తల్లిలాంటి మిల్లును అమ్మేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తల్లిలాంటి మిల్లును అమ్మేశారు

తల్లిలాంటి మిల్లును అమ్మేశారు

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల వద్ద రైత న్నల గోడు
* గొడ్డూగోదా, భూమి, నగలు అన్నీ అమ్ముకుని మిల్లులో పెట్టుబడులు పెట్టాం
* మిల్లును గద్దల్లా తన్నుకుపోయి.. మమ్ముల్ని ముంచారు
* ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారు
* కోట్ల విలువైన మిల్లును కారుచౌకగా నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టారు
* జగనన్న సీఎం అయ్యాక న్యాయం జరుగుతుంది: షర్మిల

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘గొడ్డూగోదా, భూమి, నగలు ఏమి ఉంటే అవి అమ్ముకొని పెట్టుబడి పెట్టాం. మాకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు పాలేరు షుగర్స్ మిల్లును అమ్మేశాడు. మిల్లు అమ్మేనాటికి మా షేర్ల విలువ రూ.3 కోట్లు. ఆ మిల్లు 20 ఏళ్లు మాకు బువ్వ పెట్టింది. మా పిల్లలకో దారి చూపుతుందని అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారో కోడిపిల్లను గద్ద తన్నుకు పోయినట్టే మిల్లును లాక్కున్నారమ్మా’’ అని ఖమ్మం జిల్లా రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు రూపాయి కూడా ఇవ్వకుండా మిల్లును తన అనుచరుడైన నామా నాగేశ్వరరావుకు చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టారని గోడు వెళ్లబోసుకున్నారు. రైతులను ముంచి వందల కోట్ల విలువైన మిల్లును కారుచౌకగా రాసిచ్చేశారంటూ తమ బాధలను చెప్పుకున్నారు. వారి సాధకబాధకాలను విన్న షర్మిల.. ‘‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలేరు షుగర్స్‌లో జరిగిన అక్రమాలను సమీక్షించి, అన్యాయంగా మిల్లును దక్కించుకున్న వాళ్ల దగ్గర నుంచి తీసుకొని రైతులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు..’’ అని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సాగింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలు, రైతులతో షర్మిల మాట్లాడారు. ఇదే మండలం రాజేశ్వరపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో 1976లో పాలేరు సహకార చక్కెర మిల్లును కట్టారు. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అక్రమంగా నామా నాగేశ్వరరావుకు మిల్లును కట్టబెట్టడంపై కొందరు రైతులు, మిల్లులో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు షర్మిలతో మాట్లాడారు. కొందరు నేరుగా బాధలు చెప్పుకోగా, మరికొందరు అర్జీల రూపంలో ఫిర్యాదు చేశారు.

బాబుకు రైతుల ఉసురు తగులుతుంది..: షర్మిల
‘‘జగనన్న సీఎం అయిన తర్వాత పాలేరు షుగర్స్‌లో జరిగిన అక్రమాలను పూర్తిగా సమీక్షించి, అన్యాయంగా మిల్లును దక్కించుకున్న వారి నుంచి తీసుకొని, మళ్లీ రైతులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్లి పోరాటం చేద్దాం..’’ అని షర్మిల రైతులకు భరోసా ఇచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడు కనీసం మానవత్వం లేకుండా పాలేరు షుగర్స్‌ను నామా నాగేశ్వరరావు అనే తన మనిషికి కారుచౌకగా కట్టబెట్టారు.

ఇందులో రైతులు షేర్ హోల్డర్లు అని, రైతుల రక్తాన్ని దోచుకుంటే వాళ్ల ఉసురు తాకి పోతామన్న మానవత్వం కూడా లేకుండా ఫ్యాక్టరీని మింగేశారు. వందల కోట్ల విలువ చేసే కంపెనీని రైతులకు తెలియకుండా కేవలం రూ.9 కోట్లకు అమ్మేశారు. ఈరోజు దాని విలువ ఎన్నో వందల కోట్లు చేస్తుంది. అన్నా.. మీరు చాలా నష్టపోయారు. దానిలో పెట్టుబడి పెట్టిన డబ్బులు షేర్ క్యాపిటల్‌గానీ, డివిడెండ్‌గానీ ఇవ్వకుండా వేల మంది రైతులను ముంచారు. వందల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పాపం ఊరికే పోదు.. తప్పకుండా అనుభవిస్తారు. ఈ చంద్రబాబుకు, నామా నాగేశ్వరరావుకు రైతుల ఉసురు తప్పకుండా తలుగుతుంది’’ అని షర్మిల మండిపడ్డారు.

బుధవారం 130వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం అజయ్ తండా నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి తిరుమలాపురం, కొత్త కొత్తూరు గ్రామాల మీదుగా నేలకొండపల్లి మండల కేంద్రం చేరుకున్నారు. అక్కడ్నుంచి గువ్వలగూడెం, గోకినేపల్లి గ్రామాల మీదుగా యాత్ర సాగింది. గోకినేపల్లి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం 13.6 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,757.8 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, యడవెల్లి కృష్ణ, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

బాధితుల ఆవేదన ఇదీ..

ఆనాడు 30 వేల టన్నుల చక్కెర నిల్వలు 
‘‘మధుకాన్ ప్రాజెక్ట్‌కు పాలేరు షుగర్స్‌ను అప్పగించే నాటికి మిల్లులో 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. కిలో పంచదార రూ.7 వేసుకున్నా అవే రూ.2.10 కోట్లు. రైతులకు చెందిన రూ.4,600 షేర్లు ఉన్నాయి. కంపెనీని వేలం వేసే నాటికి వీటి విలువ రూ.3 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వంగానీ, నామా నాగేశ్వరరావుగానీ మాకు ఇప్పటికీ ఇవ్వలేదు’’
- మానుకొండ శ్రీనివాసరావు, చెన్నారం

లోన్లు ఇస్తామని మోసం చేశారు
‘‘లోన్ ఇస్తానని చెప్పారు. బావి తవ్విస్తామన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకురమ్మన్నారు. తీరా మమ్ముల్ని మోసం చేసి మా పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకుల్లో తనఖా పెట్టి రైతుల పేరుతో (టైఅప్ లోన్) స్థానిక బ్యాంకుల్లో దాదాపు రూ.10 కోట్ల రుణం తీసుకున్నారు’’
- ఆనం వెంకటరెడ్డి, అనంతనగర్

విలువైన గ్రానైట్ కోసమే..
‘‘134 ఎకరాల్లో కొంత భాగం గుట్టలతో ఉంది. దీన్ని గద్దగుట్ట అని పిలుస్తాం. ఈ గుట్ట కింద విలువైన గ్రానైట్ రాయి ఉంది. గ్రానైట్ మైనింగ్ మీద పట్టున్న నామా ఆ గ్రానైట్ వెలికి తీసేందుకే పరిశ్రమను కొనుగోలు చేశారు. ఇప్పుడే వెలికితీస్తే స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో సమయం కోసం ఎదురు చూస్తున్నారు’’
- కోటి సైదారెడ్డి, కోనాయిగూడెం

రోడ్డున పడేశారు
‘‘మేం మొత్తం 500 మంది రెగ్యులర్ ఉద్యోగులం, దినసరి కూలీలు 2 వేల మంది ఫ్యాక్టరీలో పని చేసే వాళ్లం. ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదం లేదని, అందరినీ కొనసాగిస్తామని నామా నాగేశ్వరరావు గారు ఫ్యాక్టరీ కొనుగోలు చేసే సమయంలో హామీ ఇచ్చారు. కొనుగోలు ఒప్పందం అవగానే ఉద్యోగాల్లోంచి తీసేసి రోడ్డున పడేశారు’’
- నామవరపు పిచ్చయ్య,
మాజీ ఉద్యోగి, రాజేశ్వరపురం
Share this article :

0 comments: