this article :

0 comments: