స్థానిక ఎన్నికలపై విస్తృత భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక ఎన్నికలపై విస్తృత భేటీ

స్థానిక ఎన్నికలపై విస్తృత భేటీ

Written By news on Saturday, May 11, 2013 | 5/11/2013



సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు తదితర అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) శుక్రవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. తాజా రాజకీయ పరిణామాలతోపాటు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనడంపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయాత్తం చేయడం, వచ్చే సాధారణ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న ఎజెండాతో త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రజల పక్షాన నిలబడుతూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించింది. సమావేశంలో నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంతరం పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రకమైన ఆందోళనలు చేపట్టాలనేదానిపై చర్చించామన్నారు. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనతోపాటు పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి బూతు కమిటీల ఏర్పాటుపై చర్చించినట్లు కొణతాల చెప్పారు. జగన్‌కు బెయిల్ రాకపోయినా పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కొల్పోకుండా మరింత విస్తృతంగా ఉత్తేజంతో పనిచేసేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించామని, వాటి కార్యచరణ త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

తెలంగాణలో ఓదార్పు యాత్రపై చర్చ: బాజిరెడ్డి
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ‘ప్రాణహిత-చేవేళ్ల’కు జాతీయ హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో త్వరలో ఆందోళన చేపట్టాలని పీఏసీలో నిర్ణయించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. జగన్ జైలు నుంచి రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో అసంపూర్తిగా మిగిలిన ఓదార్పు యాత్రను విజయమ్మ నేతృత్వంలో జరపాలనే దానిపై కూడా చర్చించామన్నారు.
Share this article :

0 comments: