గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ

గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

అడిగి తెప్పించుకుని మరీ పరిశీలించిన న్యాయ మంత్రి అశ్వనీకుమార్
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బయటపెట్టిన సీబీఐ డెరైక్టర్
ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖ ఉన్నతాధికారులు కూడా చూశారని వెల్లడి
యూపీఏలో ప్రకంపనలు.. విపక్షాలు భగ్గు.. అశ్వనీ రాజీనామాకు పట్టు
కోర్టుకు సమర్పించేదాకా గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ
కాంగ్రెస్ జేబు సంస్థగా మారిన వైనానికి మరో ఉదాహరణ
రాజకీయ క్రీడలో పావుగా వాడుకుంటున్న అధికార పార్టీ
సీబీఐ మాజీ సారథులు కూడా అంగీకరించిన వాస్తవమిది
తాజాగా ప్రస్తుత డెరైక్టర్ నోటా పరోక్షంగా అదే మాట

‘ప్రమాణ’పూర్వకంగా...

స్థాయీ నివేదికను 2013 మార్చి 8న సుప్రీంకోర్టుకు సమర్పించడానికి ముందే దాని తాలూకు ముసాయిదాను కేంద్ర న్యాయ మంత్రితో పంచుకోవడం జరిగింది. ఆయన కోరిన మీదటే అలా చేయాల్సి వచ్చింది. ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖల్లోని సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ముసాయిదాను ముందే చూశారు. వారు కోరిన మీదటే అలా చేయాల్సి వచ్చింది.
- శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా

బొగ్గు కుంభకోణంపై స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించక ముందే దాని ముసాయిదాను కేంద్ర న్యాయ మంత్రి అశ్వనీకుమార్ తెప్పించుకుని చూశారు. ఆయనతో పాటు ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శులు కూడా ముసాయిదాను చదివారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాయే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు!

ముసాయిదాను చూశాక అందులో కేంద్రం ఏమైనా మార్పుచేర్పులు చేసిందా అన్న అంశంపై మాత్రం ఆయనేమీ చెప్పలేదు. అన్నీ సుప్రీంకే నేరుగా చెబుతానని ప్రకటించి ఇటు ప్రజల్లో సస్పెన్స్‌ను, అటు యూపీఏ సారథి కాంగ్రెస్‌లో ఆందోళనను పెంచారు.

సీబీఐకి మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలా అన్నది సుప్రీంకోర్టు పరిధిలోని విషయమంటూ ఈ సందర్భంగా సిన్హా నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. తద్వారా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితేమిటో చెప్పకనే చెప్పారు.

బొగ్గు గనులను యూపీఏ సర్కారు వేలం వేయకుండా స్క్రీనింగ్ కమిటీ పేరుతో ఇష్టానికి కేటాయించడం ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలకు ఏకంగా రూ.1.86 లక్షల కోట్ల మేరకు అనుచిత లబ్ధి చేకూర్చిందని 2012 ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన తుది నివేదికలో కాగ్ పేర్కొంది. అనంతరం పౌర సమాజం ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా విషయం సుప్రీంకోర్టుకు చేరింది.

అవసరార్థం అటు రాజకీయ ప్రత్యర్థులపైకి దర్యాప్తు సాకుతో ఉసిగొల్పడంతో పాటు, ఇటు సొంత తప్పిదాల్ని వీలైనంతగా కప్పిపుచ్చుకోవడానికి కూడా సీబీఐని అధికార కాంగ్రెస్ అడ్డంగా వాడుకుంటున్న వైనాన్ని దర్యాప్తు సంస్థ డెరైక్టరే సుప్రీంకోర్టు ముందు స్వయంగా, ప్రమాణపూర్వకంగాఅఫిడవిట్ రూపంలో బయటపెట్టారు!

బొగ్గు భగ్గుమంది. ‘చేతి’ నిండా దట్టంగా మసి అంటుకుంది. అంతులేని అవినీతికి ఆలవాలంగా మారిన బొగ్గు కుంభకోణం క్రమంగా యూపీఏ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కేసు దర్యాప్తులో వేలు పెట్టేందుకు తెగించిన అధికార సంకీర్ణం.. ఆ వైనాన్ని సీబీఐ సారథే స్వయంగా బయట పెట్టడంతో అడ్డంగా బుక్కయింది. సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన స్థాయీ నివేదికను కాంగ్రెస్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతకు ముందే ‘చే’జిక్కించుకుందని సంస్థ డెరైక్టర్ రంజిత్ సిన్హా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి ప్రమాణపూర్వకంగా నివేదించారు. సాక్షాత్తూ కేంద్ర న్యాయ మంత్రే నివేదిక ముసాయిదాను అడిగి మరీ తెప్పించుకుని ఆద్యంతం పరిశీలించారని కోర్టుకు అఫిడవిట్ రూపంలో వివరించారు. కోర్టుకు సమర్పించేదాకా గోప్యంగా ఉంచాల్సిన ఆ నివేదికను ప్రధాని కార్యాలయంతో పాటు బొగ్గు శాఖ కూడా ముందుగానే చదివేశాయని పేర్కొన్నారు. 

తద్వారా పెను రాజకీయ దుమారానికి తెర తీయడమే గాక... సీబీఐని కాంగ్రెస్ పూర్తిగా తన జేబు సంస్థగా మార్చుకుందని కూడా చెప్పకనే చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థను తన రాజకీయ క్రీడలో పావుగా వాడుకుంటూ వస్తున్న వాస్తవాన్ని మరోసారి బట్టబయలు చేశారు. సుప్రీంకోర్టు స్వీయ పర్యవేక్షణలో సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకే ఈ పరిస్థితి ఉంటే.. ఇక ఇతర కేసులు, మరీ ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెస్ బనాయిస్తున్న కక్షసాధింపు కేసులను దర్యాప్తు సంస్థ ఎంత వివక్షపూరితంగా విచారిస్తుందో వివరించాల్సిన పని లేదని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసును సీబీఐ విచారిస్తున్న తీరే అందుకు ప్రత్యక్ష తార్కాణమని గుర్తు చేసింది. బీజేపీ, వామపక్షాలు సహా విపక్షాలన్నీ సీబీఐ అఫిడవిట్ ఉదంతంపై భగ్గుమన్నాయి. 

సీబీఐ పూర్తిగా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందనేందుకు ఇది తాజా ఉదాహరణ అన్నాయి. న్యాయ మంత్రి అశ్వనీకుమార్ తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేశాయి. సీబీఐ డెరైక్టర్ అఫిడవిట్ దెబ్బతో యూపీఏ సర్కారు సుప్రీంకోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది! ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని దేశమంతా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అందరి దృష్టీ కేసు తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 30పైనే కేంద్రీకృతమైంది...

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో కేంద్రం అనుచిత జోక్యం చేసుకుందని బాహాటంగా రుజువైంది. బొగ్గు కుంభకోణంపై తాము రూపొందించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించక ముందే దాని ముసాయిదాను కేంద్రంతో పంచుకున్నామని సీబీఐ డెరైక్టర్ స్వయంగా అంగీకరించారు. న్యాయ మంత్రి అశ్వనీకుమార్ ముసాయిదాను ముందుగానే ఆసాంతం చదివారని వెల్లడించారు. పైగా, మంత్రి స్వయంగా కోరిన మీదటే దాన్ని ఆయన ముందు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. అంతేకాదు, ‘‘ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖలకు చెందిన ఇద్దరు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ముసాయిదాను ముందుగానే చూశారు. 

మంత్రి అయినా, ఉన్నతాధికారులైనా స్వయంగా కోరిన మీదటే ముసాయిదా ప్రతిని వారితో పంచుకోవాల్సి వచ్చింది’’ అని కూడా సిన్హా స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం ఆయన సమర్పించిన రెండు పేజీల సంచలనాత్మక అఫిడవిట్ దేశమంతటా పెను రాజకీయ దుమారం సృష్టిస్తోంది. దానికి తోడు, ముసాయిదాలో కేంద్రం ఏమైనా మార్పుచేర్పులు చేసిందా అన్న అతి కీలకాంశంపై అఫిడవిట్‌లో సిన్హా మౌనం వహించారు! కేంద్రమే స్వయంగా కల్పించుకుని మరీ స్థాయీ నివేదిక తాలూకు తీవ్రతను వీలైనంతగా తగ్గించిందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. పైగా, బొగ్గు కుంభకోణం నివేదికను ప్రభుత్వంతో ఏ దశలోనూ ఏ విధంగానూ పంచుకోలేదని గతంలో సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పగా... అది అవాస్తవమని ఇప్పుడు ఆ సంస్థ సారథే ప్రమాణపూర్వకంగా అంగీకరించడం మరింత సంచలనం సృష్టిస్తోంది. నివేదికను సీబీఐ డెరైక్టర్ పరిశీలించాక దాన్ని నేరుగా సుప్రీంకోర్టుకు మాత్రమే సమర్పించినట్టు దర్యాప్తు సంస్థ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ మార్చి 12న కోర్టుకు విన్నవించారు. దాంతో ఈ విషయమై కోర్టు అసాధారణ రీతిలో స్పందించింది. 

‘‘స్థాయీ నివేదికను మీరే స్వయంగా పరిశీలిస్తున్నారని, అందులోని వివరాలను రాజకీయ కార్యనిర్వాహక విభాగంతో పంచుకోలేదని, ఇకముందు సమర్పించబోయే నివేదికలను కూడా మీరే స్వయంగా పరిశీలిస్తారని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించండి’’ అని సీబీఐ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిన్హా అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో, అది ఇంకెన్ని పెను సంచలనాలకు దారి తీస్తుందో చూడాల్సిందేనంటున్నారు. అందరి కళ్లూ కేసులో తదుపరి విచారణ జరగబోయే ఏప్రిల్ 30వ తేదీ మీదే కేంద్రీకృతమయ్యాయి. బొగ్గు కుంభకోణంపై ఇకముందు సుప్రీంకు సమర్పించే ఏ నివేదికనూ కేంద్రానికి సంబంధించిన ఎవరికీ వెల్లడించబోనంటూ సిన్హా ప్రమాణం చేశారు. తాజా స్థాయీ నివేదికను కూడా ఎవరితోనూ పంచుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు, స్థాయీ నివేదికను ప్రభుత్వంతో పంచుకోలేదని సుప్రీంకు చెప్పిన హరీన్ రావల్‌ను కేసు బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై సీబీఐ తరఫున ఉదయ్ లలిత్ న్యాయవాదిగా వ్యవహరిస్తారు.

పౌర సమాజం స్పందనతో...

బొగ్గు కుంభకోణంలో తాజా వివాదానికి కేంద్ర బిందువైన స్థాయీ నివేదికను మార్చి 8న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. 2006-09 మధ్య పలు కంపెనీలకు కేంద్రం చేసిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు, సదరు కంపెనీల అర్హతలను మాత్రం సరిచూసుకోకుండానే జరిగాయంటూ అందులో ఆక్షేపించింది. పైగా ఆ కంపెనీలకే ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో కూడా బొగ్గు శాఖ ఎలాంటి వివరణా ఇవ్వలేదంటూ తప్పుబట్టింది. కేటాయింపుల విషయంలో ప్రభుత్వ సంస్థలు పాల్పడ్డ పలు అవకతవకలు దర్యాప్తులో స్పష్టంగా బయట పడ్డాయని కూడా పేర్కొంది. ‘‘ఈ విషయమై దాదాపు 300 కంపెనీలపై తమ దర్యాప్తు సాగుతోంది. 1993 నుంచి, నిర్దిష్టంగా 2006-08 మధ్య బొగ్గు గనుల కేటాయింపులు పొందిన ప్రతి కంపెనీ మా దర్యాప్తు పరిధిలో ఉంది. ఇప్పటికి 12 కంపెనీలపై దర్యాప్తు ముగిసింది. 9 కంపెనీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’’ అని గతంలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. కేంద్రం మాత్రం దర్యాప్తు సంస్థ వాదనలను ఖండించింది. కేటాయింపుల మంచిచెడులను నిర్ణయించే పరిధి సీబీఐకి లేదని వాదించింది. 

బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ పౌర సమాజ సభ్యులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి, ఎల్.రాందాస్, టీఎస్‌ఆర్ సుబ్రమణియన్, ఎంఎల్ శర్మ తదితరులు వారిలో ఉన్నారు. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బొగ్గు క్షేత్రాల కోసం భారీ సంఖ్యలో కంపెనీలు దరఖాస్తు చేసుకున్నా, కేవలం ‘ఎంపిక చేసిన’ కొన్నింటికి మాత్రమే ఎందుకు వాటిని కట్టబెట్టాల్సి వచ్చిందంటూ కేంద్రాన్ని గతంలోనే నిలదీసింది. ఈ విషయమై ఎలాంటి న్యాయ ప్రక్రియనూ చేపట్టని పక్షంలో మొత్తం కేటాయింపులనే రద్దు చేయాల్సి రావచ్చని కూడా హెచ్చరించింది.

కేంద్రం రిమోట్‌తోనే: జోగిందర్ సింగ్

కేంద్రం కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందని..ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం దానికి లేదని.. స్వయంగా ఆ సంస్థ మాజీ డెరైక్టర్ జోగిందర్‌సింగ్ వెల్లడించారు. ఆయన 2012 మే 12న ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీబీఐ ‘ఎలా పనిచేస్తుందో’ పూసగుచ్చినట్లు వివరించారు. ‘‘కేంద్రం ప్రతి దశలోనూ సీబీఐకి తాను చెప్పదలచుకున్న దాన్ని హోంశాఖ న్యాయ సలహాదారుల ద్వారా చెప్తుంది. సీబీఐ పూర్తిగా వారి సూచనలు, నిర్దేశాల మేరకే పనిచేయాల్సి ఉంటుంది. వారేం చెప్తే అది చేయాల్సిందే. దాన్ని తోసిపుచ్చేందుకు సంస్థకు ఎలాంటి అవకాశమూ లేదు. సీబీఐ ఒక్కో కేసులో ఒక్కో విధంగా పనిచేస్తుంది. హోంశాఖ లీగల్ అధికారుల ద్వారా ప్రభుత్వం ముందుగా సీబీఐకి సలహా ఇస్తుంది. తర్వాత దాన్ని మార్చుకుంటుంది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు తీరూ మారుతుంది. అలా ఆ సంస్థ నిందలపాలవుతుంది. కానీ.. తెరవెనుక ఉండి కథ నడిపించే వారు మాత్రం ఎప్పటికీ బయటకు రారు. ఇది పూర్తిగా వాస్తవం’’ అని ఆయన స్పష్టంచేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=587553&Categoryid=1&subCatId=32
Share this article :

0 comments: