ఎన్టీఆర్ కుమారులకు ఇవ్వలేదేం ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఎన్టీఆర్ కుమారులకు ఇవ్వలేదేం ?

ఎన్టీఆర్ కుమారులకు ఇవ్వలేదేం ?

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013

* తనకు స్వార్థం, పదవీ వ్యామోహం లేవని బాబు ఈ మధ్య డైలాగులు కొడుతున్నారు
* తనకు సీఎం కావాలనే కోరిక లేదని చెప్తున్నారు
* పదవీ వ్యామోహం లేకపోతే... ఎన్టీఆర్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?
* సీఎం కావాలనే కోరిక లేకుంటే... నాడు ఎన్టీఆర్ బిడ్డలకు ఆ పదవి ఇవ్వలేదేం?
* తనపై విచారణ జరగకుండా ఉండడానికే... అవినీతిపై చంద్రబాబు పోరాటమంటున్నారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య కొత్త డైలాగులు కొడుతున్నారు. ఆయనకు స్వార్థం, పదవీ వ్యామోహం లేవట.. ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదట.. తాను లోక కల్యాణానికి పని చేస్తున్నానని అంటున్నారు. ఆయన అవినీతి మీద ధర్మ పోరాటం చేస్తున్నానని కూడా అంటున్నారు. చంద్రబాబూ.. మీకు పదవీ వ్యామోహం లేకపోతే నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన కుర్చీని, ఆయన పదవినీ, ఆయన పార్టీనీ ఎందుకు లాగేసుకున్నారు? నిజంగానే ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు లేకపోతే, నాడు ఎన్టీఆర్ కుమారుల్లో ఏ ఒక్కరినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద ఎందుకు కూర్చోబెట్టలేదు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సూటిగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో సాగింది. భీమవరం నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

బాబు మాటలు వింటే.. చిన్న పిల్లలూ నవ్వుతారు
‘‘చంద్రబాబు నాయుడూ.. మీకు పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడవడమేనా ధర్మపోరాటం అంటే? నిజంగా మీకు ముఖ్యమంత్రి కావాలనే కోరికే లేకుంటే అంత నీచంగా వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కుర్చీని, అధికారాన్ని ఎందుకు లాగేసుకున్నారు? చంద్రబాబుకు పదవీ వ్యామోహం, ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆశ లేదంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లపాటు ప్రజాసేవ చేయకుండా కళ్లు తెరుచుకొని నిద్రపోయి ఈయన ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ‘వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు వేదాంతే’ అని ఓ సామెత ఉంది. ఆయన మాటలు వినే మనమంతా వెర్రివాళ్లమని, గొర్రెలమని, ఏం చెప్తే అది తలాడించి వింటామని, నమ్ముతామని చంద్రబాబు అభిప్రాయం. 

చంద్రబాబు చరిత్రహీనుడు..
ఇవాళ రాష్ట్రంలో రైతులంతా అల్లాడిపోతున్నారు.. పండించిన పంటకు మద్దతు ధర లేదు. ఎరువుల ధరలు ఇప్పటికి 300 శాతం పెంచారు. లేని కరెంటుకు మూడింతలు బిల్లులు వేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు ఇప్పటికి మూడుసార్లు పెంచారు. గ్యాస్ ధర రూ. 305 నుంచి రూ. 420 అయింది. అదీ సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకుంటే ఏకంగా రూ. వెయ్యి. వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఇలా ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిదీ పెంచేశారు. రూ. 30 వేల కోట్ల కరెంటు భారం ప్రజల నెత్తిన మోపి వాళ్ల రక్తం పిండి వసూలు చేస్త్తున్నారు.ప్రజల్లోంచి పుట్టిన నాయకుడైతే ప్రజా సమస్యలు తెలిసేవి.

కానీ ఆయన ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో వచ్చిన సీఎం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాసం పెడితే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడారు. ‘రాబందులు రాజ్యమేలుతుంటే గుంట నక్కలు తాళం వేశాయ’న్నట్లు.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంత ఘోరంగా పరిపాలన చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు చప్పట్లు కొట్టి ఈ ప్రభుత్వం కూలిపోకుండా చేతులు అడ్డంపెట్టి మరీ కాపాడుతున్నారు. స్వప్రయోజనాల కోసం ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసినందుకు చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.

తనపై విచారణ జరగకుండా ఉండడానికే..
ఈ మధ్య చంద్రబాబు నాయుడు తాను అవినీతిపై పోరాటం చేస్తున్నానని అంటున్నారు. చంద్రబాబు పోరాటం.. కరెంటు చార్జీలు పెంచారని కాదు, ఎఫ్‌డీఐతో రైతులకు, చిన్న వ్యాపారులకు నష్టం వస్తుందని కాదు, ఆయన పోరాటం.. ఐఎంజీ, ఎమ్మార్ భూ కుంభకోణాల్లో తన మీద విచారణ జరగకుండా ఉంటడానికే. ప్రజలు చూస్తున్నారు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా, నిస్సిగ్గుగా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకుంటూ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న ఈ చంద్రబాబును ఏమనాలి? నాయకుడు అనాలా? పచ్చి అవకాశవాది అనాలా?

12.6 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 159వరోజు షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని మహాదేవపట్నం అడ్డరోడ్డు నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సింహాపురం, ఉండి గేటు మీదుగా భీమవరం పట్టణంలోకి ప్రవేశించారు. అక్కడ భారీ ఎత్తున తరలిచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి విస్సాకోడేరు గ్రామం చేరుకున్నారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శనివారం మొత్తం 12.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,107.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విస్సాకోడేరు వద్ద షర్మిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, పేర్ని నాని, నేతలు మొవ్వ ఆనంద శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాసు, పాతపాటి సర్రాజు, ముదునూరు ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: