వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?

వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?

Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013


* కిరణ్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్న
* వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?
* బాబు ఏ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చారో.. వైఎస్ అలాగే చేశారు
* సీబీఐ మాత్రం కొంతమందినే లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది
* బాబు పాలనలాగే.. కిరణ్ పాలనలోనూ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు
* పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే

సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు ఇస్తే అవి ‘క్విడ్ ప్రో కో’ కిందకు రావా? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు మాత్రమే ‘క్విడ్ ప్రో కో’ అవుతాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆమె అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏ మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారో.. వైఎస్ కూడా అదే పద్ధతిలో రాయితీలిచ్చారు. ఇప్పుడు కిరణ్ అదే విధానంలో ఇస్తున్నారు. కానీ సీబీఐ కొంత మందినే లక్ష్యంగా చేసుకుని వారిని వేధింపులకు గురిచేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుజుకు ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు?
‘ఇసుజు’ కార్ల కంపెనీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు అని విజయమ్మ నిలదీశారు. ‘‘సాధారణంగా 50 శాతం వరకూ వ్యాట్ రాయితీలు ఇవ్వవచ్చు. అలాంటిది 135 శాతం రాయితీలు ఎలా ఇచ్చారు? రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీకి రూ.2,025 కోట్ల రాయితీలు ఇస్తున్నారు. చంద్రబాబు, కిరణ్ ఏమిచ్చినా నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లా? వైఎస్ ఏమిచ్చినా ‘క్విడ్ ప్రో కో’ అవుతుందా?’’ అని విజయమ్మ ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో పేరిట సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ వేధిస్తూ.. ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలా పెట్టుబడులు పెట్టినవారిని వేధిస్తూ విద్యుత్ కూడా సరిగా ఇవ్వని నేపథ్యంలో ఏ పారిశ్రామికవేత్తయినా రాష్ట్రానికి ఎందుకు వస్తారు? ఎలా పెట్టుబడులు పెడతారు? అని ప్రశ్నించారు. ‘‘భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ముఖ్యమంత్రి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయన్నారు. కనీసం రూ. 65 కోట్ల విలువ చేసే పరిశ్రమ అయినా వచ్చిందా? 35 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు?’’ అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హాలిడే ప్రకటించి.. ప్రజలను గాలికొదిలేసి... కేవలం వైఎస్‌ను విమర్శించడానికి, వైఎస్ కుటుంబాన్ని వేధించడానికే సమయం వెచ్చిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు..
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏరోజూ కార్మికులను, పేదోళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఏం చేయమంటే అది చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి, ప్రభుత్వ ఉద్యోగాలను ఊడబీకేయడానికి కృషి చేశారు. రాష్ట్రంలో 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు.

విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వేల కోట్లు దోచిపెట్టారు. మొన్నటికి మొన్న చిల్లర వర్తక రంగంలో విదేశీ పెట్టుబడుల బిల్లుపై ఓటింగ్‌కు తన పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించి.. ఆ బిల్లు ఆమోదం పొందేలా చేశారు’’ అని దుయ్యబట్టారు. ఆర్టీసీ వంటి సంస్థలను ప్రైవేటీకరించాలని బాబు ప్రయత్నిస్తే ప్రతిపక్ష నేతగా అందరితో కలిసి వైఎస్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేపట్టిన వైఎస్ పాలనను జగన్ నేతృత్వంలో తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

ఘనంగా మేడే: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో భాగంగా విజయమ్మ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన సభలో కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మే డే ఉత్సవం అనంతరం విజయమ్మ సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: