మాకు చిత్తశుద్ధి ఉంది... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాకు చిత్తశుద్ధి ఉంది...

మాకు చిత్తశుద్ధి ఉంది...

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

* అందుకే వాటిని మా జెండాలో పెట్టుకున్నాం 
* సీఎం కిరణ్ వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చిన షర్మిల 
* ఆ పాత పథకాలనే అమలు చేస్తామని ప్రజలకు చెబుతారా అని సీఎం అడుగుతున్నారు
* వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని, వైఎస్సార్ అమ్మ ఒడి లాంటి అద్భుత పథకాలనూ పెడతామని మేం చెప్తున్నాం
* అవన్నీ కాంగ్రెస్ పథకాలని సీఎం అంటున్నారు..అలాగైతే ఇతర రాష్ట్రాల్లో లేవేం?
* మీ పార్టీ పథకాలైతే.. రాష్ట్రంలో సక్రమంగా అమలుచేయట్లేదేం?
* ఫీజులు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీలకెందుకు తూట్లు పొడుస్తున్నారు?
* వైఎస్ హామీ ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంటు, 30 కిలోల బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు?

‘‘వైఎస్సార్ ప్రతి పథకానికీఈ ప్రభుత్వం తూట్లు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం తాను పెట్టిన ఓ పథకాన్ని మాత్రం చాలా బాగా అమలు చేస్తోంది. అది ఏంటంటే చార్జీలు పెంచే పథకం. అన్నింటి ధరలూ పెంచే పథకం.’’ 
*- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ మాకు ఆదర్శం, ఆయన ఆలోచనా విధానమే మాకు మార్గదర్శకం. ఆయన అమలు చేసి చూపెట్టిన పథకాలే మాకు స్ఫూర్తి. అందుకే వైఎస్సార్ పథకాలను మా జెండాలో పెట్టుకున్నాం. వైఎస్సార్ పథకాలు మా హక్కు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇలా దీటుగా జవాబిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో సాగింది. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

మాకు చిత్తశుద్ధి ఉంది...
‘‘మేం మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో వైఎస్సార్ అమలు చేసిన పథకాలన్నీ పెట్టుకున్నాం. దీని మీద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఆ పాత పథకాలే అమలు చేస్తామని ప్రజలకు చెబుతారా? అని ఆయన అడుగుతున్నారు. అవి కాంగ్రెస్ పథకాలు కావు కనుక, రాజశేఖరరెడ్డి పథకాలే కనుక, వాటి మీద మాకే హక్కుంది కనుక, వాటిని మా జెండాలో పెట్టుకున్నాం. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన ప్రతి మేలూ చేశారు. చెప్పని మేళ్లు కూడా ఎన్నో చేశారు. మేం కూడా వైఎస్సార్ పథకాలను ఇంకా మెరుగుపరిచి అమలు చేయడమే కాకుండా, వైఎస్సార్ అమ్మ ఒడి లాంటి అద్భుత పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నాం. మాకు అమలు చేసే చిత్తశుద్ధి ఉంది. మేం ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతామని ప్రజలకు విశ్వాసం ఉంది. అదీ వైఎస్సార్‌కు, జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న విశ్వసనీయత.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవే?
నిన్న ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు. వైఎస్సార్ అమలుచేసి చూపెట్టిన పథకాలు వైఎస్సార్‌వి కావట. అవన్నీ కాంగ్రెస్ పార్టీవట. మరి అవన్నీ కాంగ్రెస్ పార్టీవైతే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదో ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడదాం. సరే.. ఇవన్నీ కాంగ్రెస్ పథకాలే అయితే వాటిని రాష్ట్రంలో ఎందుకు సక్రమంగా అమలుచేయడం లేదో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ‘జలయజ్ఞం’ ప్రవేశపెడితే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించిన మాట నిజమా? కాదా? అని అడుగుతున్నాం.

అది వైఎస్సార్ పెద్ద మనసు..
వైఎస్సార్ రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు. వైఎస్సార్ ఈ రోజు బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించేవారు. ఇప్పుడున్న ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి తొమ్మిది గంటలు కాదు కదా.. వైఎస్సార్ ఇచ్చి చూపించిన 7 గంటలు కాదు కదా.. కనీసం మూడు గంటలు కూడా ఇవ్వలేక పోతున్నారన్న మాట నిజమా? కాదా? పేదవారు కూడా పెద్దాసుపత్రికి పోయి రూ. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఇప్పుడున్న సర్కారు ఆ పథకం నుంచి 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించిన మాట నిజం కాదా? సీఎం సమాధానం చెప్పాలి. ఇంత అనవసరం. ఒకే ఒక మాట చెప్తాను. చెవిటి, మూగ పిల్లలకు సంజీవని లాంటి ‘కాక్లియర్ ఇంప్లాంటేషన్’ అనే ఆపరేషన్ చేస్తారు. దీనికి రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వైఎస్సార్ 12 ఏళ్ల వరకు పిల్లలకు ఈ ఆపరేషన్ చేయించుకునే అవకాశం కల్పిస్తే, ఈ ప్రభుత్వం దాన్ని రెండేళ్ల వయసుకు కుదించేసిన మాట వాస్తవమో.. కాదో.. కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. రెండేళ్ల పిల్లలకు చెవిటి, మూగ ఉందో.. లేదో.. కూడా తెలుసుకోవడం కష్టం. వైఎస్సార్ మనసు ఎంత పెద్దదో.. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట ఎంత చిన్నదో స్పష్టంగా ఇక్కడే అర్థమవుతోంది.

ఫీజుల పథకానికి ఆంక్షలు..
‘పేదలు చదివితేనే పేదరికం పోతుంది. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి.. ప్రభుత్వమే మిమ్మల్ని ఉచితంగా చదివిస్తుంద’ని వైఎస్సార్ భరోసా ఇస్తే.. లక్షల మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సగం ఫీజు ఇస్తాం.. మూడో వంతుఇస్తాం.. అని భిక్షం వేసినట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలని, లేకపోతే 10 వేల లోపు ర్యాంకు రావాలని ఆంక్షలు పెడుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఎంసెట్ రాస్తుంటే 10 వేల లోపు ర్యాంకు ఎంతమందికి వస్తుందో మీకు తెలియదా కిరణ్‌కుమార్‌రెడ్డీ? వైఎస్సార్ లక్షలకొద్దీ పక్కా ఇళ్లను కట్టారు. మరి ఈ కిరణ్ సర్కారు పక్కా ఇళ్లకు పాడె కట్టిన మాట నిజమా కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, వైఎస్సార్ వచ్చాక 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి అదనంగా పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్‌కు అంత పెద్ద మనుసు ఉంది. మరి మీరేమో.. ఉన్న పింఛన్లను తొలగిస్తున్న మాట వాస్తవమా కాదా?

రూ. 1,800 ఎక్కడ.. రూ. 24 వేలు ఎక్కడ: వైఎస్సార్ బతికే ఉంటే ఈ రోజు పేదలకు 20 కిలోల బదులు 30 కిలోల బియ్యం వచ్చేవి. ఇప్పుడు కిలో బియ్యం రూ.40 ఉంది. ఈ లెక్కన ప్రతి పేద కుటుంబానికీనెలకు రూ.400 మిగిలేవి. ఏడాదికి రూ.4,800 మిగిలేవి. వైఎస్సార్ బతికి ఉంటే ఇవి ఐదేళ్ల పాటు ప్రజలకు అందేవి. అంటే కనీసం రూ.24 వేల వరకూ ప్రజలు లబ్ధిపొందేవారు. 

మరి ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి 30 కిలోల బియ్యం ఇవ్వకుండా 20 కిలోల బియ్యాన్నే ఒక రూపాయి తగ్గించారు. ఈ లెక్కన ఆయన నెలకు మిగిలిస్తుంది కేవలం రూ.20. అమ్మ హస్తం పథకంతో ప్రజలకు రూ.100 దాకా ఆదా చేస్తున్నాను అని సీఎం అంటున్నారు. సరే అమ్మహస్తం కింద రూ.100, 20 కిలోల బియ్యానికి రూ.20.. కలిపి నెలకు ఆయన రూ.120 మిగిలిస్తున్నారు అనుకుందాం. అది కూడా ఎన్నికలు వచ్చిన ఈ సంవత్సరం ఆఖరిలో ఈ పథకం పెట్టారు. దాన్ని 15 నెలల పాటు ఇస్తారు అనుకుంటే ఆయన ఓ కుటుంబానికి మిగిలిస్తున్న మొత్తం రూ.1,800. మరి వైఎస్సార్ బతికి ఉంటే ఇచ్చే రూ.24 వేలు ఎక్కడ? ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న రూ.1,800 ఎక్కడ? కిరణ్‌కుమార్‌రెడ్డీ మీరు లెక్కల గారడీ చేస్తున్న మాట వాస్తవమో? కాదో? చెప్పాలి.

11.2 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 157వ రోజు గురువారం షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని జెల్లికొమ్మర నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెలగపల్లి, వరదరాజుపురం, గొల్లలదిబ్బ, గణపవరం, సరిపల్లె గ్రామాల మీదుగా ఉండి నియోజకవర్గంలోని ఆరేడు గ్రామం వరకు యాత్ర చేశారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 11.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,083.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, ఎమ్మెల్సీ మేకాశేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, నాయకులు మొవ్వ ఆనంద శ్రీనివాసు, స్థానిక నాయకులు గాదిరాజు సుబ్బరాజు, నౌడు వెంకటరమణ, వగ్వాల అచ్యుత రామయ్య, గంట ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రతి రోజు షర్మిల వెంట నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపుభారతి, డాక్టర్ హరికృష్ణ ఉన్నారు.
Share this article :

0 comments: