కళంకిత మంత్రులంటూ ఇప్పుడీ గోల ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కళంకిత మంత్రులంటూ ఇప్పుడీ గోల ఎందుకు?

కళంకిత మంత్రులంటూ ఇప్పుడీ గోల ఎందుకు?

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

 కళంకిత మంత్రులంటూ ఇప్పుడీ గోల ఎందుకు?
- ‘అవిశ్వాసం’పై చంద్రబాబుకు శోభానాగిరెడ్డి సూటి ప్రశ్న
- లోక కల్యాణం కోసం అవినీతి వ్యతిరేక పోరాటమన్న బాబు మాటలు పెద్ద జోక్
- ‘జగన్ ఏడాది అక్రమ నిర్బంధం’పై నిరసనగా నేడు కొవ్వొత్తుల ప్రదర్శన

 ‘మేం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతిచ్చి ఉంటే కిరణ్ ప్రభుత్వం ఆనాడే ఇంటికి పోయి ఉండేది. అప్పుడు ప్రభుత్వానికి మద్దతునిచ్చి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలంటూ ఇప్పుడు చంద్రబాబు గోల చేయడం దేనికి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసమే తాను అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నానని బాబు అనడం ఓ పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. వచ్చే శాసనసభా సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని చంద్రబాబు అంటున్నారంటే అనుమానించాల్సిందేనని.. అధికారపక్షంతో మాట్లాడుకునే ఆయన ఇందుకు సిద్ధపడుతున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. అవిశ్వాసం పెడతామని అంటూనే మరోవైపు అంతర్గత చర్చల్లో ప్రభుత్వం పడిపోదని, అధికారపక్షానికి మెజారిటీ ఉందని బాబు చెబుతూ ఉండటం విడ్డూరమన్నారు. 

‘మైనారిటీలో పడిన కిరణ్ సర్కారు ఇంత ధైర్యంగా కరెంటు చార్జీలు, ఇతర పన్నులు, ఎరువుల ధరలు పెంచగలుగుతూ ఉందంటే అందుకు కారణం చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చిన భరోసాయే. ప్రభుత్వం పడిపోయే పరిస్థితులున్న సమయంలో బాబు అవిశ్వాసం పెట్టలేదు. ప్రభుత్వానికి ఇబ్బంది లేని పరిస్థితులు చూసి అవిశ్వాసం పెడతానని అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయక మునుపే బాబు కనుక అవిశ్వాసం పెట్టి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. విలీనం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదని తెలిసి.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సమర్థిస్తున్న ఎమ్మెల్యేలను అనర్హులను చేయించాలనే దుర్బుద్ధితోనే ఆనాడు బాబు అవిశ్వాసం పెట్టారు. నిజమైన ప్రతిపక్షం అధికారపక్షాన్ని పడగొట్టడానికి వీలైన అవకాశాలన్నింటినీ అన్వేషిస్తుంది. అందరినీ కలుపుకొని అవిశ్వాసం పెడుతుంది. కానీ చంద్రబాబు వాలకం చూస్తుంటే.. కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా ఉంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లేసిన తన పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఓ వైపు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ.. మళ్లీ అవిశ్వాసం పెడతానని చెప్పడం కూడా వింతగా ఉంది’ అని ఆమె అన్నారు.

నేడు కొవ్వొత్తుల ప్రదర్శనలు.. 28న నిరసన దీక్షలు
జగన్ బయటకు వస్తే తమ పార్టీలు గల్లంతు అవుతాయనే భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు సీబీఐ ద్వారా ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని శోభానాగిరెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికీ ఐదు చార్జిషీట్లు వేయడమే కాకుండా.. ఇంకా ఆరు ఉన్నాయని సీబీఐ చెబుతోంది. ఇదంతా టీడీపీ, కాంగ్రెస్ నిర్దేశకత్వంలో జరుగుతున్నదే’ అని విమర్శించారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించి మే 27 నాటికి ఏడాది అవుతుందని.. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. మంగళవారం(28న)జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆమె కోరారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: