టిడిపి నేతలను వెంటాడుతున్న అభద్రత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపి నేతలను వెంటాడుతున్న అభద్రత

టిడిపి నేతలను వెంటాడుతున్న అభద్రత

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

http://www.andhrabhoomi.net/content/tdp-11
హైదరాబాద్, మే 5: టిడిపి ద్వారానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎంతోమంది సీనియర్ నాయకులను ఇప్పుడు అభద్రతా భావం వెంటాడుతోంది. వరుసగా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మూడవసారి ఎన్నికలకు వెళుతున్నవేళ కూడా పార్టీకి ఎలాంటి సానుకూల వాతావరణం కనిపించక పోవడంతో సీనియర్లు అభద్రతా భావానికి లోనవుతున్నారు. అభద్రతా భావానికి లోనయినవారే పార్టీని వీడి వెళుతున్నారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. ఒకరిద్దరు కాదు పార్టీలో మెజారిటీ నాయకుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే విశ్వాసం కనిపించడం లేదు. పాదయాత్ర తరువాత మనం గెలుస్తామనే నమ్మకం వల్ల నాయకులు నిర్భయంగా ఉండగలరని అనుకున్నాం, కానీ ఆ వాతావరణం కూడా కనిపించడం లేదని టిడిపి సీనియర్లు చెబుతున్నారు. పాదయాత్ర తరువాత టిడిపిపై ఒక సానుకూల వాతావరణం ఏర్పడి ఉండాల్సింది కానీ అలా జరగలేదని, నాయకుల వలసలతో తేలిపోయిందని చెబుతున్నారు. పాదయాత్ర సమయంలోనే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లగా, ముగింపు సభ విశాఖలో జరిగిన తరువాత ఆ ప్రాంతానికి చెందిన ముఖ్యనాయకుడు దాడి వీరభద్రరావు పార్టీ వీడి వెళ్లారు. 2004 ఎన్నికల నుంచి టిడిపికి వరుస పరాజయాలే తప్ప సానుకూల వాతావరణం కనిపించడం లేదు. మహాకూటమి ఏర్పాటుతో అధికారం ఖాయం అనే స్థాయిలో ప్రచారం జరిగింది. చివరకు మహాకూటమి సైతం అధికారాన్ని కట్టబెట్టక పోవడంతో టిడిపి నాయకుల్లో నిరాశ పెరిగిపోయింది. 2009 సాధారణ ఎన్నికల తరువాత 42 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, రెండు పార్లమెంటు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే టిడిపి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయింది. పైగా సగం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఉప ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో మాత్రమే పార్టీ పరిస్థితి బాగాలేదని అనుకున్నాం, కానీ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ సగం సీట్లలో డిపాజిట్లు గల్లంతు కావడంతో అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా పరిస్థితి ఉందని తెలిసొచ్చిందని చెబుతున్నారు. దాడి వీరభద్రరావు రాజకీయ జీవితం టిడిపి ఏర్పాటుతోనే ప్రారంభం అయింది. ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలో సైతం దాడి చివరి వరకు ఎన్టీఆర్‌తో ఉన్నారు. ఎన్టీఆర్ మరణం తరువాతనే ఆయన బాబు నాయకత్వంలోని టిడిపిలో చేరారు. అలాంటి దాడి పార్టీ వీడి వెళ్లాడంటే జగన్‌పై అభిమానం కన్నా పార్టీ దయనీయమైన పరిస్థితే కారణం అని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మనం అధికారంలోకి వస్తాం, రాజకీయ భవిష్యత్తుపై భయపడాల్సిన అవసరం లేదు అనే బలమైన సంకేతాలు ఇవ్వడంలో పార్టీ విజయం సాధించలేకపోతోందని సీనియర్లు చెబుతున్నారు. అధికారంలోకి ఎవరు వస్తారనేది తరువాత సంగతి... ముందు మనం అధికారంలోకి వచ్చి తీరుతాం అనే నమ్మకం కలిగితేనే నాయకులు చావుబతుకుల పోరాటంగా ఎన్నికల్లో పోటీ పడతారని చెబుతున్నారు. కానీ వరుసగా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లో ఓటమి, ఉప ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత జగన్‌కు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా, టిడిపి పరిస్థితి మెరుగుపడింది అనే అభిప్రాయం మాత్రం కలిగించలేకపోయామని టిడిపి నాయకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల తరువాత చంద్రబాబు వద్ద ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు మనం ఎంత ప్రచారం చేసుకున్నా, మంచి విజయం సాధించేంత వరకు ఇలాంటి నిస్పృహ తప్పదని సీనియర్లకు వివరించారు. అయితే ఎన్నికలకు ఇంకా కేవలం పది నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సైతం మనం గెలుస్తాం అనే ధీమా కలిగించలేని పరిస్థితి వల్ల నాయకులు ఆభద్రతా భావంతో పార్టీ వీడి వెళుతున్నారనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. గెలుస్తారా? లేదా? అనే సంగతి తరువాత ఇలాంటి సమయంలో ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకులను ఆకట్టుకోవడం ద్వారా ప్రత్యర్థుల ఎత్తులను కొంత వరకు సైకలాజికల్‌గా చిత్తు చేయవచ్చునని పార్టీ నాయకులు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చేసే సూచనలు కనిపించడం లేదు. ఇక పొత్తుకు సిద్ధమైనా సిపిఎం, సిపిఐ పార్టీల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, వీటితో పొత్తు వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే అని టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు.
Share this article :

0 comments: