క్షమాపణలు చెప్పకపోతే జరగబోయే పరిణామాలను .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్షమాపణలు చెప్పకపోతే జరగబోయే పరిణామాలను ..

క్షమాపణలు చెప్పకపోతే జరగబోయే పరిణామాలను ..

Written By news on Monday, April 29, 2013 | 4/29/2013

వైఎస్ కుటుంబంపై, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
మంత్రిగా కొనసాగే అర్హత ఆనంకు లేదు: జనక్ ప్రసాద్
జగన్‌కు ఉరేయాలంటూ ఆయన న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేలా మాట్లాడారు
కేసు దర్యాప్తు దశలో ఉండగా.. ఈయనే తీర్పు చెప్పేలా మాట్లాడారు..
‘చట్టాన్ని పక్కన పెడతా’మంటూ రాజ్యాంగాన్ని ధిక్కరించేలా వ్యాఖ్యలు చేశారు
దుర్బుద్ధితో మా నాయకుల పరువుకు భంగం కలిగించేందుకు యత్నించారు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్ కుటుంబీకులపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుర్బుద్ధితో చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలతోపాటు పార్టీపై ఆయన చేసిన నిరాధార ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మంత్రికి వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ ఉపాధ్యక్షుడు కె.శివకుమార్ లీగల్ నోటీసు పంపారు. పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. శివకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఆనం... రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల పరువుకు భంగం కలిగించేలా నీచాతి నీచమైన, నేర ప్రవృత్తితో కూడిన నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ద్రోహబుద్ధితో ఆరోపణలు చేసి మంత్రివర్గానికే క ళంకం తెచ్చిన ఆనంకు మంత్రిగా కొనసాగే అర్హతలేదని దుయ్యబట్టారు. మంత్రి హోదాను దుర్వినియోగం చేసినందుకు సీఎం కిరణ్ తన కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాలని, లేకుంటే ఈ అంశంపై గవర్నర్ జోక్యం చేసుకొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టు, రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన ఆనం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశమని, కేసులో దర్యాప్తు కూడా ఇంకా పూర్తికాలేదని జనక్ గుర్తుచేశారు. అయితే బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్న ఆనం.. అప్పుడే ఈ కేసులో తీర్పు చెప్పేలా మాట్లాడారని, జగన్‌మోహన్‌రెడ్డిని ఉరి తీసినా తప్పులేదంటూ న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు యత్నించారని జనక్ పేర్కొన్నారు.

ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు. చట్టాన్ని పక్కన పెడితే, మొదటి ఉరి జగన్‌మోహన్‌రెడ్డికేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. రాజ్యాంగ ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయకపోయినా కాంగ్రెస్‌ను ఎదిరించారనే కారణంతో కుట్ర చేసి అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా మంత్రి ఆనం తీర్పు చెప్పే విధంగా మాట్లాడటం ప్రజాద్రోహం. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారం మాట్లాడుతూ... ట్రయల్ కోర్టు, హైకోర్టులను ప్రభావితం చేసి జడ్జిమెంట్‌ను మీకు అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఇప్పించాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘26 జీవోలు చట్ట ప్రకారమే వెలువడ్డాయని సీఎం కిరణ్ చెప్తారు. ఆ జీవోలు చట్ట ప్రకారమైతే నేరం ఎక్కడిది? ఏవిధంగా జగన్‌పై ఆరోపణలు చేస్తారు?’’ అని నిలదీశారు.

చంచల్‌గూడ జైలును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆనం చెప్పడాన్ని జనక్ తప్పుపట్టారు. ‘‘ప్రభుత్వం మీదే. జైళ్లశాఖ మీ చేతిలోనే ఉంది. అంటే అధికారులు మీ నియంత్రణలో లేరా? జైలులో పార్టీ సమావేశాలు జరుగుతుంటే మీ ప్రభుత్వం గడ్డి పీకుతోందా? జైలును కంట్రోల్ చేయకపోతే మీరు ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలను ఏవిధంగా పాలిస్తారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘జైళ్ల శాఖ ఐజీ మాట్లాడుతూ... నిబంధనల మేరకే జగన్ ములాఖత్‌లు జరుగుతున్నాయంటారు. మీరు అందుకు విరుద్ధంగా మాట్లాడారు. ఇద్దరి స్టేట్‌మెంట్లలో ఎవరిది కరెక్టు?’’ అని అడిగారు. మంత్రి ఆనం తప్పుడు వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తే.. సిగ్గుతో తలదించుకొని పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఆనం చరిత్ర ప్రజలకు తెలుసు..

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం ఆనం సోదరులదని, వారి చరిత్ర నెల్లూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసని జనక్ పేర్కొన్నారు. అవకాశవాదంతో ఎన్ని పార్టీలైనా మారతారని ఎద్దేవా చేశారు. ‘‘ఆనం సోదరులు మొదట జనసంఘ్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత జనతా పార్టీలోకి దూకారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవులు అనుభవించారు. చివరకు వైఎస్ కాళ్లు పట్టుకొని కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేలు అయి మంత్రి పదవులు అనుభవిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తులు ప్రస్తుతం అవకాశవాదంతో ఢిల్లీ పెద్దల మెప్పు పొందేందుకు వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఆనం సిద్ధంగా ఉండాలని పార్టీ ఉపాధ్యక్షుడు కె. శివకుమార్ హెచ్చరించారు.
Share this article :

0 comments: