వైఎస్ కుటుంబంపై మాకున్న అభిమానం తరగనిది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ కుటుంబంపై మాకున్న అభిమానం తరగనిది

వైఎస్ కుటుంబంపై మాకున్న అభిమానం తరగనిది

Written By news on Wednesday, May 15, 2013 | 5/15/2013

- కొండా సురేఖ స్పష్టీకరణ
- వైఎస్ కుటుంబంపై మాకున్న అభిమానం తరగ నిది
- పార్టీ బలోపేతంపై జగన్ సూచనలిచ్చారు
- ఆయన సీఎం అయ్యేంతవరకూ విజయమ్మ, షర్మిల వెన్నంటి పోరాడుతాం
- వైఎస్ జగన్‌తో కొండా దంపతులు, బాలినేని ప్రత్యేక ములాఖత్

సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తనకున్న అభిమానం ఎన్నడూ తరగదని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె మంగళవారమిక్కడ చంచల్‌గూడ జైలులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇంతకాలం వీలుపడక జగన్‌ను కలవలేదు. ఇప్పుడు అవకాశం దొరకడంతో కలిశాం. 

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై జగన్‌తో చర్చించాం. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళితే బాగుంటుందనే విషయంపై జగన్ మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, వైఎస్సార్ కుటుంబంపై తమకున్న అభిమానం ఎటువంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ‘చిన్న చిన్న పొరపాట్లు సహజమే. పార్టీలో అలాంటి పొరపాట్లు జరిగినపుడు పార్టీ అధినేతతో చర్చించి, సమస్య కొలిక్కి వచ్చే వరకు మీడియా ముందుకు రావద్దనుకున్నాం’ అని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి రానందుకే పార్టీపై అలక వహించానన్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. 

విజయమ్మ, షర్మిల వెన్నంటి పోరాడుతాం..
వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, అదేవిధంగా తమ వర్గీయులు కొందరు ఇబ్బందికి గురయ్యారనే బాధతో కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నామని కొండా సురేఖ చెప్పారు. ఇదే విషయాన్ని తాము జగన్ దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. ‘పార్టీకి అండగా ఉండి జగన్ సూచించిన విధంగా పనిచేసుకుపోతాం. పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించి, జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు విజయమ్మ, షర్మిల వెన్నంటి పోరాడుతాం’ అని పేర్కొన్నారు.

తాము వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతామని కలలో కూడా ఊహించవద్దని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కొండా మురళి బదులిస్తూ.. ‘కొందరు పార్టీ కార్యాలయం ముందు బైఠాయిస్తే.. తాళం వేసినట్లు మీడియా సృష్టించింది. అందులో వాస్తవం లేదు. పార్టీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి చేతికి గాయం కారణంగా నెలరోజులుగా కార్యాలయానికి తాళం వేసి ఉంది. ఇందుకు ఇతర కారణాలేవీ లేవు’ అని తెలిపారు.

విజయమ్మతో కలిసి తెలంగాణలో యాత్ర చేపట్టే ఆలోచన..
పార్టీతో తమకు పొరపొచ్చాలు ఉన్నట్లు ప్రచారం జరిగిందని.. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన తర్వాత అవన్నీ తొలగిపోయాయని కొండా సురేఖ అన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆమె పలు టీవీ చానళ్లతో మాట్లాడారు. ‘విజయమ్మ, షర్మిలతో సమానంగా మిమ్మల్ని భావిస్తున్నాను అని జగన్ ఇచ్చిన హామీతో మరో ఆలోచన లేకుండా పార్టీ కోసం పనిచేయాలని మేం నిర్ణయించుకున్నాం. 

పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేలా కృషి చేయాలని జగన్ మాకు సూచించారు. సమాచార లోపం వల్ల తప్ప జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలనే ఉద్దేశం మాకు ఏనాడూ లేదు. తెలంగాణ నాయకత్వ బాధ్యతలు లేదా వరంగల్ జిల్లా బాధ్యతలు మాకే అప్పగించాలని డిమాండ్ చేయలేదు. మమ్మల్ని పార్టీకి దూరం చేయాలనే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్‌లోని వారెవరికీ లేదు’ అని వివరించారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉండి.. జగన్ సూచించిన విధంగా పనిచేస్తూ రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేసిన వారికి తగిన జవాబిస్తామని తెలిపారు. విజయమ్మతో కలిసి తెలంగాణలో యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ముఖ్య కార్యకర్తల వివాహాలు ఉన్న నేపథ్యంలో సమయాన్ని బట్టి షర్మిల పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. వైఎస్ కుటుంబంతో తమకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేనే లేవని స్పష్టం చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల విషయమై వచ్చేవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. అంతగా విమర్శలు చేసేవారు దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాలు విసిరారు. కావాలంటే వారు సీబీఐకి సైతం ఫిర్యాదు చేసుకోవచ్చని ఆమె సూచించారు. జగన్ స్వతహాగా ధైర్యవంతుడని.. అంతకుముందు తాము వెళ్లినప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారని కొండా సురేఖ చెప్పారు.
Share this article :

0 comments: