మంత్రులపై కాంగ్రెస్ వేటు అంతా ఓ గేమ్‌ప్లాన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రులపై కాంగ్రెస్ వేటు అంతా ఓ గేమ్‌ప్లాన్

మంత్రులపై కాంగ్రెస్ వేటు అంతా ఓ గేమ్‌ప్లాన్

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

* ఢిల్లీలో చంద్రబాబు యాగీ.. మంత్రులపై కాంగ్రెస్ వేటు అంతా ఓ గేమ్‌ప్లాన్ 
* బాబు ఢిల్లీ పర్యటన తర్వాతే మంత్రుల తొలగింపునకు సై అన్న అధిష్టానం
* మైనారిటీ సర్కారుకు మద్దతుగా ఉంటానన్న చంద్రబాబు హామీ మేరకే వేటు 
* జగన్ లక్ష్యంగా మొదలుపెట్టిన వికృత క్రీడలో మంత్రుల మెడకు ఉచ్చు
* ధర్మాన, సబితల తర్వాత... మరో నలుగురు మంత్రుల మెడపై కత్తి!

... ఓవర్ టు హస్తిన
రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎదగటంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సంబంధాలను బలపరచుకున్నారు. వై.ఎస్.జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. ‘ఢిల్లీ’తో చేతులు కలిపి ఆయనను కేసుల్లో ఇరికించే కుట్రలో కుమ్మక్కయ్యారు. పనిలో పనిగా తనపై ఉన్న కేసుల్లో దర్యాప్తు జరగకుండా కేంద్రం ముందు సాగిలపడి రాష్ట్ర సర్కారుకు తెరవెనుక మద్దతు ప్రకటించారు. కేవలం 146 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కలిగిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే మైనారిటీలో పడినా.. ఆ సర్కారు పడిపోకుండా చూస్తానంటూ చంద్రబాబు కచ్చితమైన హామీ ఇచ్చిన కారణంగానే మంత్రులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది.. 

రాష్ట్రంలో మంత్రుల రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. సీబీఐ తప్పుపట్టిన 26 జీవోల విషయంలో మొదటి నుంచీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవటంతో పరిస్థితి చినికిచినికి గాలివానలా మారి కాంగ్రెస్ మంత్రుల మెడకు చుట్టుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నడిపిస్తున్న హైడ్రామాలో రాష్ట్ర మంత్రులు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. 

ఆ 26 జీవోల జారీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని మంత్రులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ఖాతరు చేయకుండా పార్టీ అధిష్టానం తాజాగా తీసుకున్న వైఖరిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితారెడ్డిలను తప్పించాలన్న నిర్ణయాన్ని సహచర మంత్రులు, పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోపణలు వచ్చిన ఏడాదిన్నర కాలంగా పట్టించుకోని అధిష్టానం ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత మంత్రుల అంశంపై దృష్టి సారించటం పట్ల కాంగ్రెస్ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన సందర్భంలో హైదరాబాద్‌లో సీఎం కిరణ్‌ను కలిసిన ధర్మాన, సబితలు.. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాల్సిన దుస్థితిపై ఇతర మంత్రులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

ఆకస్మికం కాదు.. వ్యూహాత్మకమే..: 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీలు ఇద్దరూ కలిసి కేసులు వేసిన తర్వాత క్రమంలో.. ఒక్క జగన్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని చెప్తూ వచ్చిన పార్టీ నాయకత్వం ఇప్పుడా రాజకీయ వికృత క్రీడలో తమను బలిపశువులను చేస్తోందని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారం ఉన్నట్టుండి తెరమీదకు వచ్చిన అంశమేమీ కాదని.. హైకమాండ్ పెద్దలు చంద్రబాబుతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చినదేనని నిర్ధారణకు వచ్చారు. సీబీఐ ఆరోపణలు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా మంత్రులను తొలగించాలంటూ చంద్రబాబు హడావుడి చేయటం, గవర్నర్‌కు వినతిపత్రాలు ఇవ్వటం, ఢిల్లీ వరకూ వెళ్లి యాగీ చేయటం, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదులు చేయ టం, బాబు డిమాండ్లకు తలొగ్గినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరించటం, ఆ మంత్రులను తొలగించాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇవ్వటం.. ఇదంతా చంద్రబాబు - హైకమాండ్ ఒక పథకం ప్రకారం నడుపుతున్న హైడ్రామానేననేది స్పష్టంచేస్తోందని మండిపడుతున్నారు.

చంద్రబాబు సూచనల మేరకు నడుస్తున్న ఢిల్లీ పెద్దల ట్రాప్‌లో పడి తమ గొయ్యి తామే తవ్వుకున్నామని మంత్రులు వాపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, టీడీపీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరేమిటో ఆనాడే కౌంటర్ దాఖలు చేసి ఉంటే తమకు ఈ పరిస్థితి దాపురించేది కాదని ఇప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఆ 26 జీవోలపై ప్రభుత్వ వైఖరేమిటో కౌంటర్‌లో ఆ రోజే చెప్తే కేసు నుంచి జగన్ బయటపడతారనే కారణంగా ఆ రోజు కౌంటర్ వేయలేదని.. జగన్‌ను టార్గెట్ చేసే వ్యూహమని చెప్పి ఆనాడు తమ నోళ్లు మూయించారని, ఇప్పుడదే జగన్ కోసం తమను కూడా బలి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అప్పుడు రాజీనామా చేస్తే తొందరపడొద్దని..: 
అదీగాక.. సీబీఐ అభియోగాలు మోపినప్పుడే తాము రాజీనామా చేస్తే తొందరపడొద్దని చెప్పిన హైకమాండ్ పెద్దలు ఉన్నట్టుండి తమతో రాజీనామా చేయించటం వెనుక పెద్ద మతలబే ఉందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తరువాత ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలనే డిమాండ్ ఉధృతం చేశారని.. దానికి తగ్గట్టుగానే హైకమాండ్ పెద్దలు సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని ఆదేశించటం చూస్తుంటే చంద్రబాబు, హైకమాండ్ పెద్దలు పరస్పర సహకారంతోనే తమపై వేటు వేసినట్లు కనిపిస్తోందని మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం తమను కలిసిన మంత్రులతో వారు ఈ విషయం చెప్తూ తీవ్ర ఆవేదనకు లోనైనట్లు సహచర మంత్రులు తెలిపారు. ‘‘జగన్‌ను టార్గెట్ చేసి పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా సీబీఐ కేసును తెరపైకి తెస్తే ‘కాంగ్రెస్ పటిష్టమవుతుంది కదా!’ అని మేము సహకరించాం. అది ఎంత తప్పో ఇప్పుడు అర్ధమవుతోంది. మేం తీసుకున్న గోతిలో మేమే పడుతున్నట్లయింది.

మమ్మల్ని తప్పించటం వల్ల.. 
‘మా ఉద్యమం వల్లే మంత్రులను తొలగించార’ని చంద్రబాబు ప్రజల్లోకి వెళతారు. అవినీతిని ఉపేక్షించేది లేదని.. అందుకే మంత్రులను తప్పించామని హైకమాండ్ చెప్పుకునేందుకు సిద్ధమైంది. మధ్యలో మేమే బలిపశువులుగా మారిపోయాం. కాంగ్రెస్‌కు ఇన్నేళ్లు సేవ చేసినందుకు దక్కిన ప్రతిఫలం ఇదా?’’ అని వారు వాపోయినట్లు తెలిసింది. కర్ణాటకలో ఏదో జరిగిందని, దాన్ని ముందుపెట్టుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్, చంద్రబాబులు చెప్పుకోవటానికన్నట్లు ఈ మొత్తం కథ నడిపించారని వారు అంటున్నారు.

న్యాయ సహాయం ఎందుకు ఇచ్చినట్లు..?: 
అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ ఇద్దరూ కలిసి వేసిన కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని హైకోర్టు 52వ ప్రతివాదిగా చేర్చగా, ఒకటి నుంచి 15 వరకు ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్‌ను ఇరికించాలి కాబట్టి ఆ రోజు కేసులో ప్రతివాదిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని విషయాన్ని పలువురు మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కౌంటర్ దాఖలు చేసి.. ఆరోపణలు వచ్చిన ఆ 26 జీవోలపై ప్రభుత్వం వివరణ ఇచ్చి ఉంటే జగన్‌పై కేసు ఉండదని, ఆ కారణంగా హైకోర్టు రెండు సార్లు కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని వారు పేర్కొంటున్నారు. ఆ తర్వాత అవే జీవోలపై సంబంధిత మంత్రులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. 

అప్పటివరకు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. మంత్రులు, అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయటంతో వారందరి కేసులను సుప్రీంకోర్టులో వాదించటానికి అయ్యే ఖర్చు (న్యాయ సహాయం) ప్రభుత్వమే భరించాలని నిర్ణయించి దానిపై జీవోలను కూడా జారీ చేసింది. గతంలో ఇచ్చిన 26 జీవోలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగాయని, అవి కొత్తేమీ కాదనీ చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి కేటాయింపులు జరిగాయని తమ వాదనల్లో అంగీకరించారు. అయితే అదే విషయాన్ని బయట ఒప్పుకుంటే జగన్‌ను ఎందుకు జైలులో పెట్టారన్న ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి.. జగన్ కేసు విషయంలో ఎక్కడా ప్రభుత్వం స్పందించటం లేదని వివరించారు. 

కాంగ్రెస్‌తో కుమ్మక్కు: 
‘‘రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎదగటంతో టీడీపీ నాయకుడు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో తన సంబంధాలను మరింత పటిష్టపరుచుకున్నారు. ఆ క్రమంలోనే జగన్‌ను కేసుల్లో ఇరికించే ప్రణాళికలో అన్నింటా కుమ్మక్కయ్యారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోవటంతో పాటు తనపై ఉన్న కేసుల్లో దర్యాప్తు జరగకుండా కేంద్రం ముందు సాగిలపడి లోపాయికారి మద్దతు ప్రకటించటంతో రాష్ట్రంలో మూడో మనిషి కానీ, మూడో పార్టీ కానీ లేకుండా చేసే ఎత్తుగడలో ఇద్దరూ కలిసి రాజకీయ చదరంగం మొదలుపెట్టి రాష్ట్రంతో, కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారు’’ అని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు ధ్వజమెత్తారు.


మంత్రులు పోయినా ఢోకా లేదు...
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఒక్కొక్కరినీ తప్పించటం వల్ల ప్రభుత్వం పడిపోతుందని కొందరు పార్టీ నేతలు భావించినప్పటికీ.. హైకమాండ్ నాయకులు వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే ఆస్కారం కానీ అవకాశం కానీ ఏమాత్రం లేదని హైకమాండ్ నేతలు రాష్ట్ర నేతలకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. నిజానికి ప్రభుత్వానికి శాసనసభలో కేవలం 146 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండటంతో ఇప్పటికే మైనారిటీలో పడిపోయింది. ప్రభుత్వం కొనసాగాలంటే కనీసం 148 మంది సభ్యుల మద్దతుండాలి. ఇలాంటి సమయంలో పలువురు మంత్రులను తప్పిస్తే జరగరానిదేదైనా జరిగితే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏర్పడుతుందని కొందరు నేతలు చేసిన వాదనను హైకమాండ్ పెద్దలు కొట్టివేశారు. దానికి ప్రధాన కారణం చంద్రబాబేనని.. ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉంటామని ఆయన కచ్చితమైన హామీ ఇచ్చిన కారణంగానే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులపై వేటువేయటానికి సిద్ధపడిందని తెలుస్తోంది. 
Share this article :

0 comments: