టీడీపీ రుణం తీర్చుకుందాం..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ రుణం తీర్చుకుందాం..!

టీడీపీ రుణం తీర్చుకుందాం..!

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013

‘కరెంట్ చార్జీలు ఇప్పటికే భరించలేనంతగా ఉన్నాయి. వాటిని మరింత భారీగా పెంచుతామంటే ఎలా? మనం రాజకీయంగా బతకాలా, చావాలా’ అంటూ ఇద్దరు మాజీ మంత్రులు ఇటీవల సీఎల్పీ గదిలో రుసరుసలాడుతూ కన్పించారు. అప్పుడే ఎంటరైన కడప జిల్లాకు చెందిన మరో నేత ఏమైందంటూ ఆరా తీశారు. వారు విషయమంతా చెప్పి, ఎవరినడిగి కరెంటు చార్జీలను ఇంతగా పెంచుతున్నారంటూ ఆగ్రహించారు. చిరకాలం టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆ నేత దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. దాంతో మాజీలిద్దరూ మండిపడ్డారు. ‘మేమెంతో సీరియస్ విషయం చెబుతుంటే నీకు జోక్‌లా ఉందా? అధిష్టానం, పార్టీ పెద్దలు పద్ధతులను మార్చుకోకపోతే పార్టీకి భవిష్యత్తుండదు’ అంటూ వాపోయారు. సదరు నేత స్పందిస్తూ.. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బతికి బట్టకడుతుందన్న నమ్మకం మన పెద్దలకే ఏనాడో పోయింది. ఇప్పుడు రేట్లు పెంచితేనో లేక ఇంకేదో చేస్తేనో కొత్తగా జరిగే నష్టం ఏముందని అంతగా ఫీలవుతున్నారు? జరగాల్సిందంతా ఇప్పటికే జరిగిపోయింది. కాకపోతే ఒక్కటి..’ అంటూ అర్ధోక్తిలో ఆపారు. దాంతో మాజీలిద్దరూ ఆశగా ఆ ఒక్కటి ఏమిటంటూ ఆరా తీశారు. ‘సీఎమ్మే కాదు, ఢిల్లీ పెద్దలే తరలివచ్చి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదు గాక గెలవదు. మనమేం చేసినా ఫలితముండదు. కాబట్టి ఇప్పుడు మనకుండాల్సిన ఆ ఒక్కటి... కృతజ్ఞత! ఇంతకాలం మన ప్రభుత్వాన్ని కాపాడినందుకు టీడీపీ పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి! రుణం తీర్చుకోవాలి! మనం ఎలాగూ గెలిచేది లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కనీసం టీడీపీకైనా సహకరిస్తే దాని రుణం తీర్చుకున్న వాళ్లమవుతాం...! మనకు మిగిలింది అదొక్కటే’ అంటూ సదరు మాజీ టీడీపీ నేత సెలవివ్వడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం ఆ నాయకుల వంతైంది!
Share this article :

0 comments: