జగన్ కేసులపై వేగంగా విచారణ జరుపుతున్న సీబీఐ.. చంద్రబాబుపై విచారణకు మాత్రం సిబ్బంది లేరని చెబుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కేసులపై వేగంగా విచారణ జరుపుతున్న సీబీఐ.. చంద్రబాబుపై విచారణకు మాత్రం సిబ్బంది లేరని చెబుతోంది

జగన్ కేసులపై వేగంగా విచారణ జరుపుతున్న సీబీఐ.. చంద్రబాబుపై విచారణకు మాత్రం సిబ్బంది లేరని చెబుతోంది

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

* ఆయన బయటకు రాకుండా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుట్ర పన్నుతున్నాయి: శోభా నాగిరెడ్డి
* సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ వేసిన తరుణంలోనే విమర్శలు
* జగన్ బయటకు రాడని కిరణ్, బాబు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు.. కుట్రకు ఇదే నిదర్శనం
* చంద్రబాబు పాదయాత్రను ప్రజలు నమ్మడంలేదు
* జగన్ రాజభోగాలు అనుభవిస్తున్నారని అబద్ధాలు చెబుతున్నారు
* జగన్ కేసులపై వేగంగా విచారణ జరుపుతున్న సీబీఐ.. చంద్రబాబుపై విచారణకు మాత్రం సిబ్బంది లేరని చెబుతోంది 

 సుప్రీంకోర్టులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో కాంగ్రెస్ నేతలు విమర్శల జోరు పెంచడం వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి చెప్పారు. జగన్ జైలు నుంచి బయటకు రాకుండా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుట్ర పన్నుతున్నాయని అన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జగన్ ఇక బయటకు రాడని, ఆయన్ని నమ్ముకుని పార్టీని వీడి వెళ్లొద్దని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొందరు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. చంద్రబాబు కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో ఇలాగే చెబుతున్నారు. జగన్‌పై ఇంకా చార్జిషీట్లు వేస్తామని, విచారణకు ఇంకా సమయం పడుతుందని సీబీఐ చెబుతోంది. అంతకుముందే టీడీపీ, కాంగ్రెస్‌వర్గాలు ఈ అంశాలన్నీ చర్చించుకుంటున్నాయి. టీడీపీ ఏ ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు అదే మాట్లాడుతున్నారు. సీబీఐ విచారణ కూడా అదే విధంగా కొనసాగుతోంది. కొన్ని పత్రికలూ ఇవే వార్తలను ప్రచురిస్తాయి. 

దీనినిబట్టే జగన్‌పై పన్నుతున్న కుట్ర విదితమవుతోంది. జగన్‌ను వేరే చోటికి తరలించాలని వీహెచ్ వంటి నాయకులు మాట్లాడ్డం కుట్రను నిజం చేస్తున్నాయి’’ అని చెప్పారు. జగన్‌ను జైల్లో ఉంచిన తరువాత కూడా రాజకీయంగా ఎదుర్కోలేకే, ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే చోటకు తరలించాలనే స్థాయికి దిగజారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీని వీడిన రోజునే జగన్ గ్రహించారని, అన్నింటికీ సిద్ధపడ్డారని చెప్పారు. జైల్లో పెట్టినా, రాష్ట్రం నుంచి పంపించినా 125 ఏళ్ల కాంగ్రెస్, 32 ఏళ్ల టీడీపీల రాజకీయ పునాదులను కదిల్చే సత్తా ఉన్న నాయకుడు జగన్ అని ఆమె దృఢ విశ్వాసం వ్యక్తంచేశారు. జగన్ జైల్లో ఉన్నప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేస్తారని చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెబుతారు
జగన్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు అదే రీతిలో బుద్ధి చెబుతారని శోభానాగిరెడ్డి హెచ్చరించారు. ‘‘జగన్‌ను జైల్లో పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయొచ్చనుకున్నారు. ఆయన జైలుకు వెళ్లాక ప్రజాదరణ ఇంకా పెరిగింది. ఉప ఎన్నికల్లో అనేక చోట్ల కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్క జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కక్ష పూనితే ప్రజలు వారి మీద కక్ష పూనుతారనడానికి ఇదే నిదర్శనం. జగన్‌కు పెరుగుతున్న మద్దతు చూశాక ఎమ్మెల్యేలు వారి పదవులు వదులుకోవడానికి కూడా సిద్ధపడి వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వస్తున్నారు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రను ప్రజలు నమ్మడంలేదని చెప్పారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలకే చంద్రబాబుపై విశ్వాసం లేదు. బాబు యాత్ర మొదలుపెట్టాక ఇప్పటికి పద్నాలుగు మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వదలి వెళ్లారు. ఈసారి అధికారంలోకి రాకపోతే టీడీపీని మూసుకోవాల్సి వస్తుందని చంద్రబాబే చెబుతున్నారు’’ అని అన్నారు.

‘‘జగన్ ములాఖత్‌లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా. ములాఖత్‌లపై మీరే విచారణ జరిపించుకోండి’’ అని సవాలు విసిరారు. జగన్ కుటుంబీకులను కూడా కలవకుండా చేయాలనే నీచానికి ఈ నేతలు దిగజారుతున్నారని అన్నారు. ‘‘జగన్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని అంటున్నారు. ఆయనకు ఏసీలు పెట్టారా? కూలర్లు ఉన్నాయా? ఆయన పీల్చే గాలిపై కూడా విచారణ జరపాలనేలా ఉన్నారు’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ప్రపంచంలోనే ఏ వ్యక్తికీ జరగనంత అన్యాయం జగన్‌కు జరుగుతోంది.

సీబీఐని అడ్డం పెట్టుకుని ఆయన్ని నిర్బంధించారు. సీబీఐని కాంగ్రెస్ అడ్డగోలుగా వాడుకుంటోంది. బొగ్గు గనుల కుంభకోణంలో ప్రధాని కార్యాలయం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని సీబీఐ డెరైక్టరే చెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రజలు ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సీబీఐ.. ఎమ్మార్, ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబు చేసిన అవకతవకలపై ఇప్పటివరకు విచారించనేలేదు. ఐఎంజీ భారత అనే అనామక కంపెనీకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు 850 ఎకరాలను కారు చౌకగా కేటాయించిన అంశంపై విచారణ జరపడానికి తగినంతమంది సిబ్బంది లేరని చెప్పింది’’ అని తెలిపారు. 

విచారణను ఎదుర్కొంటున్న మంత్రులు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో జీవోలన్నీ సక్రమమేనని, ఏ మంత్రి, ఏ కార్యదర్శీ ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారని చెప్పారు. ఆ జీవోల్లో కొన్ని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోలకు రెన్యువల్‌గా ఇచ్చినవని కూడా చెప్పారన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, ఇతర మంత్రులు మాత్రం వైఎస్ ప్రభావితం చేసి సంతకాలు చేయించారని చెబుతున్నారని, ఇదెంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రులు వేలి ముద్ర వేసే వారు కాదు కదా.. ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు చేయడానికి అని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు, టీడీపీకైనా మేలు జరగాలనేంతగా కాంగ్రెస్ నేతలు దిగజారారని ధ్వజమెత్తారు. జగన్‌ను మంత్రులు విమర్శిస్తుంటే, టీడీపీ నేతలు ఆనందిస్తున్నారని, వారిచ్చిన స్క్రిప్టును చక్కగా చదువుతున్నారన్న సంతోషం వారిలో కనిపిస్తోందని అన్నారు.
Share this article :

0 comments: