ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా?

ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా?

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు
- కిరణ్, బాబు ఒకే రోజు ఒకేలా మా పార్టీపైన,‘సాక్షి’పైన అక్కసు వెళ్లగక్కారు
- ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా?
- కిరణ్, బాబులతో చిలుక పలుకులు పలికించేదెవరు?
- మీ తప్పులను ఎత్తి చూపడమే ‘సాక్షి’ చేసిన తప్పా?
- కిరణ్, బొత్సలు చానళ్లు పెట్టడానికి డబ్బెక్కడిది?

సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకేరోజు ఒకేలా వైఎస్సార్ సీపీపైన, ‘సాక్షి’పైన అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేలా మాట్లాడారు. కిరణ్ స్క్రిప్టు చంద్రబాబు చదివారా? లేక చంద్రబాబు స్క్రిప్టు కిరణ్ చదివారా? లేదా వీరిద్దరూ ‘ఈనాడు’ రామోజీరావు రచించిన స్క్రిప్టు చదివారా? కిరణ్, చంద్రబాబుల చేత చిలుక పలుకులు పలికించేదెవరు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలందరూ.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని పల్లెత్తు మాట విమర్శించకుండా ప్రజాపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీని తూలనాడటానికే సమయం వెచ్చించారని తెలిపారు. అదే విధంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు, చంద్రబాబు హయాంలో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొస్తున్నందుకే ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారా? అని గట్టు ప్రశ్నించారు. మీ తప్పులను ఎత్తిచూపడమే ‘సాక్షి’ చేసిన తప్పా? అని అడిగారు. నాణేనికి రెండో కోణాన్ని చూపుతున్నందుకు ఎల్లో మీడియా మొత్తం జట్టుగా ఏర్పడి ‘సాక్షి’పై విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

మీ చానళ్లు, పత్రికల అడ్రసేంటి?
రెండు న్యూస్ చానళ్లను, ‘కృష్ణా పత్రిక’ అనే దినపత్రికను నడిపించడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని గట్టు ప్రశ్నించారు. ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిరణ్ నడిపిస్తున్న పత్రిక ఏ అక్రమ పుత్రికనో ఆయనే స్పష్టం చేయాలన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ న్యూస్ చానెల్ కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడిదో బయటపెట్టాలన్నారు. కిరణ్, బొత్సలు న్యూస్ చానెళ్లు, పత్రికలు కొనుగోలు చేస్తున్నా వాటిపై విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ ప్రశ్నించరన్నారు. అదే విధంగా చంద్రబాబు బినామీలైన రామోజీ, రాధాకృష్ణల మీడియా సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై సీఎం కిరణ్ విచారణ జరపరని అన్నారు. ఈ మేరకు ఇద్దరూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని గట్టు వెల్లడించారు. ఇద్దరూ కలిసి వారి లోపాలు బయటపడకుండా మంచి నటనతో రక్తికట్టిస్తున్నారన్నారు.

మంత్రి ఆనం మానసిక ఉన్మాది
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక మానసిక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ పిచ్చికూతలు కూస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఆనం సోదరులు పచ్చి అవకాశవాదులని దుయ్యబట్టారు. మంత్రి ఆనం శాడిస్టు అయితే, ఆయన సోదరుడు వివేకానంద పగటి వేషగాడంటూ నిప్పులు చెరిగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే వీరు పిచ్చికూతలు కూసేవారా? అని ప్రశ్నించారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని వెక్కివెక్కి ఏడ్చిన మంత్రి ఆనం.. ఇప్పుడు అధికారకాంక్ష, అవకాశవాదంతో హీనంగా మాట్లాడుతున్నారన్నారు. ఆనం సోదరుల చరిత్రేంటో నెల్లూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసన్నారు. ‘‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు తన పరీక్ష రాయకుండా ఇతరుల చేత రాయిస్తూ గతంలో అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో పత్రికలు పెద్దపెద్ద అక్షరాలతో ‘చీడ పురుగా, పేడ పురుగా’ అంటూ కథనాలు వెలువరించాయి. మరి అలాంటి చీడ పురుగును కన్న తండ్రిని ఏ పురుగుతో పోల్చాలి’’ అని గట్టు ధ్వజమెత్తారు.

ఆ నోట్లు ముద్రించమన్నది నీవే కదా బాబూ!
అబద్ధాలను చాలా అందంగా, కనురెప్ప కొట్టకుండా చెప్పగల నేర్పరి చంద్రబాబు అని గట్టు విమర్శించారు. రూ.వెయ్యి, రూ.500 నోట్లు వెలువడడానికి ముఖ్యకారణమైన చంద్రబాబే వాటిని తొలగించడానికి ఉద్యమం చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఎన్డీయే హయాంలో చక్రం తిప్పిన చంద్రబాబు పట్టుబట్టి రూ.వెయ్యి, రూ.500 నోట్ల ముద్రణకు ఒప్పించారని తెలిపారు. 

అదే విధంగా రాజకీయాలను ఆర్థికమయం చేసి, అత్యంత హీనంగా భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబే అని వివరించారు. దొంగనోట్ల ముద్రణ, నకిలీ స్టాంపులు మొదలు అనేక కుంభకోణాల్లో చంద్రబాబు హస్తముందని, అయితే అవి వెలుగులోకి రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల సందర్భంగా చిత్తూరులో టీడీపీ నేత హరిబాబు వాహనంలో దొరికిన రూ.7 కోట్లు చంద్రబాబువే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ దానిపై విచారణ చేయడం లేదేమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల నేతలు ఒకరికొకరు సహకరించుకుంటూ పూర్తిగా కలిసిపోయారని గట్టు విమర్శించారు.
Share this article :

0 comments: