జగన్‌కు పీసీయాక్టు వర్తించదని కోర్టే చెప్పింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు పీసీయాక్టు వర్తించదని కోర్టే చెప్పింది

జగన్‌కు పీసీయాక్టు వర్తించదని కోర్టే చెప్పింది

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా టీడీపీ 
* అత్యంత అవినీతిపరుడు చంద్రబాబే..
* జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఆ 26 జీవోలపై కోర్టుకు నివేదించ లేదు
* ఆ పాపమే మంత్రుల మెడకు చుట్టుకుంది
* జగన్‌కు పీసీయాక్టు వర్తించదని కోర్టే చెప్పింది
* జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

సాక్షి ప్రతినిధి, కడప : యూపీఏ ప్రభుత్వం ఒంటి నిండా స్కాంలే ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ చెప్పారు. 2జీ , బొగ్గు స్కాంలు సహా పలు కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం.. సీబీఐ బూచిని చూపి పాలన కొనసాగిస్తోందని తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డిలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు విజయమ్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలో ఉన్నప్పటికీ, సీబీఐని ప్రయోగిస్తామని బెదిరిస్తూ భాగస్వామ్యపక్షాలు, విపక్షాలను లోబరుచుకొని మనుగడ సాగిస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు. యూపీఏకు ములాయం సింగ్ యాదవ్ మద్దతు కొనసాగించడానికి కారణం ఇదేనని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలు బొమ్మగా మారిందని, ఈ విషయాన్ని ఆ శాఖ డెరైక్టర్ రంజిత్ సిన్హా, మాజీ డెరైక్టర్లు కూడా తెలిపారని వివరించారు. ఎంతటి వారి మెడలు వంచేందుకైనా కేంద్రం సీబీఐని వాడుకుంటోందని చెప్పారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఆ పార్టీ నేత స్టాలిన్ నివాసంపై సీబీఐ సోదాలు చేయడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై విచారణ జరిపేందుకు సరిపడా సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ.. కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పితే ఎవరిపైనయినా ఉరికేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇండియా సిమెంట్స్ ఫ్యాక్టరీకి 0.013 టీఎంసీల నీటిని చంద్రబాబునాయుడు హయాంలోనే కేటాయించారని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ కేటాయింపులను కొనసాగిస్తూ ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. సీబీఐ దర్యాప్తు సంస్థ మాత్రం చంద్రబాబు చేసిన కేటాయింపులను వైఎస్ రాజశేఖరరెడ్డికి అంటగడుతోందని, పైగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇండియా సిమెంట్స్‌కు ఏకంగా పదమూడు టీఎంసీలు కేటాయించినట్లు ఎక్కువ చేసి చూపుతోందని చెప్పారు.

ఏఐసీసీ డెరైక్షన్.. చంద్రబాబు యాక్షన్
ఏఐసీసీ నేతల డెరైక్షన్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు యాక్షన్ చేస్తున్నారని విజయమ్మ విమర్శించారు. ఓ వైపు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకమంటూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటింగ్‌కు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యేలా చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాధి కట్టాలని అనేకసార్లు చెప్పిన చంద్రబాబు.. అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ప్రతి నిర్ణయం వెనుక పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దాగి ఉందని వివరించారు. కడప లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయని, ఇలా చేయడం తప్ప వేరే గత్యంతరం లేదని అవి నిర్ణయానికి వచ్చాయని చెప్పారు.

రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వానికి చిరంజీవి మద్దతు ప్రకటించిన తర్వాత చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని, దానివల్ల ప్రభుత్వం నిలబడిందని తెలిపారు. రెండోసారి విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీనే ప్రభుత్వానికి అండగా నిలబడిందని చెప్పారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడిన చరిత్ర చంద్రబాబునాయుడుకే దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో కొత్త డ్రామాలకు తెరలేపుతూ రాష్ట్ర మంత్రులను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్‌కు బాబు ఫిర్యాదు చేశారని చెప్పారు. అవినీతిపై పోరాటం, లోక కల్యాణమంటున్న చంద్రబాబే రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడని విజయమ్మ చెప్పారు. 

ఆయన హయాంలో ఏలేరు కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, ఐఎంజీ భూముల వ్యవహారం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. వీటిన్నింటిపై ఏనాడూ విచారణ చేయించుకోలేదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్టేడియంలను ఎటువంటి బాడుగ లేకుండా కేవలం రూ.2.50 కోట్లకు 40 ఏళ్ల లీజుకు కట్టబెట్టిన ఘనత కూడా ఆయనదేనన్నారు. చంద్రబాబు ఇచ్చిన అనుమతులను కొనసాగించిన నేరానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైన అభాండాలు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిపై నిందలు వేస్తున్నారని చెప్పారు. ప్రజా శ్రేయస్సును విస్మరించిన పాలక పక్షాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండిపోయిందని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.34 వేల కోట్ల కరెంటు చార్జీల భారాన్ని మోపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ 26 జీవోలపై కోర్టుకు విన్నవించి ఉంటే..
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 26 జీఓలు అక్రమమో, సక్రమమో ఏడు నెలల్లోగా వివరించండని కోర్టు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని విజయమ్మ చెప్పారు. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే కోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. జీవోలు కేబినెట్ నిర్ణయమే అన్న విషయాన్ని కోర్టుకు వివరించకుండా అప్పట్లో చేసిన పాపమే ఇప్పుడు మంత్రులకు యమపాశమైందన్నారు.‘చెడపకురా చెడేవు’ అని పెద్దలు అంటుంటారని, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

అవినీతి మంత్రులు, కళంకితులు అంటేనే మంత్రులు అంతగా బాధ పడుతున్నారని, ప్రభుత్వ పాలనతో సంబంధంలేని, ఏ నేరం చేయని తన కుమారుడు జగన్‌ను ఏడాదిగా జైల్లో ఉంచారని అనుకుంటేనే భరించరాని బాధ ఉంటోందన్నారు. ‘‘జగన్ ఏ రోజైనా సెక్రటేరియట్‌కు కానీ, మంత్రుల ఆఫీసులకు కానీ వచ్చారా? సీఎం క్యాంపు ఆఫీసులో ఆయన్ని మీరెవరైనా చూశారా? మీకెప్పుడైనా ఏ పనుల కోసమైనా రికమండేషన్ చేశారా’’అని విజయమ్మ కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. వ్యాపారాలు చేసుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి పీసీ యాక్ట్ వర్తించదని సీబీఐ కోర్టే వెల్లడించిందన్నారు. జగన్ కడిగిన ముత్యంలా కేసులనుంచి బయటకు వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో జగన్ కొనసాగి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారని ఏఐసీసీ నేత గులాంనబీ అజాద్ స్వయంగా చెప్పారని, ఆ పార్టీని వీడినందుకే జగన్‌పై కేసులు పెట్టారని విజయమ్మ అన్నారు.

అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు
మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో రైతాంగం అష్టకష్టాలు పడుతున్నా పాలకులకు చలనం లేకుండా పోయిందని విజయమ్మ ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు కల్పించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని చెప్పారు. మరోపక్క ఎరువుల ధరలు 300 శాతం పెరిగిపోయాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. బ్యాంకులు పంటలకు ఇన్సూరెన్స్ చేస్తున్నప్పటికీ, పరిహారం మాత్రం రైతాంగానికి అందడంలేదన్నారు. 2011లో నష్టపోయిన రైతాంగానికి కూడా ఇప్పటివరకు పరిహారం అందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

తాగునీటి పథకం ప్రారంభం
పులివెందుల నియోజకవర్గంలోని కె.రాజుపల్లె గ్రామంలో రూ.8 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని విజయమ్మ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి ప్రజలు కాంగ్రెస్‌కు రెండోసారి అధికారం కట్టబెడితే, ప్రస్తు త ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వంచిస్తోందని చెప్పారు.
Share this article :

0 comments: