మనసులేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనసులేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నాం..

మనసులేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నాం..

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

* కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుపై వికలాంగుల ఆగ్రహం
* ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
* చెర్వుమాధారం గ్రామంలో రచ్చబండ
* షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్న వికలాంగులు
* వైఎస్ ఇచ్చిన పింఛన్‌కూ తూట్లు పొడుస్తున్నారని ఆవేదన
* వైఎస్ హయాంలో 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు: షర్మిల
* ఈ ప్రభుత్వం వికలాంగులను గాలికి వదిలేసింది.. జగనన్న వస్తారు.. వికలాంగులకు మేలు చేస్తారు 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అంగవైకల్యం మాకో శాపం. అయినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డాం. మాకు వైఎస్సార్ ప్రతి నెలా పింఛన్లు ఇచ్చారు. ఆయన అందించిన ఊతకర్రను సదరన్ క్యాంపు పెట్టి ఈ పాలకులు లాగేసుకుంటున్నారు. మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సిన ప్రభుత్వం మా పింఛన్లకూ తూట్లు పొడుస్తోంది. ఆ దేవుడు మమ్మల్ని శారీరకంగా వికలాంగులను చేస్తే.. ఈ ప్రభుత్వం మానసిక వికలాంగులుగా మార్చేసింది.

మనసులేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నాం’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వద్ద వికలాంగులు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సాగింది. నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రామం రచ్చబండలో వికలాంగులు, వితంతువులు, మహిళలతో షర్మిల మాట్లాడారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

మానసిక వికలాంగులకు పింఛన్ ఇచ్చిన వైఎస్
వికలాంగుల ఆవేదనపై షర్మిల స్పందిస్తూ.. ‘‘మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్. చంద్రబాబునాయుడు హయాంలో కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైఎస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చారు. వికలాంగులపట్ల ఇంకొంచెం ప్రేమ, అప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు పెద్దగా తేడా ఉండదని వైఎస్సార్ అనేవారు. 

ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోంది. వికలాంగులను గాలికి వదిలేసింది. పింఛన్ డబ్బు సరిపోవడంలేదు పెంచండి మహాప్రభో.. అని వాళ్లు మొరపెట్టుకుంటుంటే ఉన్న పింఛన్లు కూడా ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అమ్మా..! మీరు అధైర్యపడవద్దు. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. వైఎస్సార్ ఏ విధంగానైతే మీకు సహాయపడ్డారో.. జగనన్న కూడా అదేవిధంగా మిమ్మల్ని ఆదరిస్తారు. 

ఎందుకంటే నేను రాజన్నను చూశాను, జగనన్నను చూశాను. మీ గురించి జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. మీరు చేస్తున్న డిమాండ్లలో చాలావరకు జగనన్న ప్లీనరీలోనే ప్రకటించారు. మీ అందరినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు. చదువు లేని వికలాంగులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలిస్తారు. మీ కాళ్ల మీద నిల బడే విధంగా ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులు కూడా వికలాంగులను చిన్న చూపు చూడకుండా ప్రోత్సాహమిస్తే సామాన్య మనిషికంటే ఎక్కువ ప్రతిభ చూపిస్తారు’’ అని చెప్పారు.

వికలాంగుల డిమాండ్లు..

* మూడేళ్లకు ఒకసారి ట్రై సైకిల్ ఇవ్వాలి
* చదవుకున్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలి. మిగిలిన వారికి రుణాలిచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా పోత్సహించాలి
* వికలాంగులకు ప్రస్తుతం అమలుచేస్తున్న 3 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి
* అర్హులైన వికలాంగులందరికీ పింఛన్ ఇవ్వాలి. పింఛన్‌ను రూ.1,000కి పెంచాలి
* నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలి
* వికలాంగుని కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలి
* ఉచిత బస్సు, రైలు పాసులు ఇవ్వాలి
* ప్రభుత్వం వికలాంగులను గౌరవంగా చూడాలి. ఏటా వెరిఫికేషన్ పేరుతో ఇబ్బంది పెట్టే బదులు వైఎస్సార్ మాదిరిగా క్షేత్ర సహాయకుడిని పెట్టి వెరిఫికేషన్ చేయించాలి

రైతులు, మహిళలను పలకరిస్తూ ముందుకు..
మంగళవారం 129వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రాయగూడెం నుంచి ప్రారంభమైంది. షర్మిల రైతులు, మహిళలు, యువతను పలకరిస్తూ బుద్దారం, చెర్వుమాధారం గ్రామాల మీదుగా అజయ్ తాండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,744.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో రోజూ నడుస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డిలతో పాటు మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చందా లింగయ్యదొర, బానోతు మదన్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, స్థానిక నేతలు రామసహాయం నరేష్‌రెడ్డి, మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వర్‌రావు, సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

మంత్రులు చచ్చారో, బతికారో వెరిఫై చేయరేం?
మేం చచ్చినామా, బతికే ఉన్నామా అని ప్రభుత్వం ప్రతి ఏడాదీ మమ్మల్ని పరిశీలిస్తుంది. ఇది ఎంత దుర్మార్గమంటే.. శారీరకంగా వికలాంగులమై బాధపడుతున్న మాకు, సర్కారు పరిశీలన మానసికంగా బాధపెడుతోంది. ఈ సభలో ఒక్క మాట అడుగుత అక్కా..! మా జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. నిజంగా ఏడాది నుంచి వాళ్లు మాకు కనిపించటంలేదు. ఏడాది కాలంగా కనిపించని ఈ మంత్రులు చచ్చారో, బతికారో ఎందుకు వెరిఫికేషన్ పరీక్ష చేయరక్కా?
- హరీష్‌రెడ్డి, తల్లాడ

రాజన్న రాజ్యంలో నా ఇంటికే పింఛన్
వైఎస్సార్ ఇచ్చిన పింఛన్‌ను కిరణ్‌కుమార్‌రెడ్డి తీసేసిండు. ఏ పనీ చేయలేనోన్ని. కర్ర లేకుంటే నడవలేను. నా ఫించన్ నాకు ఇప్పించండి అంటూ అధికారుల చుట్టూ తిరిగిన. ఒక్కడైనా సాయం చేయలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏమి చేయడానికీ చేతగాదు. జగనన్న బయటికి రావాలి. వికలాంగులం ఆయనకు అండగా నిలబడి గెలిపించుకుంటాం. షర్మిలక్క చెప్పినట్టు రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుంది. అప్పుడు ఇదే అధికారులు నా ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారు.
- శంకరయ్య, చెర్వుమాధారం

బతుకు దుర్భరం
అక్కా..! మా బతుకు ఎంత దుర్భరం అంటే మాటలతో చెప్పలేను. నేను బీకాం, బీఈడీ పూర్తి చేశాను. నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. నాకు ఏ ఉద్యోగం రాలేదు. ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. నా తల్లిదండ్రులకు చేయూత ఇవ్వాల్సిన నేను ఇప్పుడు వాళ్ల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. జీవితం అంటేనే విరక్తి పుడుతోందక్కా. 
- సూరమ్మ, చెర్వుమాధారం

సదరన్ క్యాంపుతో వంచించారు
ఇది దగాకోరు ప్రభుత్వం. ‘వెనుకటికి ఒక రాజు తన రాజ్యం లోని ప్రజలను భోజనాలు పెడతాను రండి’ అని పిలిచాడట. వచ్చిన వారినందరినీ వరుసబెట్టి నరికించాడట. కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన కూడా అలానే ఉందక్కా. ఆయనకు వికలాంగులంటే ద్వేషం ఉన్నట్టుంది. ఆయన సదరన్ క్యాంపులు పెట్టాడు. వికలాంగులకు న్యాయం జరగాలంటే ఈ క్యాంపులకు రావాలని చెప్పారు. అక్కడికి వెళ్తే ఏవో పరీక్షలు చేసినారు. మాకు వైకల్యం లేదంటూ పింఛన్లు తీసేశారు. ఇప్పుడు పింఛన్లు రావడంలేదు. మా బతుకు దుర్భరమైంది.
- సైదులు, పైనంపల్లి
Share this article :

0 comments: