పిల్లల నిబ్బరం చూస్తే గర్వంగా ఉంటుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిల్లల నిబ్బరం చూస్తే గర్వంగా ఉంటుంది

పిల్లల నిబ్బరం చూస్తే గర్వంగా ఉంటుంది

Written By news on Sunday, May 12, 2013 | 5/12/2013

‘‘బాబుని చూడబుద్ధి అవుతోందమ్మా...’’
జగన్‌ని చూడాలనుకున్నప్పుడు విజయమ్మ తన కోడలితో అనేమాట!
వెళ్తారు, చూస్తారు. కానీ ఎక్కువసేపు మాట్లాడలేరు.
మాట్లాడితే ఎక్కడ కన్నీళ్లు ఉబికి వస్తాయోనని ఆమె భయం!
తల్లి హృదయం కదా...
ఎంత దిగమింగుకున్నా దుఃఖం ఆగుతుందా?
జగన్ ఆ విషయం గమనిస్తారు.
తల్లి తలను నిమిరి ధైర్యం చెబుతారు.
ఏడాదిగా ఆ... ధైర్యమే విజయమ్మను ముందుకు నడిపిస్తుంటే...
అన్నమీద ఉన్న అపారమైన ప్రేమ షర్మిలను ప్రజల వద్దకు, ప్రజల్లోకి నడిపిస్తోంది.
‘మదర్స్ డే’ సందర్భంగా...
ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమి విజయమ్మను కలిసినప్పుడు...
తల్లిగా ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
జగన్, షర్మిలల గురించి ఎన్నో విషయాలనుఎంతో ఉద్విగ్నంగా మాట్లాడారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...


పిల్లల బాల్యం నుంచి చెప్పాలంటే... పులివెందులలో మంచి కాన్వెంట్స్ లేవని జగన్‌ని కొడెకైనాల్ బోర్డింగ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్‌లో చేర్చాం. అయితే, ఆ తర్వాతి సంవత్సరమే మేం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడంతో, జగన్‌ని మా దగ్గరికి తెచ్చుకుని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చాం.

నేను పెద్దగా చదువుకోకపోవడంతో, పిల్లల్ని బాగా చదివించాలని కలలు కనేదాన్ని... గాంధీ, నెహ్రూ చదివిన స్కూళ్ల లాంటి స్కూళ్లలో చదివించాలని..! ముఖ్యంగా జగన్ విషయంలో అలాంటి కలలు బాగా ఉండేవి. జగన్ తెలివైనవాడే కానీ ఎక్కువసేపు చదివేవాడు కాదు. అల్లరి బాగా చేసేవాడు. అయితే నేను చదువు విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండేదాన్ని. రెండో క్లాస్ నుంచే ట్యూషన్లకుపంపేదాన్ని. అక్కడినుంచి వచ్చేసరికి తనకి రాత్రి ఎనిమిది అయ్యేది. ‘10 గంటల వరకు చదివాకే పడుకోవాలి’ లాంటి రూల్స్ కూడా పెట్టేదాన్ని. మళ్లీ పొద్దున ఐదింటికే లేపేసేదాన్ని. ఆదివారం వస్తే, ఆ వారంలో చదివిందంతా అప్పచెపితేగానీ సినిమాలకు పంపేదాన్ని కాదు.

జగన్‌కి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ఒకటి రెండుసార్లు చదివితే వచ్చేసేది. అయితే, ఏదీ తనకై తను చదవడం ఇష్టం ఉండేది కాదు. నేను చదివి వినిపిస్తే, నా ఒళ్లో పడుకుని వింటూ నేర్చుకోవడం ఇష్టపడేవాడు... అది స్కూల్ పుస్తకాలైనా, కథల పుస్తకాలైనా! రోజూ రాత్రి పడుకునే ముందు నాచేత రాజుల కథల పుస్తకాలు చదివించుకునేవాడు. అవి వినందే నిద్రపోయేవాడు కాదు. తను చిన్నప్పుడు అల్లరివాడైనా, వయసు పెరుగుతున్నకొద్దీ వాళ్ల నాన్న ప్రభావం తన మీద పడడంతో చాలా పద్ధతిగా తయారయ్యాడు. యువకుడిగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ పార్టీలకు, పబ్‌లకు వెళ్లడం గానీ, సిగరెట్లు, మందు ఇతరత్రా చెడు అలవాట్లను గానీ దరిదాపులకు రానీయలేదు.

******** 

జగన్‌ని కొడెకైనాల్‌లో చేర్చిన కొద్దిరోజులకు షర్మిని మద్రాస్‌లో బోర్డింగ్ స్కూల్‌లో చేర్చాం. తనని అక్కడ ఆరోక్లాసు దాకా చదివించాక మా దగ్గరికి తెచ్చేసుకున్నాం.

జగన్‌బాబు నాకు ఎక్కువ దగ్గరగా ఉండేవాడు కానీ, పాపకి మాత్రం చిన్నప్పటినుంచీ వాళ్ల నాన్నే ప్రపంచం. ఆయన కూడా ఎప్పుడూ షర్మిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవారు! తను ఎప్పుడు ఏది అడిగినా కాదనే వారు కాదు. తన మీద ఉన్న అభిమానాన్ని పబ్లిక్‌గా చూపడానికి కూడా ఏమాత్రం వెనకాడేవారు కాదు. ఎవ్వరున్నా లెక్కచేయకుండా, కూతురుతో లెక్కపెట్టి మరీ రోజూ వంద ముద్దులు పెట్టించుకునేవారు! చుట్టూ ఎంతమంది ఉన్నా ఎప్పుడూ వాళ్ల నాన్నే కావాలనేది. ఏ చిన్న కష్టమొచ్చినా, ముందు ‘పా’ అనేదే కానీ ‘అమ్మా’ అనేది కాదు!

********

నేను ఆడపిల్ల, మగపిల్లవాడు అని తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా పెంచాను కానీ, వాళ్ల నాన్న మాత్రం కొంచెం తేడా చూపించేవారు. మగపిల్లాడికి ప్రపంచం తెలియాలి, ఎక్స్‌పోజర్ ఉండాలి, ప్రాక్టికల్‌గా పెరగాలని జగన్‌ని ఇంటర్ నుంచే మైన్‌‌సకి వాటికీ తీసుకెళ్లేవారు. ఎప్పుడు అవకాశం వచ్చినా నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించేవారు. బాగా గుర్తు పిల్లలతో ఎప్పుడూ అనేవారు... ఒక మనిషి ముందు తనకు తాను స్వయంసమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత తన ఫ్యామిలీని, వాళ్ల అవసరాలను చూసుకోగలగాలి. మెల్లమెల్లగా ఆ పరిధిని పెంచుకుంటూ బంధుమిత్రులు... గ్రామం... తాలూకా... జిల్లా... రాష్ట్రం... దేశం... అలా అందరికీ ఉపయోగపడే స్థితికి ఎదగాలి - అని! అంతేకాదు ‘కేవలం మనకోసం మనం బతకడం కాదు, అవతలివాళ్లకోసం కూడా బతకాలి. వాళ్ల జీవితాల్లో కూడా ఏదో ఒక మార్పు తేగలగాలి. అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది’ అని! ఆ మాటలు వినీవినో, వాళ్ల నాన్న నడవడికను చూసీచూసో తెలీదు కానీ, జగన్‌కు చిన్నప్పటినుంచీ ప్రజలతో ఉండాలని, ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజాసేవలోనే ఉండిపోవాలని ఉండేది. కానీ, నాకు మాత్రం తను రాజకీయాల వైపు ఆలోచించడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే... రాజకీయాల్లో ఉన్న మనిషికి సుఖం ఉండదని నాకు తెలుసు. అందుకే ఆ విషయంలో తనని నిరుత్సాహపరచడానికి ఎంతో ప్రయత్నించాను. ‘సన్నీ, నీకు ఎందుకొచ్చిందీ రాజకీయాలు. మీ నాయన్ను చూస్తున్నావు కదా, మనతో ఎంత గడపగలుగుతున్నారో. నీ జీవితాన్ని కూడా ఎందుకలా చేసుకోవడం. బాగా చదువుకుని, బిజినెస్ చేసుకుని హ్యాపీగా ఉండు’ అని!

కానీ జగన్‌కి మాత్రం రాజకీయాల్లో ఉండాలని, ప్రజల మధ్య ఉంటూ వాళ్లకు సేవ చేయాలని, అందరి మన్ననలు పొందాలని బాగా ఉండేది. అది నిశితంగా గమనించిన ఈయన, మెల్లమెల్లగా ఆ దిశగానే ప్రోత్సహించడం మొదలెట్టారు. అంతేకాదు, అప్పటినుంచి జగన్‌తో రాజకీయాల గురించి, నిబద్ధత గురించి, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడి తగ్గట్టుగా మలిచారు. ‘రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం కలిగి ఉండాలి... అన్నీ పోగొట్టుకున్నా మాటిచ్చినదానికి నిలబడగలగాలి... మనల్ని నమ్ముకున్న వాళ్లకి తోడుగా ఉండగలగాలి... అప్పుడే నీకు వాళ్లు తోడుగా వుంటారు’ అని చాలాసార్లు చెప్పడం విన్నాను!

******** 

జగన్ మీడియాలోకి ప్రవేశించాక ఈయన తనకున్న ఆలోచనలన్నీ జగన్‌తో ఎక్కువ పంచుకోవడం మొదలెట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల నుంచీ ఆంధ్రప్రదేశ్‌ని హరితాంధ్రప్రదేశ్‌ని చేసేవరకు... అన్ని విషయాలపై ఇద్దరూ కూలంకషంగా చర్చించేవారు. ఆ క్రమంలో ఈయన జగన్‌కున్న దీక్షని, ఆలోచనాసరళిని గమనించేవారు. విషయాన్ని వెంటనే అర్థం చేసుకోవడమే కాకుండా కార్యరూపంలో కలిగే కష్టాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి జగన్ సూచించే తీరును చూసి మెచ్చుకునేవారు. తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్ర ప్రజల ఉన్నతి గురించి అలా మాట్లాడుకుంటుంటే సంతోషమేసేది. ఈయన విజ్ఞత, జగన్ ఉత్సాహం చూసి ముచ్చటపడేదాన్ని!

******** 

మొదటినుంచి షర్మికి రాజకీయాల గురించి పెద్దగా ఆసక్తి లేదు. అందుకే వాటి గురించి ఈయన ఆమె ముందు ఎక్కువ మాట్లాడేవారు కాదు. అంతేకాదు, అవి మాట్లాడుతున్నప్పుడు షర్మి అటుపక్కకి వస్తే కూడా ‘పాప వచ్చేసింది... ప్యాకప్, ప్యాకప్...’ అని వెంటనే వాళ్లని పంపించేసేవారు. ఆమధ్యకాలం మాత్రం... తండ్రీకొడుకులు ఎప్పుడైనా రాజకీయాలు, బిజినెస్‌లు మాట్లాడుతున్నప్పుడు షర్మికి బోర్ కొట్టి పక్కకి వెళ్లబోతుంటే, తనని పిలిచి మరీ చెప్పేవారు ఈయన - ‘రాజకీయాల గురించి అస్సలు పట్టదంటే ఎట్లా పాప్స్? అది కూడా మనకి జీవితంలో ఒక భాగం! నువ్వు కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలి’ అని!

******** 

ఈయన సిఎం అయ్యాక లైఫ్ చాలా బిజీ అయినా, 35 ఏళ్ల మా వైవాహిక జీవితంలో ఫ్యామిలీ కోసం మునుపెన్నడూ కేటాయించనంత టైం కేటాయించారు. మేము, పిల్లలు, మనవడు, మనవరాళ్లు అందరం కలిసి ‘పర్ఫెక్ట్ 10’ అని ఎంతో మురిసిపోతున్న సమయంలో జరగకూడని ఘోరం జరిగి పోయింది! మా జీవితాల్లో పెద్ద అగాధం చోటుచేసుకుంది!
‘ఆయనకన్నా ముందు పోవాలని నిత్యం ప్రార్థనలు చేసిన నన్ను, కనీసం ఆయనతోపాటైనా ఎందుకు తీసుకుపోలేదు ఆ దేవుడు?’ అని ఎన్నోసార్లు కన్నీటిపర్యంతమయ్యాను. ఆ సమయంలోనే ఓసారి షర్మి నాతో అన్న మాటలు బాగా గుర్తున్నాయి -
‘నాన్న ఎప్పుడూ మనతోనే ఉండాలనుకోవడం స్వార్థమవుతుందమ్మా. దేవుడు ఆయన్ని ఒక ఆశయంతో ఇక్కడికి పంపించాడు... అది అయిపోగానే తీసుకుపోయాడు. రేపు మనమూ అంతే! ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అమ్మా’ అంది. ఆ మాటలు వినగానే నాకు, షర్మి ఉన్నట్టుండి ఎంతో ఎదిగినట్టు అనిపించింది. ఒకప్పుడు వాళ్ళ నాన్న నడిపిస్తే గానీ నడవలేని తను, ఆయన పోయిన తర్వాత నాకే ఒక తల్లిలా అయిందనిపించింది.

******** 

ఇక జగన్ గురించి చెప్పాలంటే... ఈయన పోయిన మొదట పది రోజులూ ఎవ్వరితోనూ అవసరానికి మించి మాట్లాడలేదు. అందరిలోకీ నాతోనే కాస్త మాట్లాడేవాడు. మామూలుగా పైకి పెద్దగా ఎమోషన్స్ చూపించని తను, ఆ నెలరోజులపాటు వీలున్నప్పుడల్లా నా పక్కన ఉంటూ, నా చెయ్యి పట్టుకుని, నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. బయట జనాలు తనను చూడడానికి అంత పోటెత్తుతున్నా, నేను తిన్నానా, లేదా అని కనుక్కోవడం, తనకు తినాలని ఉన్నా లేకపోయినా కేవలం నాకోసం భోజనానికి లోపలికి రావడం లాంటివి చేసేవాడు. తను ఏడిస్తే నేనింకా బాధపడతాననుకునేవాడో ఏమో, లోపల కొండంత దుఃఖమున్నా, మొదటిరోజు తప్ప, తర్వాత బయటికి ఒక కన్నీటి చుక్క కూడా రానీయలేదు. తండ్రిలో ఒక గొప్ప స్నేహితుడ్ని చూసుకుంటున్న తనకి, కష్టాలను, బాధలను పంచుకోవడానికి ఎవరూ లేకుండాపోయారు. ఒకప్పుడు ప్రతి విషయంలో వాళ్ళ నాన్న సలహా తీసుకునే తను, ఇప్పుడు ముందూవెనకా, మంచీచెడూ అన్నీ తనే ఆలోచించుకోవాల్సి వస్తోందని చాలా బాధపడ్డాను. తను ఓదార్పు పొందాల్సిన టైంలో, తనే లక్షలాదిమందిని ఎంతో నిబ్బరంతో, స్థైర్యంతో ఓదార్చడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. పరిస్థితులకు అనుగుణంగా... వయసుకు మించిన భారాన్ని, అనుభవానికి మించిన బాధ్యతను... ఎంతో హుందాగా ఎదుర్కొన్నాడనిపించింది.

మామ చనిపోయినప్పుడు ఈయన కూడా చాలా కష్టపడ్డారు. కానీ, అప్పటికే ఈయన చాలా జీవితాన్ని చూశారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిని, వాటిని తట్టుకోగలిగిన స్థితికి వచ్చారు. 20-30 ఏళ్ల పోరాటం కాబట్టేమో, నాకు ఈయన విషయంలో ఏరోజూ పెద్దగా బాధ అనిపించలేదు కానీ, జగన్ విషయంలో మాత్రం చాలా బాధనిపించింది.

కానీ, అంత బాధలోనూ ఒకటి మాత్రం అనిపించింది ... ఈయన ముప్పై ఏళ్లు కష్టపడి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకెళ్లారు. వాళ్ల జీవితాల్లో వెలుగును నింపి, వాళ్ల గుండెల్లో దీపాన్ని వెలిగించి వెళ్లారు. అన్నేళ్ల కష్టం వృథా కాదు... ఆ దీపం అంత తేలిగ్గానూ ఆరిపోదని!

******** 

జనంలో వాళ్ల నాన్న పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను చూశాక, వాళ్లందరి గుండెల్లో ఈయన ఇంతగా జీవించి ఉన్నారని తెలిశాక, ఈయన సంపాదించుకున్న మంచిని నిలబెట్టాలని, ప్రజలు తనని కూడా వాళ్ల నాన్నలా ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, ప్రజల హృదయాల్లో తను కూడా చిరకాలం ఉండిపోవాలని, ప్రజలకోసమే తన జీవితం అంకితం చేయాలని అనుకున్నాడు జగన్! అంతేకాదు, తనని ఓదార్చడానికి వచ్చిన వేలాది మంది ప్రజలను చూసి జగన్ కదిలిపోయాడు. మొదటిసారి జగన్‌కి ఓదార్పు చేయాలన్న ఆలోచన వచ్చింది కూడా వాళ్ల మూలంగానే! ‘నన్ను ఓదార్చడానికి ఇంతమంది జనం కదలివచ్చారు... నేను కూడా నాన్నకోసం చనిపోయిన వాళ్ల కుటుంబాల దగ్గరకు వెళ్లి, వాళ్లను ఓదార్చి, వాళ్లకు బాసటగా నిలవాలి. అది నా బాధ్యత’ అనుకున్నాడు. షర్మి కూడా వాళ్ల అన్నతో ‘అన్నా, మనం ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నాన్నను పోగొట్టుకున్నందుకు ఇంత బాధపడుతుంటే, బీదవాళ్లు తమ కుటుంబంలోని ఆధారాన్ని పోగొట్టుకున్నందుకు ఇంకెంత బాధపడుతూ ఉండిఉంటారు. నువ్వు తప్పకుండా వెళ్లి వాళ్లను పరామర్శించి, చేతనైనంత సాయం చేయాలన్నా’ అంది. అందుకే, ఈయన పోయిన 10 రోజుల తర్వాత జగన్ పావురాలగుట్టలో పెట్టిన సంతాపసభలో, లక్షలాదిమంది అభిమానుల నడుమ, ‘నాన్న నాకింత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. నేను ఒంటరిని కాదు. మీరూ ఒంటరి కాదు. నాకు మీరు, మీకు నేను తోడుంటా. నాన్నకోసం చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరకు పోయి పరామర్శిస్తా... మహానేత కొడుకుగా ఇది నా బాధ్యత’ అని చెప్పాడు.

ఆ పరామర్శకి నాక్కూడా వెళ్లాలనిపించినా, ఎందుకనో ధైర్యం చేయలేకపోయాను. నేనే కుదుటపడలేదు... అలాంటి పరిస్థితుల్లో అక్కడికెళ్లి, నేను ఏడ్చి, వాళ్ళను ఏడిపించడం ఎందుకని, జగన్ ఒక్కడినే వెళ్లమన్నాను. అయితే, తను ఓదార్పు తలపెట్టాక రకరకాల అవరోధాలు వచ్చాయి. హైకమాండ్ పర్మిషన్ అనీ, తెలంగాణ ఉద్యమమని, వరదలనీ... యాత్ర కొంతకాలం వాయిదా పడింది. ఆ తర్వాత అధిష్ఠానం ఢిల్లీకి పిలిచి మరీ యాత్ర ఆపేయమని వారించింది.

ఆ టైంలో చాలామంది పార్టీ నాయకులు, బంధువులు ఓదార్పు యాత్రను రద్దు చేసుకోమని, లేకపోతే అది తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తుందని జగన్‌ను వెనక్కి లాగడానికి ప్రయత్నించారు. ఆ టైంలో జగన్ నాతో అన్న మాటలు ఈరోజుకీ గుర్తున్నాయి - ‘అమ్మా, మన ముందర రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి - ఇచ్చిన మాటను గాలికి వదిలేసి, విలువలను - విశ్వసనీయతను రెండిటినీ చంపుకుని, వాళ్లు ఇచ్చే మంత్రిపదవితో సంతోషపడడం... లేదా - చాలామంది భయపెడుతున్నట్టుగా వాళ్ల నుంచి ఎన్నో వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం! అమ్మా! నేను రెండవ మార్గంలో నడవడానికే సిద్ధపడుతున్నాను... ఎందుకంటే అదే సరైన మార్గమని నా విశ్వాసం. నాకీ పదవులు ముఖ్యంకాదు... ఒక్కసారి వస్తానని ప్రజలకు మాటిచ్చాక వెళ్లకపోతే తప్పవుతుంది. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అసలు నేను రాజశేఖరరెడ్డి కొడుకును ఎలా అవుతాను? నాన్న అన్నట్టుగా ఎన్నాళ్లు బతికామన్నది కాదమ్మా... ఎలా బతికామన్నది ముఖ్యం’ అని! ఆ మాటలు వినగానే నేను ఇటువంటి కొడుకు ఉన్నందుకు చాలా గర్వపడ్డాను! అలా... పరిస్థితులు అనుకూలించకపోయినా, ఎందరు సహకరించకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరు అడ్డొచ్చినా, ఒంటరిగానైనా సరే యాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు జగన్.

పావురాలగుట్టలో ఇచ్చిన వాగ్దానం, ఆ తర్వాత సాగిన ఓదార్పు యాత్ర, జగన్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఎవ్వరూ ఊహించని విధంగా వాళ్ల నాన్న లాగా ప్రజలు జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. ఊళ్లకు ఊళ్లు కదిలి జగన్ మీద ప్రేమానురాగాలు కురిపించాయి. ఈయన మీద ఉన్న ప్రేమ, ఆత్మీయత జగన్ మీద చూపించడం, వాళ్లు జగన్‌ను తమ కుటుంబ సభ్యునిగా భావించడం నిజంగా జగన్ అదృష్టం. మొదటిసారి యాత్ర నుంచి తిరిగి రాగానే జగన్ నాతో - ‘ప్రజలు నాన్నను మరచిపోలేదమ్మా! ఆయన చేసిన కార్యక్రమాల వల్ల వాళ్లు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. కేవలం ఆయన కొడుకుగానే నేను వాళ్లకు తెలుసు... అయినా నా మీద ఎంత అభిమానం చూపించారో! వాళ్లు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూసి కొన్ని సందర్భాల్లో నాకు నోటినుంచి మాట కూడా రాలేదు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అది చూసి నాకు అనిపించింది... నేనేమి చేశానని వాళ్లు నా మీద అంత ప్రేమ చూపుతున్నారు? కేవలం నాన్న మీద ఉన్న అభిమానంతోనే కదా నన్ను ఆదరించారు. ఆ ప్రేమను పెంపొందించడం, వాళ్లను కాపాడుకోవటం నాన్న మనకు అప్పగించిన గొప్ప బాధ్యత! అలా చేస్తేనే వాళ్ల రుణం మనం తీర్చుకోగలం!’ అని అన్నాడు.

ఆ యాత్రంతా జగన్ పగలనకా, రాత్రనకా కష్టపడ్డాడు. ప్రతిసారీ తిండి, నిద్రలేక మొహం పీక్కుపోయేది. తన పరిస్థితి చూసి తల్లిగా నాకు ఎంతో బాధనిపించింది కానీ, ఆ సమయంలో - ఈయన తన రాజకీయ ప్రస్థానంలో ఎన్ని కష్టాలుపడ్డారో గుర్తుచేసుకుని, ప్రజాసేవలో ఇవన్నీ తప్పవని నన్ను నేను తమాయించుకున్నాను.

జగన్ కూడా ఆ టైంలో చాలాసార్లు - ‘అమ్మా, ఢిల్లీవాళ్లు చెప్పినట్టు ప్రజలనే నా దగ్గరకు రప్పించుకుని ఉంటే నాకసలు ఈ ప్రజల కష్టాలు తెలిసేవా? చిన్న గుడిసెలు... కూర్చోవడానికి స్థలం కూడా లేదు... పడుకోవడానికి మంచం లేదు... తినడానికి తిండి లేదు... వాళ్లు ఎలా బతుకుతున్నారో అని నాకు ఎన్నోసార్లు అనిపించింది. వాళ్ల జీవనశైలిని మెరుగుపర్చాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది’ అన్నాడు.

******** 

అడుగుపెట్టిన ప్రతిచోటా జగన్‌కి లభించిన ఆదరణను పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ వద్దని వారించారు. రకరకాల సమస్యలు సృష్టించారు. అయినా, ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం జగన్,వాళ్లు పదవులు ఇస్తామన్నా కాదని బయటికి వచ్చేశాడు!

********

రాజకీయాల్లో తనకు ఎవరు తోడుగా ఉన్నారో, ఎవరు లేరో అనుకుంటున్న సందర్భంలో, ఓదార్పు యాత్రలో ప్రజలు అంతటి ఆప్యాయతను కురిపించడం, జగన్‌కు కొండంత అండనిచ్చినట్టు అనిపించింది. నాతో ఎన్నోసార్లు అన్నాడు - ‘‘రాజకీయాల్లో ఎవరు నాతో ఉన్నారో, ఎవరు లేరో తెలియదు కానీ, దేవుడు, నాన్న నాకు తోడుగా ఉండి, పైనుంచి ఇవన్నీ జరిపిస్తున్నారని తెలుసు. నాన్న చూపించిన మార్గంలోనే నడుస్తాను. నేను ప్రజలతోనే ఉంటాను’ అని!

********

ఓదార్పు యాత్రతో జగన్ ఒక నాయకునిగా ఎంతో ఎదిగాడు. ఏ ప్రజా సమస్య వచ్చినా వాళ్లకోసం పోరాడి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ‘ఈ బిడ్డ వాళ్ల నాయనలాగా చేస్తాడు’ అని ప్రజలకు నమ్మకం కలిగించాడు. మరి ప్రజల మధ్యనే 24 గంటలు గడిపే అలాంటి వ్యక్తిని, విచారణ పేరుతో తీసుకుపోయి, సాక్ష్యాలను తారుమారుచేస్తాడనే సాకుతో ఉపఎన్నికల టైంలో అరెస్టు చేశారు... జైల్లో పెట్టారు. ఎంక్వైరీ అన్నారు. ఒక నెల కాదు... రెండు నెలలు కాదు... సంవత్సరంగా ఇంకా చేస్తూనే ఉన్నారు. బెయిల్ ఇవ్వమని ఎప్పుడు అభ్యర్థన పెట్టినా అదే మాట చెప్తారు... సాక్ష్యాలను తారుమారు చేస్తాడని! నిజానికి వాళ్ల అసలు భయం అదికాదు... జగన్‌కు ప్రజలు ఇంకా చేరువవుతారని!

******** 

నాకు రాజకీయాలంటే ఆసక్తి లేకపోయినా, ప్రజలకోసం రాజశేఖరరెడ్డిగారు 30 ఏళ్లపాటు పడిన కష్టాన్ని, ఐదేళ్ల ప్రజాపాలనను, రెండున్నరేళ్లపాటు జగన్ సంపాదించుకున్న ప్రజాదరణను వృధా చేయకూడదని, దాన్ని తను బయటికి వచ్చేంతవరకు నిలబెట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలకు సుపరిపాలన వస్తుందని, ముందుముందు మంచిరోజులు వస్తాయని భరోసా ఇవ్వాలని ప్రజల మధ్యకి వచ్చాను.

********

షర్మికి కూడా మొదటి నుంచి రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేకపోయినా, వాళ్ల అన్నకోసం పాదయాత్ర చేయాలనుకుంది. ఆ నిర్ణయం తీసుకోగానే మా తోడికోడలు భారతక్క షర్మితో ‘మీ నాయన అపురూపంగా పెంచుకున్న ఆడపిల్లవి. 3000 కిలోమీటర్లు నడక... అదీ ఎండల్లో, వానల్లో... ఎందుకమ్మా’ అంటూ బాధపడుతుంటే, షర్మి వెంటనే ‘‘నాన్న ఎప్పుడూ చెప్పేవాడు... ‘దేన్నీ పెద్దగా చూడకండి. ప్రాబ్లమ్ వస్తే ముందు కంగారుపడకండి. ఎలాంటి సమస్యనయినా చిన్నదిగా విభజించుకుంటే అంత కష్టం అనిపించదు’ అని. 3000 కిలోమీటర్లు అనుకుంటే అమ్మో అనిపిస్తుంది. రోజూ నడిచేది 15 కిలోమీటర్లే అనుకుంటే చాలా సులభంగా నడవగలుగుతాం’’ అని ఎంతో సింపుల్‌గా సమాధానం చెప్పింది. పాప ఆ మాటలు అంటుంటే ఆయనే గుర్తొచ్చారు. అసలయినా షర్మిచేత ఇవన్నీ ఇంతలా చేయిస్తున్నది దేవుడే అనిపిస్తుంది. లేకపోతే ఒక ఆడపిల్ల అయ్యుండి, ఎండనకా వాననకా ఇలా తిరగగలుగుతుందంటే సామాన్యమైన విషయం కాదు. అంతేకాదు, పాదయాత్ర మొదలెట్టే రోజుకి షర్మికి తెలుగు అంత గొప్పగా రాదు కూడా! మరి ఈరోజు... నాకన్నా ఎంతో స్పష్టంగా మాట్లాడుతోంది. నేనైనా మధ్యమధ్యలో ఇంగ్లీషు పదాలు వాడతానేమో కానీ, తను మాత్రం అచ్చతెలుగులో చెప్పదలచుకున్నది ఎంతో సూటిగా చెప్తోంది. వాళ్ల అన్నలానే తను కూడా ప్రజలకు రోజురోజుకూ దగ్గరవడం చూస్తే తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది.

******** 

ఈమధ్య జగన్‌బాబుని కలిసేదే చాలా తక్కువ అయిపోయింది. వారానికి రెండు రోజులే ములాఖాత్. ఏదో ఒక పనిబడడం వల్ల కుదరట్లేదు. ఎప్పుడైనా నేనే భారతమ్మతో ‘బాబుని చూడబుద్ది అవుతోందమ్మా’ అంటే.. తను వెంటనే ‘మీరు పోయిరండి అత్తా’ అంటుంది. కానీ నేనే మళ్లీ ఆలోచిస్తా. నాకు ఓ అయిదు నిమిషాలు మనిషిని చూస్తే చాలు, కానీ భారతమ్మకు అలా కాదు కదా, తను జగన్‌ని మిస్సవుతుంది. కాస్త ఎక్కువసేపు మాట్లాడాలని ఉంటుందని,. ‘ఒక్కరే పోవాల్సి వస్తే నువ్వే పోమ్మా’ అంటాను. అయినా ఈమధ్య నేను జగన్‌బాబుతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ కళ్లలో నీళ్లు వస్తాయో అని మాట్లాడడం తగ్గించాను. మొన్నీమధ్య ఓసారి మాత్రం ఆపుకోలేక ‘ఏంటి నాన్నా, ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది?’ అని బాధపడుతుంటే, పెద్దవాడిలాగా నా తలమీద చెయ్యిపెట్టి ఒకటే మాట అన్నాడు - ‘అమ్మా, రాత్రి ఎంతసేపని ఉంటుంది? దాని తర్వాత వెలుగు రావల్సిందేగా! దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. సడలనీయ కూడదు. ఆయనే మనల్ని దీనిలోంచి బయటికి తీసుకొస్తాడు’ అన్నాడు. కష్టం అంటే తెలియకుండా, గారాంగా పెరిగిన జగన్‌బాబుకి అసలు ఆ ధైర్యం, స్థైర్యం ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాయో అని ఒకోసారి నాకే ఆశ్చర్యమేస్తుంది. మరి దేవుని మీద నమ్మకమే అలా అనిపిస్తోందో, అసలు జీన్స్‌లోనే ఉందో, చిన్నప్పటినుంచి రాజుల కథలు ఎక్కువ చదవి అది మైండ్‌లో పడ్డదో, లేక వాళ్ల నాన్నను చూసి నేర్చుకున్నాడో తెలీదు! తను ఏమాత్రం సడలినా మేమిలా ఉండగలిగేవాళ్లం కాదు. మేం ఒక్కోసారి ఆపుకోలేక కంటతడిపెట్టినా, తను మాత్రం ఎంతో గంభీరంగా ఉంటాడు. ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా కష్టంగా ఉందనో, బాధగా ఉందనో అనలేదు. ఈమధ్య జగన్‌బాబులోని స్థితప్రజ్ఞత చూసినప్పుడల్లా ఆయన బాగా గుర్తుకొస్తున్నారు.

******** 

ఎవరు అవునన్నా కాదన్నా, ప్రజలు జగన్‌లో ఈయన్ని, షర్మిలో జగన్‌ను చూసుకుంటున్నారన్నది, ఆదరిస్తున్నారన్నది మాత్రం వాస్తవం! ఆ ఆదరణే, రేపు జగన్‌కు శక్తిగా మారుతుందని, ఆ శక్తే తనని ఒక కొడుకు నుంచి ప్రజలకు తండ్రిలా మారుస్తుందని, ప్రజలకు ఆసరాగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను!

దానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. అయినా,ఒక మనిషి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే, దానికి అనుగుణంగా తయారవ్వాలి. తను పరిపక్వత చెందడానికి, ఒక మంచి రాజుగా అవడానికి కొంతకాలం తనదైన పోరాటం చేయక తప్పదు. ఈ అనుభవం తనకి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి, ఓర్పు, సహనాన్ని పెంచుతాయి... తనకవి జీవితాంతం ఉపయోగపడతాయి. తనకింకా ఎన్నో పాఠాలు నేర్పించడానికి, తను స్వశక్తితో ఎదగడానికే దేవుడిలా చేస్తున్నాడేమో! ఏదేమైనా, జరిగేదంతా జగన్‌కి ఓ మంచి అనుభవమే! పైనుంచి కిందపడడం కూడా, ఇంకా ఎత్తుకు ఎగరడానికే!

1

మొదటిసారి ఓదార్పు యాత్ర నుంచి తిరిగి రాగానే జగన్ నాతో ‘ప్రజలు నాన్నను మరచిపోలేదమ్మా! ఆయన చేసిన కార్యక్రమాల వల్ల వాళ్లు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. కేవలం ఆయన కొడుకుగానే నేను వాళ్లకు తెలుసు... అయినా నా మీద ఎంత అభిమానం చూపించారో! వాళ్లు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూసి కొన్ని సందర్భాల్లో నాకు నోటినుంచి మాట కూడా రాలేదు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అది చూసి నాకు అనిపించింది... నేనేమి చేశానని వాళ్లు నా మీద అంత ప్రేమ చూపుతున్నారు? కేవలం నాన్న మీద ఉన్న అభిమానంతోనే కదా నన్ను ఆదరించారు. ఆ ప్రేమను పెంపొందించడం, వాళ్లను కాపాడుకోవటం నాన్న మనకు అప్పగించిన గొప్ప బాధ్యత! అలా చేస్తేనే వాళ్ల రుణం మనం తీర్చుకోగలం!’ అన్నాడు.

2

ఆయన పోయిన కొత్తల్లో... ఓరోజు నేను షర్మి గురించి ఎందుకో చాలా బెంగపడ్డాను. అదేరోజు ప్రేయర్ టైంలో జగన్‌తో - ‘ఇకనుంచి నువ్వు షర్మిని నీ పెద్దకూతురు అనుకో’ అని అన్నాను! దానికి జగన్ - ‘నాకు చెప్పాలా అమ్మా’ అన్నట్టుగా నా వంక చూసి, నా చేయి పట్టుకుని తల ఊపాడు. తన ఎక్స్‌ప్రెషన్ చూడగానే నాకు కొన్నేళ్ల క్రితం వాళ్ల నాయన అలాగే ఓసారి బెంగపడ్డ సందర్భం, దానికి జగన్ ఈయనతో అన్న మాటలు గుర్తొచ్చాయి - ‘ఎందుకు నాన్నా, మీరు షర్మి గురించి బెంగపడతారు? మీ తర్వాత నన్ను మించిన శ్రేయోభిలాషి ఈ భూమి మీద పాపకు ఇంకెవరుంటారు’ అని! ఆ మాటలు గుర్తు రాగానే అనిపించింది... తను పైకి ఏమీ అనకపోయినా, పాప విషయంలో తన కమిట్‌మెంట్ సంపూర్ణంగా ఉందని, తనకి షర్మిని సొంత బిడ్డలా చూసుకునే పెద్దమనసు ఉందని!

3

పాదయాత్రకు ముందు షర్మి వాళ్ల అన్నను కలిసినప్పుడు ‘నీకోసం ఏం చేయలేమా అన్నా’ అని ఏడ్చింది. తల మీద చెయ్యి పెట్టి ‘ఏం చెయ్యక్కర్లేదమ్మా’ అన్నాడు జగన్. అయితే షర్మినే వాళ్ల అన్నకోసం ఏదైనా చేయాలని పట్టుబట్టి పాదయాత్ర మొదలుపెట్టింది. నమ్ముతారో లేదో ఎండలో ఎంత తిరుగుతున్నా ఏపొద్దూ ఈరోజు దాకా ఆయాసపడ్డట్టు కానీ, కాళ్లు నొప్పులని కానీ, కష్టపడుతున్నానని కానీ, భర్తని, పిల్లల్ని మిస్ అవుతున్నానని కానీ అనలేదు. వాళ్ల అన్నకోసం ఎంత కష్టం భరించడానికైనా తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రతిక్షణం ప్రతి మనిషితో ‘అన్నని ఆశీర్వదించండి’ అంటుంది. ఎక్కడా తన గురించి మాట్లాడదు. అది నేనో, వాళ్ల అన్నో చెప్తే వచ్చేది కాదు. నరనరాన వాళ్ల అన్న మీద తనకున్న ప్రేమ తనచేత అలా చెప్పిస్తోంది. ఒక తల్లిగా నాకు ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమ చూస్తే చాలా సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంది.

4

మొన్నీమధ్య ఓసారి మాత్రం ఆపుకోలేక ‘ఏంటి నాన్నా, ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది?’ అని నేను బాధపడుతుంటే, పెద్దవాడిలాగా తను నా తలమీద చెయ్యిపెట్టి ఒకటే మాట అన్నాడు - ‘అమ్మా, చీకటి ఎంతసేపని ఉంటుంది? దా
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62221&Categoryid=11&subcatid=25#sthash.Zo927NrZ.dpuf
Share this article :

0 comments: