జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమే

జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమే

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

- వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు సోమయాజులు స్పష్టీకరణ
- ఇంత అప్రజాస్వామికంగా దర్యాప్తు ప్రపంచంలో మరెక్కడా లేదు
- సీఆర్‌పీసీ, క్రిమినల్ చట్టాలను సీబీఐ పరిహాసం చేస్తోంది
- కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, ఇంత అప్రజాస్వామికంగా కేసులను దర్యాప్తు చేయడం ప్రపంచంలో మరెక్కడా లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. ఏడాదిగా జగన్‌ను జైలులో నిర్బంధించడాన్ని గుర్తుచేస్తూ.. ఎలాంటి తప్పూ చేయకున్నా ఒక వ్యక్తిని ఇంతకాలం జైల్లో పెట్టడం అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సోమయాజులు మాట్లాడారు. 

జగన్ వైఎస్సార్‌సీపీని స్థాపించి కాంగ్రెస్, టీడీపీ ఓట్లను కొల్లగొట్టారనే అక్కసుతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. జగన్ కేసులో సీఆర్‌పీసీ, క్రిమినల్ చట్టాలను పరిహాసం చేసేలా సీబీఐ దర్యాప్తు సాగిస్తోందని వ్యాఖ్యానించారు. 167 సీఆర్‌పీసీ ప్రకారం ఏదైనా కేసులో గరిష్టంగా 90 రోజులలోపు దర్యాప్తు పూర్తి చేయకపోతే బెయిల్ పొందే చట్టపరమైన హక్కు నిందితునికి లభిస్తుందని, కానీ సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జగన్‌కు బెయిల్ రాకుండా వితండ వాదనలు కోర్టుల ముందు లేవనెత్తుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ స్వయంగా వెల్లడించిందని, ఇదేదో ప్రపంచంలోనే పెద్ద నేరమన్నట్లుగా కోర్టుల ముందు చిత్రీకరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే: ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌ను విచారణ పేరుతో సీబీఐ పిలిపించి కుట్రపూరితంగా అరెస్టు చేసిందని సోమయాజులు చెప్పారు. ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితులపై కేసు పెట్టడానికి ముందు వారి అభిప్రాయమేమిటో తెలుసుకున్నారని, అయితే ఎఫ్‌ఐఆర్‌లో జగన్‌ను నిందితునిగా చేర్చడానికి ముందు సీబీఐ ఒక్కసారి కూడా పిలిచి విచారణ జరపలేదన్నారు. 2011 ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసిన సీబీఐ జగన్‌ను ఒక్కసారీ విచారించకుండానే నిందితునిగా చేర్చిందన్నారు. ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి తప్పుకోవాలని అప్పట్లో మొరార్జీ దేశాయ్, మధులిమాయే, మధు దండావతే వంటి గొప్ప రాజకీయ వేత్తలు డిమాండ్ చేయగా.. ఎమర్జెన్సీ విధించి వారందర్నీ 18 నెలలపాటు బెయిల్‌కు అవకాశం లేకుండా జైల్లో పెట్టించిన ఘనత కాంగ్రెస్‌దని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను ఎవరైనా ప్రశ్నించినా, ఎదిరించినా జైల్లో పెట్టడం ముందునుంచీ జరుగుతున్నదనేందుకు ఇది నిదర్శనమన్నారు. 

దుర్మార్గంగా జగన్‌పై కేసులు పెట్టారు
ఓ వైపు దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ చెబుతూ మరోవైపు చార్జిషీట్లు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అసలు జగన్‌పై పెట్టిన కేసులు దుర్మార్గమైనవన్నారు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని జడ్చర్ల వద్ద ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేనిచోట ఎకరా రూ.7 లక్షలకు అరబిందో, హెటెరో వంటి రాష్ట్రానికే చెందిన ఫార్మారంగంలో పేరుమోసిన సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తే.. అక్కడ రూ.16 కోట్ల రాయితీ పొందినందుకుగాను రూ.32 కోట్ల పెట్టుబడులు జగతి సంస్థల్లో పెట్టారని అభియోగాలు మోపారని ఆయన తప్పుపట్టారు. అసలు ఆ ప్రాంతంలో ఎకరా లక్ష రూపాయలు కూడా చేయదనే విషయం విస్మరించారన్నారు. అయినా రూ.16 కోట్లు లబ్ధి పొందినవారు రూ.32 కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల వారికొచ్చే ప్రయోజనం ఏమిటనేది కూడా ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. 

అక్కడ ఎకరా విలువ రూ.15 లక్షలకు పెరిగిందంటే అది ప్రాథమిక సదుపాయాల కల్పన తరువాతేనని ఆయన గుర్తుచేశారు. భారతీ సిమెంట్స్‌లో 350 రూపాయల ప్రీమియంను చెల్లించి వాటాదారులు కొనుగోలు చేయడాన్ని సీబీఐ తప్పుపట్టడం దారుణమన్నారు. కానీ 2006-08 మధ్యకాలంలో రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు ‘ఈనాడు’ సంస్థే స్వయంగా వెల్లడించిందని, అలాంటి సంస్థ షేర్లను ఎక్కువ ప్రీమియంకు కొనుగోలు చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడుల్లోనూ ఎలాంటి తప్పులేదని సోమయాజులు తెలిపారు. ‘‘నిమ్మగడ్డ తొలుత స్థాపించిన మ్యాట్రిక్స్ సంస్థను అమ్మగా వచ్చిన రూ.1000 కోట్లను 20 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. భారతీ సిమెంట్స్‌లో ఆయన కొన్న షేర్లకు భారీగా లాభాలు వచ్చాయి. ప్రసాద్ పెట్టిన పెట్టుబడులన్నీ ఆదాయపుపన్ను కట్టిన మొత్తమే’’ అని వివరించారు. 

అన్నీ తప్పుడు ఆరోపణలే
జగన్‌పై తొలుత లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారని, ఆ తరువాత రూ.43 వేల కోట్లు అని అన్నారని, తీరా సీబీఐ ఇప్పటివరకూ చేసిన 70 శాతం దర్యాప్తులో మొత్తం లావాదేవీలే రూ.1,030 కోట్లంటూ తేల్చారని సోమయాజులు అన్నారు. దీన్నిబట్టి సీబీఐ ఆరోపణల్లో డొల్లతనం తెలుస్తోందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే సీబీఐ ఆగమేఘాల మీద స్పందించి జగన్ సంస్థలపైనా, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారి సంస్థలు, ఇళ్లపైనా దాడులు నిర్వహించి భయానక వాతావరణాన్ని సృష్టించిందని విమర్శించారు. 

అదే ఇతరుల కేసుల్లో సీబీఐ ఇలా వ్యవహరించలేదన్నారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆదర్శ్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం ఇంటిపై సీబీఐ ఇలాగే దాడులు చేసిందా? అంతెందుకు మన రాష్ట్రంలో ఫోక్స్‌వ్యాగన్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన మంత్రి ఇంటిపై సీబీఐ ఇలాగే దాడులు చేసిందా?’’ అని సోమయాజులు ప్రశ్నించారు. 26 జీవోల జారీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శుల పేర్లు పిటిషన్‌లో ఉంటే వారిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకుండా మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని మాత్రం చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బయటపడిన బొగ్గు, రైల్వే కుంభకోణాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Share this article :

0 comments: