80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి

80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి

Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013

* 80 శాతం పంచాయతీలు మనమే గెలవాలి
* వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు విజయమ్మ పిలుపు
* సాధారణ ఎన్నికలకూ సర్వసన్నద్ధంగా ఉండాలి
* జగన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలను ప్రజలకు వివరించాలి
* జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ 27, 28 తేదీల్లో నిరసనలు
* పార్టీ విసృ్తత సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా ఏమిటో చాటాలని, 80 శాతం పంచాయతీలను గెలుపొందాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలతో పాటే సాధారణ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి కూడా శ్రేణులు కింది స్థాయి నుంచి సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఉంటే ఏ ఎన్నికలనైనా ఎదుర్కోవడం కష్టం కాదని, అయితే నేతలు మితిమీరిన విశ్వాసం ప్రదర్శించొద్దని ఆమె సూచించారు. శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశానికి విజయమ్మ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయం తనకు చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో గ్రూపులను సృష్టించి దెబ్బ తీయాలని అధికారపక్షం కుట్ర పన్నుతోందని, అందుకు తావివ్వకుండా ఇప్పటినుంచే మంచి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాలని నేతలకు సూచించారు. రిజర్వేషన్లపై కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై సీబీఐతో కలిసి జగన్‌పై కొనసాగిస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజెప్పాలని విజయమ్మ కోరారు. కోర్టుల్లో వివిధ స్థాయిల్లో సీబీఐ చేస్తున్న విచిత్ర వాదనలను ప్రజలకు వివరించి చెప్పాలని ఆమె సూచించారు.

ప్రదర్శనలు, దీక్షలకు నిర్ణయం
జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించి ఈ నెల 27వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ విసృ్తత సమావేశం నిర్ణయించింది. సమావేశం వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్.. సీజీసీ సభ్యులు ఆది శ్రీనివాస్, ఎం.మారెప్పతో కలిసి విలేకరులకు తెలియజేశారు. జగన్ నిర్బంధానికి నిరసనగా 27వ తేదీ సాయంత్రం ప్రతి జిల్లా కేంద్రంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 28వ తేదీన జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులు, సీబీఐ విచారణ తీరును ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎండగడతారని తెలిపారు.

ఇలావుండగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో రాష్ట్రంలోని ఓటర్లలో 20 శాతం మందిని సభ్యులుగా నమోదు చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరేసి చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ నివ్వబోతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ఒక సుశిక్షితుడైన పార్టీ కార్యకర్త ఉంటారన్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా పార్టీ అభిమానులను, మద్దతుదారులను ఓటర్లుగా చేర్పించాలని, అలాగే పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని తీర్మానించినట్లు తెలిపారు. గతంలో అనంతపురం ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల వర్గాల వారి ఓట్లు భారీ సంఖ్యలో అక్రమంగా తొలగింపునకు గురైన ఉదంతాన్ని బాజిరెడ్డి ఉదహరించారు.

పార్టీపై చానెళ్ల విష ప్రచారం
కొన్ని టీవీ చానె ళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని బాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశా రు. చంద్రబాబు పాదయాత్రలో కార్చిన మొసలి కన్నీరును ఈ చానెళ్లు గొప్పగా చూపిస్తున్నాయని, అయితే టీడీపీని వదిలిపెట్టి ఎంతమంది నేతలు బయటకు వెళుతున్నదీ చూపించవని, అసలు ఆ ప్రస్తావనే తీసుకురావని ఆయన విమర్శించారు. అదే తమ పార్టీలో ఏమీ లేకపోయినా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరైనా అనారోగ్యంతో ఏదైనా సమావేశానికి రాక పోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నిర్వహించే అన్ని సమావేశాలకూ ఆ పార్టీల నాయకులంతా హాజరవుతున్నారా? అని ప్రశ్నిం చారు.

తమ పార్టీలో కూడా అత్యవసర పనులున్న నేతలు కొన్ని సందర్భాల్లో సమావేశాలకు, కార్యక్రమాలకు రారని, దాన్ని కొండంతలుగా చేసి ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. వ్యక్తిగత పనుల వల్ల తాను సమావేశానికి రాలేకపోతున్నట్టుగా కొణతాల రామకృష్ణ.. విజయమ్మకు ఫోన్ చేసి చెప్పారని బాజిరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆమెను అభినందిస్తూ సమావేశం ఓ తీర్మానం చేసిందన్నారు. తెలంగాణలో విజయమ్మ బస్సు యాత్ర లేదా ఓదార్పు యాత్ర.. ఏదో ఒకటి చేయాలనే సూచనలు వచ్చాయని, త్వరలో ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విస్తృత సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, లోక్‌సభా నియోజకవర్గాల పరిశీలకులు, వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: