తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే

తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా వీలైతే వారి పొలాలను, మౌలిక వసతుల్లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శిస్తారని, వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే: ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికి అండగా ఉంటామంటూ మనోధైర్యం కలిగించేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో నాడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రను చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ఆయన పాదయాత్రకు తొలి అడుగు పడిన ప్రదేశంలో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ ఏర్పాటైంది. విజయమ్మ శనివారం ఉదయం 11 గంటలకు తొలుత ఇక్కడే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి నాంది పలకనున్నారు. రైతులు, మహిళలతో మాట్లాడతారు.

తరువాత పక్కనే ఉన్న ఇబ్రహీంపల్లి, ఖానాపూర్, చిట్టెంపల్లి గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. వికారాబాద్ మార్గంలోని మిగతా గ్రామాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతారు. సాయంత్రానికి వికారాబాద్ చేరుకుని అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం నిరాడంబరంగా సాగాలని, ఆర్భాటాలు లేకుండా చూడాలని విజయమ్మ సూచించినట్లు పార్టీశ్రేణులు వెల్లడించాయి. చేవెళ్లలో నాంది పలకనున్న ఈ కార్యక్రమం భవిష్యత్తు కొనసాగింపులో భాగంగా... వైఎస్ హయాంలో చేపట్టి, ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిపోయిన భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించాలని విజయమ్మ నిర్ణయించినట్లు తెలిసింది.

వైఎస్‌కు విడదీయలేని అనుబంధం...
దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి చేవెళ్లతో విడదీయలేని అనుబంధం ఉంది. కరువు కాటకాలతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అల్లాడిపోతున్న సమయంలో వారిలో భరోసా నింపాలనే ఆశయంతో ఆయన 2003, ఏప్రిల్ 9న ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 68 రోజుల పాటు 1,470 కిలోమీటర్లు సాగిన వైఎస్ ‘ప్రజాప్రస్థానం’ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగపడింది. 2004 సాధారణ ఎన్నికల ప్రచారాన్ని ఏప్రిల్ 5, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున వైఎస్ చేవెళ్ల నుంచే ‘జైత్రయాత్ర’ పేరుతో ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ప్రభుత్వ కార్యక్రమమైన ‘రాజీవ్ పల్లెబాట’ను కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ‘గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కూడా ప్రధాని మన్మో హన్‌సింగ్‌తో వైఎస్ ఇక్కడి నుంచే ప్రారంభింపజేశారు.
Share this article :

0 comments: