జగనన్న బాణాన్నే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న బాణాన్నే

జగనన్న బాణాన్నే

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు... ఆ పార్టీ విధానమేమిటో... సిద్ధాంతమేమిటో ఆవిష్కరించినప్పుడు... రాజన్న రాజ్యం గురించి పార్టీ పెట్టిన రోజే విశదీకరించినప్పుడు మొదలైన కుట్రలు, కుతంత్రాలు ఆయనను జైలులో బందీని చేశాయి.
అయినప్పటికీ ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఆయన సోదరి షర్మిల సాహసోపేతంగా ‘మరో ప్రజాప్రస్థానా’నికి శ్రీకారం చుట్టారు. చెల్లెలికి జగనన్న నిర్దేశించిన లక్ష్యం సామాన్యమైంది కాదు. అది అంత చేరువలో లేదని ఆమెకూ తెలుసు. తాను నడిచేది రాచబాట కాదన్న విషయమూ తెలుసు. అయినా అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో షర్మిల అడుగేశారు. నాన్న దీవెనలు... అమ్మ ఆశీస్సులు.... అన్న మాట... వీటన్నింటినీ గుండెల్లో నింపుకుని ముందుకు కదిలారు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి అడుగులో అడుగు వేసుకుంటూ కదిలినప్పుడు బహుశా షర్మిల కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఒక మహిళ. ఆమెకు అనేక ఆటుపోట్లు. ఆమెపై అనేకానేక నిందలు, నిష్టూరాలు. అయినా అవేవీ ఆమె పాదయాత్రకు అడ్డు రాలేదు. అప్పుడు ఆమె ముందున్నది ఒకే లక్ష్యం. ఇచ్చిన మాట కోసం పరితపిస్తూ నిలబడిన జగనన్న. ఆ అన్న మాటకు కార్యరూపమివ్వాలన్న ఉక్కు సంకల్పంతో షర్మిల. ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనే తనను ముందుకు నడిపిందన్నది ఆమె చెప్పే మాట.

2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో మొదలుపెట్టి... ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 2,000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కూడా షర్మిలలో ధైర్యం అణుమాత్రమైనా సడల్లేదు. ప్రపంచంలోనే ఏ మహిళా ఇంతటి సాహసోపేతమైన పాదయాత్ర చేయలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అడుగు తీసి అడుగేసిన ప్రతి చోటా వేలాదిగా అవ్వలు, తాతలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. పిల్లలను ఎత్తుకుని ప్రేమగా ముద్దాడారు. తండ్రి దీవెన... అన్న మాట... సాహస పాదయాత్రకు పురిగొల్పితే... అడుగు పెట్టిన ప్రతి చోటా ప్రజలు చూపిస్తున్న అపూర్వ ఆదరాభిమానాలు తనను మరింత ఉత్సాహంతో ముందుకు నడుపుతున్నాయని చిరునవ్వుతో చెబుతున్నారు షర్మిల. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక మహిళ తలపెట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రారంభించి 10 జిల్లాల మీదుగా గురువారం నాటికి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామానికి షర్మిల చేరుకున్నారు. 2,000 కిలోమీటర్ల మైలురాయికి గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన తండ్రి వైఎస్ నిలువెత్తు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకు కొద్దిముందు, ఉద్విగ్నభరితమైన వాతావరణంలో ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి కె.సుధాకర్‌రెడ్డికి షర్మిల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

ఇంతటి సాహసోపేతమైన పాదయాత్ర చేయాల్సి వస్తుందని మీరెప్పుడైనా ఊహించారా?
లేదు. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కుట్రపూరితంగా జగనన్నను కేసుల్లో ఇరికించి జైలులో పెడతారని అనుకోలేదు.

{పపంచ చరిత్రలోనే ఏ మహిళా చేయని సాహసం చేసి రికార్డు నెలకొల్పారు. మరి కాసేపట్లో 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటబోతున్న సందర్భంలో మీరెలా ఫీలవుతున్నారు?
నేను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదు. జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చెప్పాల. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాల. అదే చేస్తున్నా. ఇందులో రికార్డులంటారా... దాని గురించి ఆలోచించడం లేదు.

ఇప్పటిదాకా దాదాపు పది జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఎంతోమందిని కలిశారు. వారి నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
ఎంతగానో ఆదరిస్తున్నారు. పెద్దలు, యువకులు ఒకరేంటి... అందరూ ఎంతో ఆప్యాయత కనబరుస్తున్నారు. ప్రత్యేకించి మహిళలు నన్ను ఒక కూతురిగానో, ఒక అక్కగానో భావిస్తున్నారు. చిన్న పిల్లలైతే ఎంతో ఆప్యాయంగా అక్కా అంటూ పలకరిస్తుంటే కొన్నిసార్లు ఉద్వేగానికి లోనవుతున్నా. వారితో మాట్లాడిన ప్రతి చోటా రాజశేఖరరెడ్డి గారి గురించి తలచుకుంటున్నారు. జగనన్న ఎప్పుడొస్తాడని అడుగుతున్నారు.

పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు మీరు ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ కాలినడకకు శ్రీకారం చుట్టారు. ఈ రోజుకు 2,000 కిలోమీటర్లు నడిచారు. మరి మీ లక్ష్యం నెరవేరుతోందా?
కచ్చితంగా. జరుగుతున్న అన్యాయాలను చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వింటున్నారు. జనం కష్టాల్లో పాలుపంచుకోవాలని నేనొస్తే, మా కష్టాల్లో పాలుపంచుకోవాలని వారు కోరుకుంటున్నారు. లక్ష్యమంటారా... నెరవేరుతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగాలని పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే సంకల్పించాం. అంతవరకు సాగుతుంది.

ఎండనకా వాననకా కుటుంబానికి దూరంగా ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేయాలంటే ఎంతో గుండె నిబ్బరం కావాలి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి తొలి అడుగు వేసినప్పుడు మీ అనుభూతి ఏంటి? సుదీర్ఘ లక్ష్యం గుర్తుకు రాలేదా?
నాకు గుర్తొచ్చేదొక్కటే. జగనన్న బయటకు రావడం. జనంలో ఉండే జగనన్నను కాళ్లూ చేతులు కట్టేసి జైల్లో పెట్టినప్పుడు... ఆ కుట్రలు, కుతంత్రాలను చూస్తున్నప్పుడు, సాధించాలన్న తపనే తప్ప మరో భావన రాలేదు. పాదయాత్ర అంటారా... 2003లో నాన్నగారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా చేసిన పాదయాత్రను ప్రత్యక్షంగా చూశాను. దాంట్లో ఎదురయ్యే కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఇది నాకు పెద్దగా కష్టమనిపించలేదు. అభిమానించే ప్రజలుంటే ఎన్ని కష్టాలైనా బలాదూరే. పైనున్న నాన్న సంతోషిస్తారు. ఈ జన్మకు అది చాలదా!

ఒక సమస్యపై పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ 250 కి.మీ. పాదయాత్ర చేశారు. అదే ఇప్పటివరకు ఒక మహిళ సాధించిన రికార్డు. మీరు ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టారు. దీనికి కారణమేంటి?
చెప్పాను కదా... జగనన్నకు ఈ పరిస్థితి రాబట్టే నేను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది. ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ జగనన్నే తయారు చేశారు. ప్రజల్లో ఉండాలని చెప్పారు. తండ్రి అడుగుజాడల్లో పాదయాత్ర చేయాలని చెప్పారు. జగనన్న ఎప్పుడూ ప్రజలను నమ్ముకుంటారు. జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రజలకు వివరించమన్నారు. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తుంటే... ప్రజలను వంచిస్తుంటే... మనకు నమ్మకమైన, మనల్ని నమ్మే ప్రజలకు వాస్తవాలు చెప్పమన్నారు. అందుకే ఈ పాదయాత్ర.

పాదయాత్ర సంకల్పంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి?
అన్న మాట. జగనన్న మాట. నాన్న ఆశీర్వాదం. జగనన్న నిర్బంధంలో ఉన్నారన్న బాధ.

కరువు కాటకాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నప్పుడు నేనున్నానంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి వారిలో భరోసా నింపడానికి ఆనాడు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. ఆ తర్వాతి పరిణామాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 300 రోజులకు పైగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇటీవలి కాలంలోనే విజయమ్మ కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు మీరు. ఇలా మొత్తం కుటుంబం ప్రజల మధ్యే ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
వైఎస్ ప్రజల మనిషి. జగనన్న ప్రజల్లో మనిషి. నాన్న చనిపోతూ తనకొక పెద్ద కుటుంబాన్నిచ్చారని నల్లకాలువ సభలో అన్న చెప్పారు. ప్రజల కోసం బతకలేనప్పుడు ఎందుకీ జీవితమని నమ్మేవారు నాన్నగారు. ఆయన చనిపోయాక జగనన్న చేయగలిగినంత కాలం చేశారు. ఇప్పుడు ఆయనను నిర్బంధించారు. అందుకే ఆ తర్వాత వరుసలో నేను చేరా.

మీరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం మీపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. సందర్భోచితంగా మీరు సమాధానాలూ చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను మీరెలా చూస్తారు?
ఆ విమర్శలు ఎందుకొస్తున్నాయో ప్రజలకు తెలుసు. జగనన్న ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక ఆయన్ను జైలులో పెట్టారు. ఇప్పుడు నేను చేస్తున్న పాదయాత్రలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా వచ్చి నన్ను పలకరిస్తుంటే... తండోపతండాలుగా కదిలొచ్చి పాదయాత్రకు సంఘీభావం చెబుతుంటే... ఇలా ఆరోపణలు చేయడం కన్నా ఇంకేం చేస్తారు! షర్మిలను అప్రతిష్టపాలు చేయాలి! ఆ ప్రయత్నంలోనే ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజల అండ ఉన్నంత కాలం ఎవరెన్ని నిందలు మోపినా భయపడాల్సిన పని లేదు.

వైఎస్ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవే తప్ప వైఎస్‌వి కాదని రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పైగా ఇప్పుడు అంతకన్నా మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మీరిప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా కలిసి మాట్లాతున్నారు కదా. కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయాల్లో పొంతన ఉందా?
సంక్షేమ పథకాలు వైఎస్‌వి కాదనుకుంటే మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవెందుకు లేవు? వాళ్ల పథకాలు కావని అక్కడే తేలిపోతోంది. పైగా నాన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ వీళ్లు తూట్లు పొడిచారు. నేను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లంతా అదే చెబుతున్నారు. ప్రజలెప్పుడూ అబద్ధాలు చెప్పరు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడికెళ్లినా తమ్ముళ్లు, చెల్లెళ్లు చెబుతున్నదిదే. ఫీజు కట్టే స్తోమత లేక మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఉందని కన్నీళ్లపర్యంతమై మరీ చెబుతున్నారు. వీళ్లు ఏ పథకం సరిగా అమలు చేస్తున్నారో చెప్పమనండి! ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడిచారు. ఊళ్లలో కరెంటే ఉండటం లేదు. 30 కిలోల బియ్యం మాటే మరిచిపోయారు. నిరుపేదల ఇళ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వృద్ధుల పింఛన్లు కూడా అంతే. వారి నోటికాడ బుక్కను లాగేస్తున్నారు. ఎంత దారుణం! వడ్డీ లేని రుణాలని చెబుతున్నారే... గ్రామాల్లోకి వచ్చి ప్రజలను అడిగితే అందులోని వాస్తవం తెలుస్తుంది. ఉపాధి హామీ పథకమైతే దారుణంగా తయారైంది. పలుచోట్ల అభయహస్తం అమలు కావడమే లేదని చెప్పారు. 108 అంబులెన్సులను తగ్గించారు. వైఎస్ సంకల్పించిన పథకానికే పేరు మార్చి బంగారు తల్లి అని పెట్టారని వాళ్ల మంత్రులే చెబుతున్నారు కదా!

మరో ప్రజాప్రస్థానానికి రెండు ఉద్దేశాలని తొలి రోజు మీరు చెప్పారు. ఆ రెండింటినీ ప్రజలకు వివరిస్తున్నప్పుడు వారి నుంచి స్పందన ఎలా ఉంది?
పాదయాత్ర మొదటి రోజున చెప్పాను. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అసమర్థ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా కాపాడుతున్న ప్రధాన ప్రతిపక్ష టీడీపీని నిలదీయడం. ఈ రెండంశాల గురించి చెబుతున్నప్పుడు ప్రజలంతా అవును కరెక్టే కదా అంటున్నారు. బాగా అర్థం చేసుకుంటున్నారు. చాలా స్పందిస్తున్నారు.

నిజానికి ఈ యాత్ర జగనన్న చేయాల్సిందని, ఆయన తరఫున మిమ్మల్ని పంపారని మీరు చెబుతున్నారు. అది విని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?
జగనన్న రావాలన్న ఆకాంక్షను ప్రతి ఒక్కరిలోనూ చూస్తున్నాను. అన్న ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని వారు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. జగనన్న రావాలి, రాజన్న రాజ్యం తేవాలి. అదే వాళ్లు కోరుకుంటున్నారు.

జగన్ బయటకు రావాలని ఆశిస్తున్న అభిమానులు, ప్రజలకు మీరిచ్చే సందేశమేంటి?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో జగనన్న బయటకు రావడమన్నది కూడా అంతే నిజం. వైఎస్ కుటుంబాన్ని ఆదరించే, జగనన్నను అభిమానించే వారందరికీ నేనొక్కటే చెబుతున్నా. దేవుడున్నాడన్నది ఎంత నిజమో జగనన్న బయటకు రావడం కూడా అంతే నిజం. అదే నమ్మకం, విశ్వాసంతో ఉండండి.

జగన్ విషయంలో సీబీఐ దర్యాప్తు కుట్రపూరితంగా జరుగుతోందని చాలాసార్లు ఆరోపించారు? 
అవును. నిజమే కదా. సీబీఐ ముమ్మాటికీ కాంగ్రెస్ కనుసన్నల్లో పని చేస్తోంది. అంతెందుకు... కోల్ గేట్ కుంభకోణంలో తేటతెల్లమైంది కదా. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి? జగనన్నపై కేసు పెట్టిన మొదటి నుంచీ మేం చెబుతున్నదిదే. కచ్చితంగా కుట్రపూరితంగానే కేసు వ్యవహారం నడుస్తోంది. లేకపోతే జగనన్నపై విచారణ ప్రారంభించాలని అనగానే అగమేఘాలపై సీబీఐ దేశంలోని అధికారులందరినీ పిలిచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతుంది. అదే చంద్రబాబుపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినప్పుడు ఏమైంది? పదిహేను రోజులైనా బృందాలు కాదు కదా, ఒక్క అధికారి కూడా సీట్లోంచి కదల్లేదు కదా! తమకు ఆదేశాలు అందలేదంటూ తాత్సారం చేయలేదా? ఆ వ్యత్యాసం కనబడటం లేదా? అంతకన్నా సీబీఐ తీరుకు నిదర్శనం ఏం కావాలి? జగనన్నపై జరుగుతున్న కుట్రలు ఎన్నెన్నో! చెప్పుకుంటూ పోతే గంటలు కాదు కదా, రోజులైనా సరిపోవు. మా ధైర్యం ఒక్కటే... దేవుడున్నాడు.
బొగ్గు స్కాంపై నివేదికను కేంద్ర న్యాయ మంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులు పరిశీలించి సవరించారని సీబీఐ సుప్రీంకోర్టులో అంగీకరించింది? 
అదే కదా చెబుతున్నా. ఒకో వ్యక్తి విషయంలో ఒక్కో రకంగా. తమకు కావాల్సిన వారి విషయంలో ఒక తీరు. ఇంకొకరి విషయంలో ఇంకో తీరు. మంత్రికి మాత్రమే సంబంధముంది తప్ప ప్రధానికి ఏమీ లేదని 2జీ కేసులో సీబీఐ చెబుతుంది. ప్రధాని కార్యాలయానికి కూడా ఏ సంబంధమూ లేదంటుంది. ఇక్కడికొచ్చే సరికి సీఎంకు (వైఎస్‌కు) సంబంధముంది గానీ మంత్రులకు లేదంటుంది. ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు. ఎవరిని ఇరికించాలనుకుంటే వారిని ఇరికిస్తారు. ఎవరిని జైల్లో పెట్టాలంటే వారిని పెడతారు. ఇక్కడ మంత్రులపై సీబీఐ ఈగ కూడా వాలనివ్వదు. మంత్రి పదవిలో ఉంటూ అధికారంలో ఉన్న వాళ్లేమో సాక్షులను ప్రభావితం చేయరట. ఏ అధికారమూ లేని జగనన్న మాత్రం బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారట. ఇదేమైనా సమంజసమైన వాదనేనా? దీంట్లో ధర్మం, న్యాయం ఏమైనా ఉన్నాయా? వాళ్లు (సీబీఐ) ఎవరిని రక్షించాలంటే వారిని రక్షిస్తారు. తమను కాదన్నందుకు దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులపై సీబీఐని ప్రయోగించింది వాస్తవం కాదా? ముఖానికి రంగేసుకున్నంత మాత్రాన ఎవరూ గుర్తుపట్టలేరనుకుంటే ఎలా? సీబీఐ ఏమిటో, అది చేస్తున్న దర్యాప్తులేమిటో రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ రోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది.

పాదయాత్రలో ఎంతోమంది బాధలు విన్నప్పుడు మీకేమనిపిస్తోంది?
జగనన్న తొందరగా బయటకు రావాలనిపిస్తోంది.

పది జిల్లాల్లో సాగిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలనెన్నింటినో ప్రస్తావించారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకని?
దున్నపోతుమీద వాన పడ్డ చందం. ముందే చెప్పాను కదా... ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండ ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికేం ఢోకా లేదని! టీడీపీ అండగా నిలిచినంత కాలం స్పందించరు. ఇదంతా టీడీపీ అండ చూసుకునే. అయినా సీల్డు కవర్ లీడర్లకు ప్రజల సమస్యలు తెలిసే అవకాశమే ఉండదు. అయితే ప్రజలు మేల్కొన్నారు. టీడీపీ అండ చూసుకుని తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని వారు నిద్ర లేపనున్నారు. సమయమొచ్చినప్పుడు ఎలా నిద్ర లేపాలో, ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు.


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62455&Categoryid=1&subcatid=18
Share this article :

0 comments: