ఈ ఏడాది కాలాన్ని తిరిగివ్వగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఈ ఏడాది కాలాన్ని తిరిగివ్వగలరా?

ఈ ఏడాది కాలాన్ని తిరిగివ్వగలరా?

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

రాజకీయాలు చాలా విచిత్రమైనవి. రాజకీయాల్లో ఉండే వారికి పదవుల కన్నా మరేదీ ముఖ్యం కాదు. నైతిక విలువలు, విశ్వాసం, నమ్మకాల కన్నా పదవే ముఖ్యం అనే రోజులు చూస్తున్నాం. డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరినైతే నమ్మకంగా, తనను నమ్మినవారిగా భావించి పైకి తెచ్చారో, వారే ఈరోజు ముందుండి వై.ఎస్.జగన్‌ని విమర్శించటం బాధ కలిగిస్తోంది. ఆనాడు వారిని ఎంచుకోవటంలో వైఎస్సార్ పొరపాటుపడ్డారా లేదా వారే ఆ మహానేతను మోసం చేశారా అన్నది అర్థం కావటం లేదు. మొదట వై.ఎస్. జగన్ పార్టీ పెట్టాలని భావించ లేదు. తండ్రి చనిపోయిన వార్త విని గుండె ఆగి మరణించినవారి కుటుంబాలను పరామర్శించి, ఓదార్చటానికి వెళ్తున్నప్పుడు జగన్‌పై అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. ఓదార్చటం ఎలా తప్పవుతుందో ఇప్పటికీ నాకర్థం కావటం లేదు. 

జిల్లాలో ఒకేచోటికి పిలిచి ఓదార్చండి అని ఒకరు, ఇప్పుడు వద్దని ఒకరు, అవసరం లేదు అని ఒకరు, అంతమంది చనిపోలేదని ఒకరు అంటుంటే, ఆ మహానేత పెంచి పదవులిచ్చిన నాయకులు అంతా ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు ఓదార్పుకు సపోర్ట్ చెయ్యలేదు? వై.ఎస్.జగన్, విజయమ్మగార్లు వెళ్లి సోనియాగాంధీని కలిసినా ఎందుకు స్పందన రాలేదు? ఆమె ఎందుకు ఓదార్పుకు అనుమతి ఇవ్వలేదు? ఈ ప్రశ్నలకు ఆ మహానేత చేరదీసిన నాయకులు ఎందుకు సమాధానమివ్వరు? వైఎస్సార్ బతికుండగా చేవెళ్ల నుండి ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించి, సొంత చెల్లెలుగా భావించిన సబితా ఇంద్రారెడ్డి కూడా పదవిని పట్టుకుని వేలాడుతూ ఓదార్పు గురించి సపోర్టు చెయ్యకపోగా, చివరికి ఇప్పుడు ‘తెర వెనుక ఏం జరిగిందో’ అంటోంది! కనీసం అప్పుడు జరిగినవన్నీ కరెక్ట్ అనటం లేదు. చనిపోయిన నేతపైకి నెట్టేస్తున్నారు. 

అలాగే టీడీపీ నుంచి తెచ్చి టికెట్ ఇచ్చి ఓడిపోయినా మళ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేస్తే, దానం నాగేందర్ ఓదార్పుకి సపోర్ట్ చెయ్యకపోగా మొన్న అసెంబ్లీలో ‘పాస్‌పోర్టు అని ఎవరు అన్నారో తెలుసు’ అని గుర్తుచేశారు. ఆ మహానేత అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓదార్పుకి అనుమతి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పకపోగా, నోరు మెదపకుండా ఉండి, ‘ఇప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు? వై.ఎస్. ఎప్పుడూ పార్టీకి ఎదురు తిరగలేదు. ఆయన మనసు క్షోభిస్తుంది. జగన్ పార్టీ పెట్టినందుకు’ అంటున్నారు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితునిగా ఉన్న ఉండవల్లి ఎందుకు ఓదార్పుకు అనుమతి ఇప్పించలేకపోయారు? ఎందుకు ఆ కుటుంబ రుణం తీర్చుకోకుండా కాకమ్మ కథలు చెపుతున్నారు. అలాగే ఆయన ఉన్నప్పుడు నోరు మెదపని ఆనం బ్రదర్స్, బొత్స సత్యనారాయణలు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు. ఎందుకు విషం చిమ్ముతున్నారు?

‘సాక్షి’ విషయంలో కూడా ఈ నాయకులు రెండు నాలుకల ధోరణిని ప్రదర్శించారు. జగన్ ‘సాక్షి’ని స్థాపించినప్పుడు వీళ్లంతా సాక్షిని పొగిడారు. ఆనాడు సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులు అన్నీ కూడా కేవలం వ్యాపార దృష్ట్యా పెట్టినవే. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయనే దృక్పథంతో పెట్టినవే. అయితే ఆ మహానేత చనిపోయిన తర్వాత, ఓదార్పుయాత్రకు అనుమతి నిరాకరించిన తర్వాత, అనుమానాలను భరించలేక జగన్ బయటకు వచ్చిన తర్వాత, పార్టీని స్థాపించిన తరువాత... ఆ రెండు పత్రికలకు, కాంగ్రెస్ పెద్దలకు ‘క్విడ్ ప్రోకో’ గుర్తుకొచ్చింది. వై.ఎస్.జగన్, విజయమ్మగార్లు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాతే వారికున్న అత్యంత ప్రజాదరణను చూసి, ఇక లాభం లేదనుకుని సీబీఐని ఉసిగొల్పారు. 

ఈ పెట్టుబడులు అన్నీ కూడా ‘క్విడ్‌ప్రోకో’లో భాగమే అన్నారు. ప్రయోజనానికి ప్రతిఫలమే అంటూ సీబీఐని ప్రోత్సహించారు. కేసులు పెట్టించి, పెట్టుబడులు పెట్టినవారిని బెదిరించి, లాలించి, భయపెట్టారు. ‘పెట్టుబడులన్నీ మాకు జరిగిన ప్రయోజనాలకు ప్రతిఫలమే’ అని చెప్పించడానికి పడరాని పాట్లు పడుతూ జగన్‌ని విచారణ పేరిట అరెస్టు చేయించారు. చార్జిషీట్లు పూర్తికాలేదంటూ ఏడాదిగా జైల్లో ఉంచారు. జైల్లో పెట్టిన తర్వాత కూడా ఆయన 16 అసెంబ్లీ స్థానాలు గెలవటంతో ఇక పూర్తిగా జగన్‌ని జైల్లోనే ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకింకా నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థలో మనం మన మీద వచ్చిన అభియోగాలను తప్పు అని నిరూపించే సమయం తప్పక వస్తుంది. మరి అప్పుడు జగన్ నష్టపోయిన ఈ ఏడాది కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు? కుటుంబానికి, తాను పెద్ద కుటుంబంగా భావించిన రాష్ట్రప్రజానీకానికీ దూరమైన విలువైన ఈ కాల ం ఎలా భర్తీ అవుతుంది? ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 

మరోవైపు ప్రజలు... వై.ఎస్.జగన్‌కి జరిగిన అన్యాయానికి, ఆయనకు జరిగిన అవమానానికి ఎలా కసి తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. మహానేత వైఎస్సార్ అండతో ఎదిగి, నేడు ఆయన కుటుంబంపై విషం చిమ్ముతున్నవారికి కూడా గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధులై ఉన్నారు.

- కె.సాయి మార్కొండారెడ్డి, మాచర్ల, గుంటూరు జిల్లా

మాట అనే ముందు... గతం గుర్తుచేసుకోండి

ఆనం రామనారాయణరెడ్డి జగన్‌పై చేసిన దారుణమైన విమర్శలకు నా మనసు కలతచెందింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టి, వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారు. ఉన్నత పదవిలో ఉన్నవారు, వై.ఎస్. ఉన్నప్పుడు ఆయన ప్రాపకానికి పాకులాడినవారు ఇప్పుడు ఆయన కుమారుడిపై నిందలు వేయడం కృతఘ్నత తప్ప ఇంకొకటి కాదు. నాయకులారా! ఆత్మవిమర్శ చేసుకోండి. మాట అనే ముందు ఆలోచించండి.

- పి.రఘురామిరెడ్డి, శ్రీకాకుళం
Share this article :

0 comments: