దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా తుది విచారణా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా తుది విచారణా?

దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా తుది విచారణా?

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

* ఇలా చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు
* అత్యున్నత న్యాయస్థానమూ ఇందుకు సమ్మతించలేదు
* ఈ మేరకు ఐదు కేసుల్లో స్పష్టంగా తీర్పులిచ్చింది
* దర్యాప్తు పూర్తయ్యాకే తుది విచారణ చేపట్టాలి
* ఇరు వర్గాల వాదనలు పూర్తి.. తీర్పు మే 6కు వాయిదా
* సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్
* జగన్, సాయిరెడ్డి తరఫున సీబీఐ కోర్టులో వాదనలు 

- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సీబీఐ స్వయంగా అంగీకరిస్తోంది. త్వరలో మూడు చార్జిషీట్లు దాఖలు చేస్తామని, మరో మూడు అంశాలపై దర్యాప్తు కీలక దశలో ఉందని చెబుతోంది. అలాంటప్పుడు అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టడం చట్టప్రకారం ఎంతమాత్రం సమ్మతం కాదు

- దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా.. తుది విచారణ చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం గానీ, ఏ ఉన్నత న్యాయస్థానమైనా గానీ ఇంతవరకు ఒక్క తీర్పయినా ఇచ్చాయా?

- సీబీఐ చేస్తున్న ఆరోపణను ఒకే అంశంగా పరిగణించాల్సిందే. దాన్ని ముక్కలు ముక్కలు చేసి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేస్తామంటే చట్టం అనుమతించదు. నిందారోపణలను వేర్వేరుగా పేర్కొంటూ ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేసినా అంతిమంగా వాటన్నిటినీ కలిపి ఒకే తుది విచారణ చేయాల్సిందేనని చట్టం, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నాయి

- ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా... ఇంకా మూడు చార్జిషీట్లు వేస్తామని సీబీఐ స్వయంగా స్పష్టం చేస్తుండగా... అప్పుడే అభియోగాలు నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయంలో సీబీఐ తీరును న్యాయస్థానం ప్రశ్నించాలి. చట్టప్రక్రియను ఆ సంస్థకు గుర్తు చేయాలి


సాక్షి, హైదరాబాద్: దర్యాప్తు పెండింగులో ఉన్న కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో అభియోగాల నమోదుతో పాటే తుది విచారణ (ట్రయల్‌ను) ప్రారంభించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఆ సందర్భాన్ని సీబీఐ తెలియజేయాలని కోరారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా తుది విచారణ చేయవచ్చని ఏ అత్యున్నత న్యాయస్థానమైనా ఇంతవరకూ ఒక్క తీర్పయినా ఇచ్చిందా అని సీబీఐని ప్రశ్నించారు. 

మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాతే తుది విచారణ ప్రారంభించాలని, నిందితులందరిపై అభియోగాలను ఒకేసారి మోపాలని, తుది విచారణను ఒకసారే నిర్వహించాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు ఐదు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో త్వరలో మూడు చార్జిషీట్లు దాఖలు చేస్తామని, మరో మూడు అంశాలపై దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ అంగీకరించిందని గుర్తు చేశారు. 

దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సీబీఐ స్వయంగా అంగీకరిస్తున్నప్పుడు అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టడం చట్టప్రకారం ఎంతమాత్రమూ సమ్మతం కాదని తేల్చిచెప్పారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 309 కింద ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం విచారించారు. సాయిరెడ్డి తరఫున సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. ఒక కుట్ర జరిగిందని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు సంబంధిత నిందారోపణలన్నిటిపైనా ఒకే చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. 

తర్వాత దాఖలు చేసేవన్నీ అనుబంధ చార్జిషీట్లు మాత్రమే అవుతాయని తెలిపారు. ఈ మేరకు గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్‌షా కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. 2004-09 మధ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి లబ్ధి పొందిన సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని ఎఫ్‌ఐఆర్ మొదలుకుని, ఇప్పటిదాకా దాఖలు చేసిన ఐదు చార్జిషీట్లలో సీబీఐ పేర్కొందని తెలిపారు. ప్రధానమైన ఆరోపణ ఇదే అయినప్పుడు వాటిని వేర్వేరు నిందారోపణలుగా వాటిని ఎలా పేర్కొంటారని, మరిన్ని చార్జిషీట్లు వేస్తామని ఎలా చెబుతారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీబీఐ చేస్తున్న ఆరోపణను ఒకే అంశంగా పరిగణించాల్సిందేనని, దాన్ని ముక్కలు ముక్కలు చేసి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేస్తామంటే చట్టం అనుమతించదని పేర్కొన్నారు. నిందారోపణలను వేర్వేరుగా పేర్కొంటూ ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేసినా అంతిమంగా వాటన్నిటినీ కలిపి ఒకే తుది విచారణ (ట్రయల్) చేయాల్సిందేనని చట్టం, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నాయని నివేదించారు. సత్వర తుది విచారణలో భాగంగానే అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ వాదనలు వినిపించారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తుది విచారణ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, తన నిర్ణయాన్ని మే 6కు వాయిదా వేశారు.

అంత అవసరం ఏమొచ్చింది?
సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సుశీల్‌కుమార్ గుర్తు చేశారు. కానీ దర్యాప్తు పెండింగులో ఉందన్న కారణంతో జగన్‌ను 11 నెలలుగా జైల్లో ఉంచారని చెప్పారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం ఇంకా విచారణ (ఎంక్వయిరీ) దశలోనే ఉంది. అభియోగాల నమోదు, తుది విచారణ (టయల్)లను నిందితులందరిపై ఒకేసారి చేయాల్సి ఉంటుంది.

జగతి పబ్లికేషన్స్ విలువను లెక్కగట్టిన డెలాయిట్ కంపెనీ ఉన్నతాధికారి సుదర్శన్‌ను సాక్షిగా అన్ని చార్జిషీట్లలోనూ పేర్కొన్నారు. అప్పుడే తుది విచారణ ప్రారంభిస్తే అన్ని చార్జిషీట్లలోనూ ఆయన్ను వేర్వేరుగా క్రాస్‌ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఇది చట్టసమ్మతం కాదు. అప్పుడే అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తే పిటిషనర్‌కు తీవ్రమైన నష్టం జరుగుతుంది. సీబీఐ గత వైఖరిని చూస్తే ఇది స్పష్టమైంది’’ అని వివరించారు. అసలు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని 2012 మార్చి 31న సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో ఎక్కడా చెప్పలేదని సుశీల్ కుమార్ చెప్పారు. దాన్ని తాము ఎత్తిచూపిన తర్వాతే రెండో చార్జిషీట్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. 

‘‘ఇక రెండో చార్జిషీట్‌ను కనీసం ఏ తేదీన వేసిందీ కూడా పేర్కొనలేదు. దాన్ని కూడా మేం ప్రస్తావించాకే ఆ లోపాన్ని సరిచేసుకుని మళ్లీ మూడో చార్జిషీట్ వేశారు. ఇలా సీబీఐ చేసిన లోపాలను మేం ఎత్తిచూపిన ప్రతి సందర్భంలోనూ వారు వాటిని సరిచేసుకుని కొత్తగా చార్జిషీట్లు దాఖలు చేశారు’’ అని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా.. తాము నేరానికి పాల్పడలేదని నిరూపించేలా ఈ నాలుగు చార్జిషీట్లలో వాదనలు వినిపిస్తే... సీబీఐ మరో కొత్త వాదనతో కొత్తగా చార్జిషీట్లు దాఖలు చేసే ఆస్కారముందన్నారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుం డగా... ఇంకా మూడు చార్జిషీట్లు వేస్తామని సీబీఐ స్పష్టం చేస్తుండగా... అప్పుడే అభియోగాలు నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 

ఈ విషయంలో చట్టప్రక్రియను గుర్తుచేస్తూ, సీబీఐ తీరును ప్రశ్నించాలని న్యాయస్థానానికి సూచించారు. దర్యాప్తు పూర్తిచేసి సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే తుది విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘న్యాయప్రక్రియ ఎప్పుడూ న్యాయస్థానాల్లో కేసుల విచారణకు సంబంధించిన నిబంధనలకు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండరాదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలోనే విచారణ కొనసాగాలి. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు సీఆర్పీసీ 309 ప్రకారం అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేసే విచక్షణాధికారం ప్రత్యేక కోర్టుకు ఉంటుంది. అభియోగాల నమోదు ప్రక్రియ అప్పుడే వద్దని ఏ కారణాలతో అయినా సీబీఐ కోరినా... సీఆర్పీసీ 309 కింద మాత్రమే ఆ మేరకు కోర్టు వాయిదా వేయగలదనే విషయాన్ని గుర్తించాలి. 

న్యాయస్థానాల్లో పారదర్శకమైన తుది విచారణ జరగాలని సెక్షన్ 309తో పాటు 21వ అధికరణం కూడా స్పష్టం చేస్తోంది. ఇవి రాజకీయ కారణాలతో పెట్టిన కేసులు. కొందరి కోసం దర్యాప్తు చేస్తూ పలు చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. దాని గురించి చెప్పలేం. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యేదాకా అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలి’’ అంటూ సుశీల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కోర్టులో విచారణ ప్రక్రియను జాప్యం చేసేందుకు ఇటువంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అశోక్ భాన్ వాదించారు. వీటిని కొట్టేయాలని కోరారు.
Share this article :

0 comments: