ఈ ఆప్యాయతకు, అనురాగానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ఆప్యాయతకు, అనురాగానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’..

ఈ ఆప్యాయతకు, అనురాగానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’..

Written By news on Tuesday, May 7, 2013 | 5/07/2013


మెడపట్టి గెంటుతున్నారు

బ్యాంకుల్లో వడ్డీలేని రుణాలు ఇవ్వట్లేదంటూ షర్మిల వద్ద మహిళల ఆవేదన

ముఖ్యమంత్రి మాత్రం టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నారని ధ్వజం
వైఎస్ ఉన్నప్పుడు అందరినీ చక్కగా చూసుకున్నాడని వెల్లడి
ప్రస్తుత పాలకులకు పదవుల మీద ఆశ తప్ప.. తమను పట్టించుకోవట్లేదని ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 140, కిలో మీటర్లు: 1,881.9

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు పావలా వడ్డీ రుణాలతో వ్యాపారం చేశాం. వచ్చిన ఆదాయం పొదుపు చేశాం. ఆ డబ్బులతో టోకున నిత్యావసర సరుకులు తెచ్చేవాళ్లం. కొంత డబ్బు మహిళా సంఘం భరించి సభ్యులకు ఎంఆర్‌పీ ధరల కంటే తక్కువ ధరకే ఇచ్చే వాళ్లం. మహానేత పోయిన తరువాత మమ్మల్ని పట్టించుకున్న వారేరి? పావలా వడ్డీ రుణాలకు కోత పెట్టారు. టీవీల్లో చూస్తే ముఖ్యమంత్రి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని చెప్తున్నారు. బ్యాంకులకు పోతే మేనేజర్ మెడపట్టి బయటికి నూకుతుండు.’’
- ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఓ మహిళా సంఘం ఆవేదన

‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు రైతులను జూసిండు, ఆడోళ్లను, ముసలోళ్లను, విద్యార్థులను.. అన్ని వర్గాలనూ చక్కగా జూసిండు. ఇప్పటోళ్లకు పదవి మీది యావేగాని ప్రజల మీద లేదక్కా, గద్దెల కోసం ఢిల్లీ పైరవీలు, ఒకరి మీద ఇంకొకరు కుట్రలు పన్నుకుంటూ మమ్మల్ని మరిచిపోతున్నారు. టీవీల సూపెట్టిండ్రు, కిరణ్‌కుమార్‌రెడ్డి మీద బొత్సాయన(సత్యనారాయణ) షికాంపు(ఫిర్యాదు) చేస్తే ఆయన మీద షికాయింపుజేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డిబోయి ఢిల్లీల గూచుండట. ఇంగ ఈళ్లేం మాగురించి సూస్తరక్కా’’
- ఖమ్మం జిల్లా 4 ఇంక్లైన్ ప్రాంతానికి చెందిన కండె రాజమ్మ ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సాగింది. దారి వెంట పలు గ్రామాల ప్రజలు ఆమెను కలుసుకొని పై విధంగా తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ఈ పాదయాత్రలో షర్మిలను చూడడానికి ఆమెతో తమ సమస్యలు చెప్పుకోవడం కోసం, జగన్‌మోహన్‌రెడ్డి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం జనం పోటీ పడ్డారు. ‘‘బట్టకాల్చి కొడుకు మీదేసిరి. ఈళ్ల కండ్లళ్ల కంపగొట్ట, ఇంకెన్ని దినాలు అండ్ల(జైల్లో) బెడతరు’ అని కొత్తగూడెం మండలం త్రీఇంక్లైన్ పంచాయతీలోని ఆంగోతి ముత్యాలు అనే మహిళ.. జగన్‌మోహన్‌రెడ్డి పట్ల పాలకుల వైఖరిని నిలదీసింది.

‘ఇయ్యాలన్న (ఈరోజు) అన్నకు బెయిల్ వస్తుందా బిడ్డా’ అని ముత్యాలు.. షర్మిలను ఆశగా అడిగింది. జగన్ బెయిల్‌పై సుప్రీంకోర్టులో వాదనల నేపథ్యంలో ప్రజలు సోమవారం బెయిల్ వస్తుందనే ఆశతో షర్మిలను ఆరా తీయడం కనిపించింది. తనను కలిసిన మహిళలతో షర్మిల మాట్లాడుతూ.. జగనన్న త్వరలోనే వస్తారని, రాజన్న రాజ్యంవైపు నడిపిస్తారని ధైర్యం చెప్పారు. ‘‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత.. నాడు రాజన్న చేసి చూపించిన ప్రతి పథకానికీ జగనన్న మళ్లీ జీవం పోస్తారు. ప్రతి అవ్వాతాతలకు రూ. 700 పింఛను వస్తుంది.. రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయి. రాష్ట్రంలో గుడిసె అన్నదే లేకుండా ప్రతి పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టిస్తారు’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

13 కి.మీ. మేర యాత్ర..

పాదయాత్ర 140వ రోజు సోమవారం షర్మిల ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రం నుంచి యాత్ర ప్రారంభించారు. సింగరేణి ఆసుపత్రి, టీటీడీ మండపం మీదుగా యాత్ర సాగింది. రామవరం, త్రిఇంక్లైన్ గ్రాయాల మీదుగా షర్మిల నడిచారు. పెనగడప శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45గంటలకు చేరుకున్నారు. ఆమె సోమవారం మొత్తం 13 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,881.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరెడ్డి, పి.అజయ్ కుమార్, మాజీ ఎమ్మెలే వెంకటేశ్వర్లు, కృష్ణ, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, భుక్యాదళ్‌సింగ్, జయరాజ్ తదితరులున్నారు.

ఆత్మ బంధువు కోసం మండుటెండల్లో..

ఖమ్మం జిల్లా కొత్తగూడెం.. సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో మండుతున్న ఎండలు.. అంతకు మించి ఉక్కపోత.. ఇవేమి పట్టకుండా షర్మిల అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆత్మబంధువు తమ పల్లెకు వస్తున్నారనే కబురు అందటమే ఆలస్యం.. మహిళలు ఇంటికి తాళం వేసి, పసి పిల్లలను చంకన వేసుకొని మండు టెండలో చెమటలు గక్కుతూ రోడ్లపైకి వచ్చి నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆమె రాగానే హారతి పట్టి ఆహ్వానిస్తున్నారు. ఆడబిడ్డ ఊరికి వచ్చిందని గాజులు, చీరలు, పూలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు.. ఊరు పొలిమేర దాటేంత వరకు దగ్గరుండి సాగనంపుతున్నారు. అవ్వలు.. తాతలైతే నడవటానికి, కనీసం నిలబడటానికి శరీరం సహకరించకున్నా.. ఒంట్లో లేని సత్తువను కూడ తీసుకొని జనంలోకి వచ్చి ముందు వరసలో నిలబడుతున్నారు. రెండు చేతులు పెకైత్తి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. వృద్ధుల ఉత్సాహాన్ని చూసి వారి బంధువులే ఆశ్చర్యపోతున్నారు.

‘మంచం మీద నుంచి కూడా లేవడానికి చేతగాని మా అమ్మ జగనన్న చెల్లెలు వస్తున్నారని తెలియగానే కట్టె పొడుచుకుంటూ జనంలోకి పోయింది. జనం తొక్కుతారని నేను భయపడ్డాను. అమ్మను చూడగానే షర్మిలక్క ఆగి నుదుటిమీద ముద్దు పెట్టింది’ అని రామవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా షర్మిల పయనించే దారిలో ఊళ్లకు ఊళ్లే రోడ్డు మీదకు వస్తున్నాయి. షర్మిల నడిచే దారికి ఇరువైపుల సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాల ప్రజలు కూడా పరుగుపరుగన వచ్చి షర్మిలను ఆశీర్వదిస్తున్నారు. సీతంపేట బంజర గ్రామం.. యాత్ర సాగిపోతున్న దారికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. గ్రామస్తులంతా పిల్లా పాపలతో కలిసి రోడ్డు మీదకు వచ్చి షర్మిలకు చీరలు, గాజులు పెట్టారు. ‘మీరు చూపిస్తున్న ఈ ఆప్యాయతకు, అనురాగానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను’ అని షర్మిల అనగా ‘అమ్మా...! మాకోసం ఇంత ఎండల బడి నడుస్తున్నవు. అన్న కూడా ఓదార్పు యాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. మనది నాన్నగారు కలిపిన అనుబంధం’ అని ఓ వృద్ధురాలు చెప్పడంతో షర్మిల కళ్లలో ఆనంద భాష్పాలు నిండాయి.
Share this article :

0 comments: