ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తాం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తాం

Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013

అధికారంలోకి రాగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తాం: విజయమ్మ
తెలంగాణ వరప్రదాయిని అయిన ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యం
వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టును పట్టించుకునే వారే లేరుబాబు అండతోనే ప్రభుత్వం ప్రజలపై కోట్ల భారం మోపుతోంది
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ మాయాకూటమిగా ఏర్పడినా దీటుగా ఎదుర్కొంటాం
ప్రాణహిత నదిలో పడవలో ప్రయాణించిన విజయమ్మ


 తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ మానసపుత్రిక అయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉద్ఘాటించారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రాణహిత-చేవెళ్లను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును విజయమ్మ సందర్శించారు. హైదరాబాద్ నుంచి రైలు ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకున్న ఆమె రోడ్డుమార్గంలో ప్రాణహిత నది వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... నాడు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్ వేసిన శిలాఫలకానికి క్షీరాభిషేకం చేశారు. 

అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పడవలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కాసేపు ప్రాణహిత నదిలో ప్రయాణించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘‘నేను ప్రాణహితకు వెళ్తున్నానని చెప్పినప్పుడు జగన్ బాబు మీకు కొన్ని విషయాలు చెప్పమన్నారు. అమ్మా... ఆ ప్రాజెక్టు నాన్న మానసపుత్రిక.. నాన్న కలల ప్రాజెక్టు.. ప్రజలకు నా మాటగా చెప్పమ్మా.. తప్పకుండా మనకు ప్రజలు అధికారం ఇస్తారు. ఏడు జిల్లాల రైతుల ఆశలు నెరవేర్చేందుకు ప్రాణహిత-చేవెళ్లను తప్పక పూర్తి చేద్దాం అని చెప్పమన్నాడు..’’ అని చెప్పారు. తర్వాత అక్కడ్నుంచి బయల్దేరిన విజయమ్మ కాగజ్‌నగర్ ఎస్పీఎం క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకున్నారు. 

అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. చంద్రబాబు అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై రూ.వేల కోట్ల భారం మోపుతోందని మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవిశ్వాసం సమయంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ విప్ జారీ చేసి మరీ.. ప్రభుత్వాన్ని కాపాడిందని, ఈ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పారు.

కాంగ్రెస్-టీడీపీ మాయా కూటమిని ఎదుర్కొంటాం..
‘‘ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన చంద్రబాబు అది కూడా చేయయకుండా.. విపక్షాలు పెడితే వారి పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు 2014 ఎన్నికల్లో వీరు ఈ కుమ్మక్కు రాజకీయాలను ఇంకా కొనసాగిస్తారు. అధికార కాంగ్రెస్, టీడీపీ కలిసి మాయకూటమిగా ఏర్పడినావైఎస్సార్‌సీపీ దీటుగా ఎదుర్కొంటుంది..’’ అని విజయమ్మ స్పష్టం చేశారు. పాదయాత్ర చేసి చంద్రబాబు ఏదైనా సాధించారంటే అది... తెలుగు-కాంగ్రెస్ పార్టీ నేతగా మారడం, అధికార కాంగ్రెస్‌కు టీడీపీని తోకపార్టీగా మార్చడం తప్ప మరొకటి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో అవినీతి రాజ్యమేలిందని, దేశంలో అత్యంత అవినీతి నాయకుడు చంద్రబాబేనని ‘తెహెల్కా డాట్ కామ్’ 2002లోనే తేల్చిందన్నారు. చంద్రబాబు హయాంలో రోజుకో కుంభకోణం వెలుగు చూసినా.. బాబు వాటిపై కనీసం విచారణ కూడా జరిపించలేదన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

వైఎస్ హయాంలో ఒక్క పైసా భారం మోపలేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా పన్నులు, చార్జీలు వేస్తూ మోయలేని భారం మోపుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు, పన్నుల భారం పడకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి ఆయన మరణించే వరకు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. సీఎంగా ప్రమాణం చేయగానే రూ.1,300 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేసే ఫైల్‌పై సంతకం చేసి ప్రజానేత అనిపించుకున్నారన్నారు. వైఎస్ హయాంలో విద్యుత్, ఆర్టీసీ, నీటి, ఆస్తి పన్నులు పెరగలేదని, మరో ఐదేళ్ల వరకు పెంచబోమని వైఎస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ రాష్ట్రంలో ఇప్పుడు పన్నులు, చార్జీల భారంతో ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారన్నారు. పల్లెల్లో కరెంటు ఎప్పుడుంటుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, కోతలతో పరిశ్రమలు మూతపడి.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్ పేరిట గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం.. ఆ వర్గాల కోసం చేసిందేమిటని నిలదీశారు. వైఎస్ హయాంలో గిరిజనులకు అటవీహక్కుల చట్టం కింద 23 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావే శంలో మాజీ మంత్రి కొండా సురేఖ, పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, కేంద్రపాలక మండలి సభ్యులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్, పార్టీ నేతలు పుట్ట మధు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, తులా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాజిరెడ్డికి అస్వస్థత..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అస్వస్థతకు గురయ్యారు. విజయమ్మ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో సోమవారం ఉదయం కాగజ్‌నగర్‌కు చేరుకున్న ఆయన సాయంత్రం వరకు పార్టీ నాయకులతో పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీంతో ఎండ వేడిమి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో విజయమ్మకు స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ వెళ్లారు.

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కోనప్ప
కాంగ్రెస్ సీనియర్ నేత, సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయమ్మ సమక్షంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి విజయమ్మ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించేది లేదన్నారు.
Share this article :

0 comments: