‘ఓం మెటల్స్’ కు సర్కారు జై - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఓం మెటల్స్’ కు సర్కారు జై

‘ఓం మెటల్స్’ కు సర్కారు జై

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013


- రూ. 12.17 కోట్ల విలువైన ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ ఖనిజాలు అప్పనంగా అప్పగింత
- బహిరంగ వేలం వేయకుండా ప్రైవేటు సంస్థకు ధారాదత్తం
- ఖనిజాలను అమ్ముకొనేందుకు తాత్కాలిక
- పర్మిట్ల జారీకి రహస్యంగా మెమో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన
- ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడిచిన అక్రమాల తంతు
- ఖజానాకు పెద్ద మొత్తంలో గండి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హైటెక్ సిటీకి సమీపంలో అత్యంత నాణ్యమైన, విలువైన ఖనిజ నిల్వలను ఉత్తరాదికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం అడ్డగోలుగా రాసిచ్చింది. బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సిన విలువైన ఖనిజాలను ‘ఓం మెటల్ డెవలపర్స్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టింది. లక్షన్నర టన్నులకుపైగా ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ ఖనిజాలను విక్రయించుకునేందుకు ఆ సంస్థకు తాత్కాలిక పర్మిట్లు జారీ చేయాలంటూ ప్రభుత్వం రహస్య మెమో జారీ చేసింది.

ఉత్తరాదికి చెందిన ఈ సంస్థకు ప్రయోజనం చేకూరుస్తూ దొడ్డిదారిన ఉత్తర్వులు జారీ చేయడం వెనుక సచివాలయం స్థాయిలో భారీ తతంగం సాగిందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని తుంగలో తొక్కి ఖజానాకు కోట్లలో గండికొట్టే ఈ తంతు మొత్తం సర్కారీ పెద్దల కనుసన్నల్లో నడిచిందని సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట సర్వే నంబరు 78/బి లోని పది ఎకరాల్లో ఓం మెటల్ డెవలపర్స్, మహేంద్ర లైఫ్ స్పేసెస్ సంయుక్తంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టాయి. ఈ ప్రాంగణంలో కొండల్లాంటి రెండు పెద్ద గుట్టలున్నాయి. ఈ గుట్టల్లో పై నుంచి భూమిలో కింది వరకూ ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ ఖనిజ నిల్వలు సహజసిద్ధంగా పోతపోసినట్లు ఉన్నాయి. తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ ఖనిజాలు బయటపడుతున్నాయని, వాటిని విక్రయించుకునేందుకు అనుమతించాలంటూ ఓం మెటల్ డెవలపర్స్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు, ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ సంస్థకు అనుకూలంగా క్షేత్రస్థాయి అధికారి నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్నారు.

ఈ నివేదిక ప్రకారం ఇక్కడున్న 1,47,246 టన్నుల ఫెల్స్‌ఫార్, 6,528 టన్నుల క్వార్ట్జ్ ఖనిజాలను తరలించుకునేందుకు ఆ సంస్థకు అనుమతిస్తూ తాత్కాలిక పర్మిట్లు జారీ చేయాలంటూ గత ఏడాది నవంబరు 24వ తేదీన భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి దాసరి శ్రీనివాసులు అంతర్గత ఉత్తర్వులు (మెమో నంబరు 14996/ఎం.1(2)/2012) జారీ చేశారు. టన్ను ఫెల్స్‌ఫార్ మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.900 పలుకుతోంది. టన్ను క్వార్ట్జ్ రూ.600 నుంచి 700 ధర ఉంది. కనీస ధరలు ఫెల్స్‌ఫార్ టన్ను రూ.800 వేసుకున్నా 1,47,246 టన్నుల విలువ రూ.11,77,96,800 అవుతుంది. కార్ట్జ్ టన్ను కనీస ధర రూ.600 వేసుకున్నా 6,528 టన్నుల విలువ రూ.39,16,800 అవుతుంది. రెండు ఖనిజాల విలువ రూ. 12,17,13,600. అంటే.. రూ.12.17 కోట్ల విలువైన ఖనిజాన్ని నామమాత్రపు రాయల్టీతో ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నమాట.

ఎంఎండీఆర్ చట్టానికి తూట్లు
ఖనిజాలను విక్రయించుకునేందుకు ఓం మెటల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమో పూర్తిగా మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) చట్టం - 1957కు విరుద్ధంగా ఉందని అధికారులే అంటున్నారు. ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ ప్రధాన ఖనిజాల కిందకు వస్తాయి. చట్టబద్ధంగా మైనింగ్ లీజు (ఎంఎల్) తీసుకుని తవ్వకాలు జరిపిన సంస్థలు, వ్యక్తులకు మాత్రమే ఈ ఖనిజాలను విక్రయించే, పరిశ్రమలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వే నంబర్‌లో ఓం మెటల్ డెవలపర్స్‌కు రాష్ట్రంలో ఖనిజాన్వేషణ (పీఎల్), ఖనిజ తవ్వకాల (ఎంఎల్) లెసైన్సులు లేవని సమాచారం. భవనాల నిర్మాణం కోసం తవ్వకాలు జరిపినప్పుడు ఖనిజాలు బయటపడినందున ఆ సంస్థ చట్ట ప్రకారం ప్రభుత్వానికి తెలియజేయాలి. భూమిలోని ఖనిజాలపై స్థల యజమానులకు ఎలాంటి హక్కు ఉండదు. ఇవి జాతి సంపద. అందువల్ల ఎవరైనా ఏదైనా పనుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు ఖనిజాలు బయటపడితే ప్రభుత్వానికి సమాచారం అందించాలి. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం ద్వారా విక్రయించి వచ్చిన సొమ్మును ఖజానాకు జమ చేయాలి.

ఎంఎండీఆర్ చట్టం - 1957 సెక్షన్ 21 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘ఇసుక, కంకర, రాళ్లు లాంటి మైనర్ మినరల్స్‌కు మాత్రమే తాత్కాలిక పర్మిట్లు ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉంది. మేజర్ మినరల్స్ తరలించేందుకు తాత్కాలిక పర్మిట్లు జారీ చేయడానికి అనుమతించడమంటే ఎంఎండీఆర్ చట్టం - 1957 సెక్షన్ 21ని ఉల్లంఘించడమే. అసలు తాత్కాలిక పర్మిట్లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. వేలం వేయాల్సిన కోట్లాది రూపాయల విలువైన ఖనిజాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం వెనుక భారీ తతంగం నడిచింది. దీని వెనుక ఉన్నతాధికారులతోపాటు కీలక నేతల హస్తం ఉంది. ఓం మెటల్ డెవలపర్స్ సంస్థ ఒత్తిడికి ప్రభుత్వం దాసోహమంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు హీనపక్షం రూ.12 కోట్లకు పైగా గండి పడినట్లే’ అని భూగర్భ గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ‘అక్కడ వాస్తవంగా 1,53,774 టన్నుల ఖనిజ నిల్వలున్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద పరిమాణం. రంగారెడ్డి జిల్లాలోని 90 శాతం గనుల్లో ఇంత పెద్ద పరిమాణంలో గత రెండేళ్లలో ఫెల్స్‌ఫార్ నిల్వలు తవ్విన దాఖలాలు లేవు. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని గనిలో ఇతర పెద్ద గనులకంటే చాలా ఎక్కువ నిల్వలున్నాయని దీనినిబట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం చూపించిన నిల్వలు చాలా తక్కువేనన్న అనుమానాలూ ఉన్నాయి.

ఇంకా ఎక్కువ పరిమాణంలో ఇక్కడ నిల్వలు ఉండే అవకాశాలున్నాయి’ అని అధికారవర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ హీనపక్షం 5 లక్షల టన్నుల ఫెల్స్‌ఫార్, క్వార్ట్జ్ నిల్వలుండి ఉంటాయని మైనింగ్ వ్యాపారులు అంటున్నారు. దీనినిబట్టి చూస్తే ఇక్కడి ఖనిజాల తరలింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు కలుగుతున్న నష్టం ఇంకా పెద్ద మొత్తంలోనే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక్కడి ఖనిజాన్ని ఇప్పటికే పెద్ద మొత్తంలో వెలికితీసి, అనధికారికంగా విక్రయించినట్లు మైనింగ్ వ్యాపారులు చెబుతున్నారు.

అన్నింటా ఉల్లంఘనలే
ఈ వ్యవహారం వెనుక చట్టపరంగా అనేక ఉల్లంఘనలు ఉన్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో బయటపడింది. వాస్తవంగా ఈ ప్రాంతంలో 2000 సంవత్సరానికి ముందే దక్కన్ మినరల్ గ్రైండింగ్ మిల్స్ (డీఎంజీఎం) పేరిట మైనింగ్ లీజు ఉండేది. ఒకసారి మైనింగ్ లీజు ఉన్న ప్రాంతంలో ఖనిజ నిల్వలున్నట్లు తెలిస్తే కచ్చితంగా దానిని నోటిఫై చేయాలి. ఇక్కడ అలా చేయలేదు. కనీసం ఓం మెటల్ డెవలపర్స్‌కు ఖనిజాన్ని విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చే సమయంలో కూడా అక్కడ గతంలో మైనింగ్ లీజు ఉన్న విషయాన్ని ప్రస్తావించలేదు. ఎంఎండీఆర్ యాక్టు - 1957 సెక్షన్ 21ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సర్వే నంబరు 78/బి లోని పది ఎకరాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఓం మెటల్స్‌కు చెందిన పట్టా భూమిగా భూగర్భ గనుల శాఖ మెమోలో పేర్కొంది. అయితే ఈ సర్వే నంబరులోని మొత్తం 215 ఎకరాలు ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో స్పష్టంగా ఉందని రెవెన్యూ అధికారులు చెబుతుండటం మరో మతలబు.
Share this article :

0 comments: