జగన్ నిర్బంధాన్ని చూస్తుంటే మయన్మార్ గుర్తుకువస్తోంది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నిర్బంధాన్ని చూస్తుంటే మయన్మార్ గుర్తుకువస్తోంది!

జగన్ నిర్బంధాన్ని చూస్తుంటే మయన్మార్ గుర్తుకువస్తోంది!

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013


పాదయాత్ర అంటే మొదట గుర్తుకు వచ్చేది రాజన్న. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి ఆయన కనిపెట్టిన ఆ నూతన ఆవిష్కరణను నాడు విమర్శించిన నాయకులు సైతం నేడు అదే బాట పడుతుండటం విడ్డూరం. నాడు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనా కాలంలో ఏనాడూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయం దండగ అన్నారు. కాని నేడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ వై.ఎస్. బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీలోకి వలసపోతున్న నాయకులను బాబుగారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గొర్రెలు, బర్రెలతో పోల్చడం చూస్తుంటే, ‘ఆయన ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఇదా?’ అనిపిస్తుంది.

ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల విలువ, దొడ్డిదారిలో వెన్నుపోటు రాజకీయాలతో సీఎం కుర్చీని కైవసం చేసుకున్న బాబుకి ఎలా తెలుస్తుంది? ఇక ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీ ... నాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, వారిని పంచెలూడేలా కొట్టండని అపహాస్యం చేయించిన ఆయనకి ఈ కాంగ్రెస్‌వారు చేయూతనిచ్చి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టారు. కొన ఊపిరితో ఉన్న పార్టీని రెండుసార్లు అందలం ఎక్కించిన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. ఏమిటి రాజన్న చేసిన తప్పు? రాహుల్‌ను ప్రధానమంత్రిగా చూడాలని అనుకోవడమేనా? నెహ్రూ కుటుంబం పట్ల ఎంతో వినయ విధేయలతో ఉంటూ తాను రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా, వాటికి వారి పేర్లు పెట్టడమేనా ఆయన చేసిన నేరం? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.

షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం తొలిరోజున ఇడుపులపాయలో జరిగిన బహిరంగసభలో విజయమ్మ మాట్లాడుతూ గద్గద స్వరంతో, ‘‘నాకు ఉన్న ఇద్దరు బిడ్డలలో ఒక బిడ్డ జైల్లో ఉన్నాడు. ఇంకోబిడ్డ మీకోసం రోడ్డుపైకి వస్తోంది’’ అన్న మాటలు విన్న ప్రతి తెలుగు హృదయం మనోవేదనకు గురైంది. తండ్రికితగ్గ తనయుడిలా, అచ్చం రాజన్న హావభావాలు ఉట్టిపడేలా ఉన్న షర్మిలమ్మ చేస్తున్న మరో ప్రజాప్రస్థానం ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మరోవైపు రాజన్న లేని లోటును రాష్ట్రంలోని ప్రతి కుటుంబం జగనన్నతో భర్తీ చేసుకోవాలని ఆశిస్తోంది. కానీ కుట్రలు, కుతంత్రాలు పన్ని విచారణ పేరుతో జగనన్నని జైల్లో పెట్టారు.

ప్రజల నుండి జగన్‌ను దూరం చేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రయాస. చంద్రబాబుతో కుమ్మక్కైన కిరణ్‌సర్కారు విలువలకు తిలోదకాలు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే మన పొరుగు దేశమైన ‘మయన్మార్’ నాకు గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున పోరాటం చేసిన ‘ఆంగ్‌సాన్ సూకీ’ని అక్కడి సైనిక ప్రభుత్వం సుమారు 15 సంవత్సరాలు గృహ నిర్బంధంలో ఉంచింది. అయినప్పటికీ ప్రజల హృదయాల నుంచి ఆమెను దూరం చేయలేకపోయింది. ప్రజలకోసం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం తపిస్తూ, అనుక్షణం తన కుటుంబం కన్నా ప్రజల మధ్యే ఎక్కువగా గడిపిన జగనన్నని విచారణ పేరుతో ఎన్ని రోజులు జైల్లో నిర్బంధించినప్పటికీ, ప్రజల గుండెల నుండి మాత్రం తొలగించలేరు.

పౌరసమాజంలో చైతన్యం పెరిగింది. దీనికి నిదర్శనం మొన్న జరిగిన బై ఎలక్షన్లే. చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలిసినట్లు, దుష్పరిపాలన ఉన్నప్పుడే సుపరిపాలన విలువ తెలుస్తుంది. రెండింటినీ ప్రజలు పోల్చుకుని మంచి వైపు నిలబడతారనేది సత్యం. సంకీర్ణాల యుగంలో జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారాయి కనుక 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేంద్రంలోనూ కీలకం కానున్నదన్నది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా జగనన్నే కాబోయే సీఎం. ఇది ప్రజల మనసులోని మాట.

- కవితా శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, బోధ్, ఆదిలాబాద్
Share this article :

0 comments: