అధర్మ ‘వడ్డిం'పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధర్మ ‘వడ్డిం'పు

అధర్మ ‘వడ్డిం'పు

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన
అన్నదాత నిలువు దోపిడీ...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు పంట రుణాలపై 7 శాతం వడ్డీ వసూలు చేయాలి 
అయితే గత ఆర్థిక సంవత్సరానికి సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు కేంద్రం 3% వడ్డీ రాయితీ ప్రకటించింది
అంటే బ్యాంకులు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన అన్నదాతల నుంచి కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది
కానీ బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాలకు తూట్లు పొడిచి రైతులు సకాలంలో చెల్లించినా 7 శాతం వడ్డీనే వసూలు చేస్తూ అడ్డంగా దోచుకుంటున్నాయి. 

ఈ విధంగా రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసే మొత్తం రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ఏటా మరో రూ.500 కోట్లూ బాదుతున్నారు

బి. గణేష్‌బాబు, సాక్షి: పంట రుణాల వసూళ్లలో బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ‘వడ్డీ రాయితీ’ ఇవ్వకుండా రైతుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. సహకార రంగ బ్యాంకులు మినహా మిగిలిన అన్ని బ్యాంకులు ఈ అక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. నాబార్డ్ పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించే ‘గ్రామీణ బ్యాంకులు’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా అక్రమంగా వసూలు చేస్తున్న మొత్తం రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. సకాలంలో రుణం తిరిగి చెల్లించినా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ బ్యాంకులు 11% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని కొందరు రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో మరో రూ.500 కోట్ల వరకు బ్యాంకులు రైతుల్ని బాదేస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని కోటీ 54 వేల మంది రైతులకు వివిధ బ్యాంకులు రూ.37,373 కోట్ల మేర పంట రుణాలు ఇచ్చాయి. వీరినుంచి సాధారణంగా అయితే ఏడు శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయాల్సి ఉంది. అయితే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీలో మూడు శాతం రాయితీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు 29-9-2012న ఆర్బీఐ అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలను చెల్లిస్తే వారి వద్ద నుంచి నాలుగు శాతం మాత్రమే వడ్డీ వసూలు చేయాలని, మిగతా మూడు శాతం వడ్డీని కేంద్రం బ్యాంకులకు చెల్లిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సహకార రంగ బ్యాంకులను మినహాయిస్తే, మిగతా బ్యాంకులన్నీ.. సకాలంలో చెల్లిస్తున్నా రైతుల వద్ద నుంచి ఏడు శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇదేమని ఎవరైనా రైతులు ప్రశ్నిస్తే తమకు కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, అవి వచ్చిన తర్వాత జమ చేస్తామని బ్యాంకులు జవాబిస్తున్నాయి. ఇలా అక్రమంగా వసూలు చేస్తున్న (3శాతం వడ్డీ) మొత్తం రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ విధంగా సమకూరే డబ్బును బ్యాంకులు దాదాపు సంవత్సరం పాటు వేరే వ్యాపార లావాదేవీలకు వాడుకుని ఆ తర్వాత తీరిగ్గా సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి.

ఇలా సంవత్సరం పాటు నిర్వహించిన లావాదేవీలకు గాను గత ఏడాదినే పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు కనీసం రూ.100 కోట్లు వడ్డీ రూపేణా పొందుతాయన్న మాట. అయితే సంవత్సరం తర్వాత అయినా రైతుల ఖాతాల్లో వడ్డీ రాయితీ మొత్తం సక్రమంగా చేరుతుందా? అంటే అదీ లేదు. చాలామంది రైతులు రుణ ఖాతాలు సక్రమంగా నిర్వహించుకోలేక పోవడం, బ్యాంక్ నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం ఇత్యాది కారణాలతో చాలా ఖాతాల కు ఈ వడ్డీ రాయితీ సొమ్ము చేరడం లేదు. దీంతో బ్యాంకులు ఆ సొమ్మును ‘సస్పెన్స్ అకౌంట్’లో జమ చేసుకుంటున్నాయి. ఇలా బ్యాంకులు అదనంగా పొందుతున్న లబ్ధి మొత్తం వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ఈ విషయంలో బాధ్యత వహించాల్సిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. 

7% వడ్డీ వసూలు సరికాదు

ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ నరేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బ్యాంకుల అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ విషయమై ఆయనను కలిసేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయన సూచన మేరకు ఏజీఎం ఉమామహేశ్వరరావును ‘సాక్షి’ సంప్రదించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు సకాలంలో రుణాలు చెల్లించిన వారి నుంచి ఏడు శాతం వడ్డీ వసూలు చేయడం సరికాదని ఏజీఎం తెలిపారు. అయితే ఈ విషయమై మిగతా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎస్‌ఎల్‌బీసీకి ఉండదన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రాబ్యాంకు కూడా అక్రమంగా ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు రాగా ‘పరిశీలిస్తాం’ అంటూ సమాధానమిచ్చారు. నాబార్డ్ పర్యవేక్షణలో పనిచేసే గ్రామీణ బ్యాంకులు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ‘నాబార్డ్’ సీజీఎం నాయర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

పంట రుణాలకూ ప్రాసెసింగ్ ఫీజు!

మరోవైపు బ్యాంకులు రైతులకు సంబంధించిన ప్రతి రుణ ఖాతాపై ప్రాసెసింగ్ చార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్టీలు, ఖాతా నిర్వహణ చార్జీల పేరుతో రూ.1000 నుంచి రూ.1500 వరకూ వసూలు చేస్తున్నాయి. రూ.25,000 పైన ఇచ్చే రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని ఒక్కోబ్యాంకు ఒక్కో రకంగా అదనపు చార్జీలను వడ్డిస్తున్నాయి. వివిధ చార్జీల పేరుతో బ్యాంకులు వసూలు చేస్తున్న సొమ్ము ఏటా రూ.500 కోట్ల పైనే ఉంటోంది. బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలిస్తే, కేంద్రం బ్యాంకులకు మరో రెండు శాతం కలిపి తొమ్మిది శాతం వడ్డీని చెల్లిస్తోంది. ప్రాధాన్యతా రంగాలకు రుణసాయం అందిస్తున్నందుకుగాను కేంద్రం ఇలా రెండు శాతం వడ్డీని బ్యాంకులకు నేరుగా చెల్లిస్తోంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న బ్యాంకులు కనీసం పంట రుణాలపైన అయినా ‘ప్రాసెసింగ్ ఫీజు’లు వసూలు చేయకూడదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ఏకంగా 11శాతం వడ్డీ వేశారు

నేను 30-7-12న వైఎస్సార్ కడప జిల్లా పాత కడప ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నా. 13-4-13న రుణం చెల్లించాను. ఏడాదిలోపే చెల్లించినా.. మార్చి 30లోపు రుణం చెల్లించలేదన్న కారణంతో 11 శాతం వడ్డీ వసూలు చేశారు. పంటబీమా, వడ్డీ కలుపుకుని లక్ష రూపాయలకు రూ.1,09,160 కట్టించుకున్నారు.
- చంద్రమౌళీశ్వర రెడ్డి, పాత కడప

అదనపు చార్జీలు అన్యాయం

వైఎస్సార్ కడప జిల్లా పాత కడప ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.50,000 రుణం తీసుకున్నా. నా బ్యాంక్ అకౌంట్ నెంబరు.30072089666. నావద్ద నుంచి ప్రాసెసింగ్ ఫీజు రూ.500, ఇన్‌స్పెక్షన్ చార్జీలు రూ.500, అకౌంట్ కీపింగ్ చార్జీలు రూ.550 వసూలు చేశారు. ఈ ఆదనపు చార్జీలను కలుపుకుంటే 10 శాతంకు పైగానే వడ్డీ కట్టినట్టవుతోంది. ఈ చార్జీలు అన్యాయం.
- ధనుంజయ, ఎగువపల్లి, పాత కడప

ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తా

బ్యాంకులు 3 శాతం వడ్డీ రాయితీ ఇవ్వకుండా అక్రమంగా వసూలు చేయడంపై ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తా. బ్యాంకులు ఏడు శాతం వడ్డీతో వ్యవసాయానికి రుణాలు ఇస్తుంటే కేంద్రం అదనంగా మరో రెండు శాతం వడ్డీని బ్యాంకులకు ఇస్తోంది. ఆ రకంగా బ్యాంకులకు పంట రుణాలపై 9 శాతం వడ్డీ జమ అవుతోంది. దాంతో తృప్తి పడకుండా బ్యాంకులు మళ్లీ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అదనపు వసూళ్లు చేయడం అన్యాయం. 
-ఎంవీఎస్ నాగిరెడ్డి, ఐసీఏఆర్ సభ్యుడు


http://www.sakshi.com/main/FullStory.aspx?catid=582434&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: