న్యాయదేవతా! ఇంకెన్నాళ్ళు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయదేవతా! ఇంకెన్నాళ్ళు?

న్యాయదేవతా! ఇంకెన్నాళ్ళు?

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013


ఇరవై ఆరు జీవోలను తప్పుపడితే ఎలా? అని సమర్థించుకుంటూ మన మంత్రులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వారి ఆగ్రహానికి అర్థముందనుకుంటే, నాటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిగారిని అవినీతిపరుడని, స్వార్థపరుడని, ఈ రాష్ట్రాన్ని ఆథోగతిపాల్చేశాడని ప్రతిపక్షాలు, పత్రికలు, సమాచార చానె ళ్లు అదేపనిగా ప్రచారం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు మిన్నకుండిపోయారు?! పదవులు లేకుంటే బతకలేము అన్నట్లు వాటిని పదిల పరచుకునే నీచ, నికృష్టమైన ప్రయత్నాలలో భాగంగా ఎవరికిష్టమొచ్చినటు ్లవారు సమయానుకూలంగా మాట్లాడడం అవమానకరం. సుప్రీం కోర్టు నోటీసులు అందేవరకు వీరికి అవేమీ పట్టలేదు సరిగదా. అందలంపై ఆశీనులై ఆనందాన్ని అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు. వై.యస్ జీవించినప్పుడు ఆయన వీరుడు, శూరుడు, అపరభగీరథుడు, కాటన్‌దొర, బడుగు బలహీన వర్గాలకు, తాడిత పీడిత ప్రజలకు ఆరాధ్యుడని పొగుడుతూ, పదవులు పొందిన ప్రతిసారి పాదాభివందనాలు చేస్తూ ప్రస్తుతించినవారు ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. అయ్యో! ఇదెక్కడి న్యాయం?

ఉచిత విద్యుత్తు, మహిళల అభ్యున్నతికై వడ్డీలేని ఋణాలు, ముస్లింలకు నాల్గుశాతం రిజర్వేషన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు, ఇందిరా గృహనిర్మాణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలు... ఇవన్నీ అన్యాయంగా అమలులోనికి వచ్చినవేనా? పరిశ్రమలు విస్తరిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి చట్టపరిధిలో భూములను కేటాయించి పారిశ్రామికోద్యమానికి కంకణం కట్టుకోవడం మహానేరమా? ఎక్కడో కుదేలుపడి, అధికార పగ్గాలు కోల్పోయిన కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు అందించాలని అహర్నిశలు శ్రమించి, మైళ్లకుమైళ్లు పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారాన్ని సంపాదించి పెట్టడమే ఆయన చేసిన ఘోర తప్పిదమా?

వంశ పారంపర్య దిశలోనే అఖండ భారతావనిలో అధికార పీఠాన్ని అలంకరించిన కాంగ్రెస్ సంస్కృతిని తప్పు పట్టలేమనుకుంటే... వైయస్ మరణించగానే ఆయన కుమారుడు పదవీకాంక్షతో ముఖ్యమంత్రి పీఠంపై కన్ను వేశాడని వై.యస్ జగన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు మరి? ఓదార్పుయాత్రలో ప్రజలు ఆయనను ఆదరించిన తీరును చూసి ఓర్వలేక ఆధార రహిత ఆరోపణలతో నేరస్తుడిగా చిత్రీకరించి జైలుపాలు చేశారు. ఆయన కుటుంబంపై విషం జల్లుతూ అడగడుగునా, రోజుకో వింత ఆరోపణలతో వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. పదినెలలకు పైగా జైల్లో నిర్బంధించి, జైలు కాలాన్ని యింకా పొడిగించే దురాలోచనలతో కొత్తకొత్త ఆరోపణలను అన్వేషిస్తున్నారు.

‘‘కాంగ్రెస్‌లో ఉంటే ఆయన నిర్దోషి. బయటకు వచ్చాడు కాబట్టి క్రిమినల్’’ - ఇదీ వారి నిర్వచనం. జగన్‌మోహన్‌రెడ్డి తనకై తాను బయటకు వెళ్లిపోలేదు. అంతా కలిసి వెళ్లగొట్టారు. ఆయన కుటుంబాన్ని అవమానించారు. కన్నీరు పెట్టించారు. జైల్లోపెడితే పతనమౌతాడు అనుకుంటే అది వారి అంధత్వం. వారి ఆలోచనకు భిన్నంగా జనమంతా జగన్‌తోనే ఉన్నట్లు మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలలో వెల్లడయింది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వై.ఎస్. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుందే కానీ తరగదు. కాంగ్రెసు, ప్రతిపక్షాలు చేతులు కలిపినందువల్లనే ఎన్నికల్లో ధరావతును కూడా కోల్పోయాయి. ప్రజలు అమాయకులుకారు. సునిశితంగా గమనిస్తున్నారు. అంతకుమిన్నగా పై వాడు గమనిస్తున్నాడు.

ఆయనే అసలైన న్యాయాధిపతి. ఢిల్లీ పెద్దల కనుసైగలతో నడుస్తున్న సి.బి.ఐ. ‘జగన్‌ను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం. రాష్ట్రజనాభాలో అత్యధిక సంఖ్యాకులు జగన్‌వైపే వున్నారు. జగన్‌ద్వారానే సమర్ధవంతమైన పాలన, జగన్‌తోనే దళిత బడుగు బలహీన, మైనారిటీ వర్గాలకు సముచిత న్యాయం సాధ్యమని ప్రజల విశ్వాసం. వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోగల ఏకైక యువనాయకుడు జగన్.

- తలమాల రాయప్ప, దళిత బహుజన సామాజిక కార్యకర్త
వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్
Share this article :

0 comments: