ప్రభుత్వ తప్పుడు విధానానికి ప్రజలు మూల్యం చెల్లించాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ తప్పుడు విధానానికి ప్రజలు మూల్యం చెల్లించాలా?

ప్రభుత్వ తప్పుడు విధానానికి ప్రజలు మూల్యం చెల్లించాలా?

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసగా చేపట్టిన రాష్ట్ర బంద్ పూర్తిగా విజయవంతమైందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పెంచిన చార్జీలను తక్షణమే తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారంనాటి బంద్ ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిందని, ఈ నిరసనను గమనించైనా చార్జీలు తగ్గించకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సగటు విద్యుత్ కొనుగోలు ధర రాష్ట్రంలో ఎందుకు పెరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో సగటు విద్యుత్ కొనుగోలు యూనిట్ ధర రూ.2.10 నుంచి రూ.2.25గా ఉంటే ఇప్పుడు రూ.3.15లు ఎలా అయిందో ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ముందు 2013-14 సంవత్సరానికి ఉంచిన ప్రతిపాదనల్లో సగటు కొనుగోలు యూనిట్ ధర రూ. 4.07లుగా పెంచి చూపారు. కొనుగోలు ధర పెరుగుతుందన్న సాకు చూపి ప్రజలపై భారం మోపుతారా..?’’ అని మండిపడ్డారు. బయటి నుంచి కొనుగోలు చేసే విద్యుత్ ధర యూనిట్ రూ.5.11గా ఉంటోందన్నారు. 

జల విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు కాకున్నా ఎందుకు ధర పెరుగుతోందని ప్రశ్నించారు. గనుల నుంచి బొగ్గు వెలికితీతకు అయ్యే ఖర్చు ఆధారంగా ధర నిర్ణయించాల్సింది పోయి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బొగ్గు ధరను విపరీతంగా పెంచుకుంటూ పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, జెన్‌కోలో అవినీతి వల్ల పడుతున్న భారానికి ప్రజలు మూల్యం చెల్లించాలా? అని నిలదీశారు. కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువు ఒక్క ఎంఎంసీడీ కూడా రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంటులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులపై సబ్సిడీని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం... కేజీ బేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేసే 23 ఎంఎంసీడీల గ్యాస్‌ను ఎరువుల ప్లాంటులకు తరలిస్తోందని, దీనివల్లే రాష్ట్రానికి గ్యాస్ దక్కకుండా పోతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి 30 మంది కాంగ్రెస్ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నా మనకు గ్యాస్ తెచ్చే యత్నం చేయడం లేదని విమర్శించారు.

టీడీపీ పాలనలో ఒక్క మెగావాట్ ఉత్పత్తి చేయలేదు..

విద్యుత్ సంక్షోభానికి దివంగత వైఎస్ విధానాలే కారణమని ఆరోపిస్తున్న టీడీపీ.. తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క మెగావాట్ థర్మల్ విద్యుత్‌నైనా ఉత్పత్తి చేసిందా అని మైసూరా ప్రశ్నించారు. వైఎస్ పాలించిన 2004-2009 మధ్య కాలంలో 1,630 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగితే 2010 నాటికి పూర్తయ్యాయన్నారు. ఆయన హయాంలోనే మరో 3,300 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ప్రారంభించారని, అవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. టీడీపీ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న 4 గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు పూర్తయినా గుదిబండలుగా మారి రూ.వేల కోట్ల భారం ప్రజలపై పడటాన్ని గుర్తుచేశారు. హెరిటేజ్ పాలపై తమ పార్టీ చేసిన ఆరోపణలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అని , అందుకు వారు సమాధానం చెప్పుకోవాలని అన్నారు.
Share this article :

0 comments: