కాంగ్రెస్‌లో బాబు హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌లో బాబు హవా

కాంగ్రెస్‌లో బాబు హవా

Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013

ఆయన మాటలనే కాంగ్రెస్, పంజరంలోని చిలుకలు వల్లిస్తున్నాయి : శోభానాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు హవా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఏది కోరితే అది జరుగుతోందని, ఆయన నోటి నుంచి వచ్చే మాట లే కొందరు కాంగ్రెస్ నేతలు వల్లిస్తున్నారని, వాటినే పంజరంలో చిలుకలా ఉన్న సీబీఐ, ఈడీ కూడా చెబుతున్నాయని తెలిపారు. జగన్ ఆస్తులు అటాచ్ చేయాలని కేంద్ర మంత్రి చిదంబరాన్ని చంద్రబాబు కోరగానే గంటల వ్యవధిలో ఈడీ అటాచ్ చేయడం, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయగానే చేయించడం.. ఇలా ప్రతి ఒక్కటీ ఆయన కోరగానే జరుగుతున్నాయని వివరించారు. సీఎం కిరణ్‌ను మార్చాలని బాబు డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అదే చేసేలా ఉందన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రులు ధర్మాన, సబిత ఆకస్మిక రాజీనామాల వెనక మతలబేమిటో సీఎం బయటపెట్టాలని, వైఎస్ హయాంలో వెలువడిన 26 జీవోలు బిజినెస్ రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కుమ్మక్కు వల్లే మంత్రులు బలి
రాష్ట్రంలో మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న చంద్రబాబు ఒత్తిడి మేరకే మంత్రులను బలి చేస్తున్నారని శోభ చెప్పారు. ‘‘మంత్రి ధర్మానపై సీబీఐ ఆరు నెలల కిందటే చార్జిషీట్ వేసినప్పుడు రాజీనామా చేస్తే ఆమోదించకుండా, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాగానే డ్రామా మొదలుపెట్టి, ఆ వెంటనే హడావుడిగా వారి చేత సీఎం రాజీనామాలు చేయించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కేబినెట్ సమష్టి నిర్ణయాల మేరకే జీవోలు వెలువడ్డాయని, జీవోల విడుదలలో వైఎస్ ఎలాంటి ఒత్తిడి తేలేదని ధర్మాన, సబితలే స్పష్టంగా చెబుతుంటే.., ఏడాదిగా జగన్‌ను జైల్లో ఎందుకు నిర్బంధించారో కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. జీవోల విడుదలలో మంత్రులు తప్పు చేయలేదని, వారికి న్యాయ సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం.. అకస్మాత్తుగా ‘యూ టర్న్’ తీసుకొని వారి రాజీనామాలు కోరడం విచిత్రంగా ఉంది. చంద్రబాబును మచ్చిక చేసుకోవడం కోసం ఆయనతో కుమ్మక్కైన కారణంగానే మంత్రులను బలిచేస్తున్నట్లుంది. బాబును బుజ్జగించేందుకు కాంగ్రెస్ సొంత నేతలనే బలిచేసే స్థాయికి దిగజారింది’’ అని అన్నారు.

బాబుది రెండు నాలుకల ధోరణి: చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ఆమె చెప్పారు. ‘‘చంద్రబాబు హయాంలో ఏలేరు ఆధునీకరణపై ఆరోపణలు వెలువడితే, అది కేబినెట్ నిర్ణయమని, సీఎంగా తానొక్కడినే తీసుకోలేదంటూ తప్పించుకున్నారు. అలాంటి బాబు ప్రస్తుతం 26 జీవోలకు వక్రభాష్యం చెబుతున్నారు. బొగ్గు స్కాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆరోపణలు వస్తే.. ప్రధాని రాజీనామా చేయాలని బాబు ఒక్కసారైనా డిమాండ్ చేశారా? సీబీఐ పంజరంలో చిలుకలా మారిందని దేశంలోని అన్ని పార్టీలు విమర్శిస్తుంటే, చంద్రబాబు మౌనం దాల్చారు. ఇలాంటి చంద్రబాబు ఆయనకు ఆయనే అన్నాహజారేతో పోల్చుకోవడం సిగ్గుచేటు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై దాడులతో భయకంపితులను చేసిన సీబీఐ, చంద్రబాబు విషయంలో ఐఎంజీ కేసు విచారించడానికి సిబ్బంది లేరని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నీతిమంతుడు అనుకుంటే ఐఎంజీకి భూకేటాయింపులపై విచారణకు సిద్ధపడాలి’’ అన్నారు. ఎన్నో సహకార సంఘాలను, దాదాపు 49 ప్రభుత్వ స్పిన్నింగ్, చక్కెర సంస్థలను చంద్రబాబు ఆయన అనుచరులకు పంచిపెట్టిన విషయాన్ని ఆమె ఒక్కొక్కటిగా వివరించారు.

కేశవ్‌వి దివాలాకోరు వ్యాఖ్యలు: వైఎస్సార్ కాంగ్రెస్‌లో నాయకులు లేరని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని శోభ మండిపడ్డారు. చంద్రబాబు అంతటి సమర్థవంతమైన నాయకుడు అవటంవల్లే ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఆ పార్టీని వదిలి వెళ్లారని ఎద్దేవా చేశారు. జగన్ నిజమైన నాయకుడు కావడంవల్లే ఆయన జైల్లో ఉన్నా అందరూ బలపరుస్తున్నారని, టీడీపీ నుంచే పది మంది ఎమ్మెల్యేలు చేరారని చెప్పారు. ఇప్పటికైనా తమ పార్టీ అధినేత జగన్ టికెట్లు హామీ ఇస్తే టీడీపీ సగం ఖాళీ అవుతుందని చెప్పారు.
Share this article :

0 comments: