ఎన్నికలు పెట్టే దమ్ముందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు పెట్టే దమ్ముందా?

ఎన్నికలు పెట్టే దమ్ముందా?

Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013

అక్రమ పొత్తులతోనైనా సరే
ఎన్నికలు పెట్టే దమ్ముందా?
సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకుతో జగనన్నను జైల్లో పెట్టారు
ప్రభావితం చేసే అధికారం, అవకాశమున్న మంత్రులను సీబీఐ అరెస్టు చేయదేం?
యూపీఏ స్కామ్‌లు ఇన్ని బయటపడుతున్నా నిలదీయరేం చంద్రబాబూ?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 141, కిలోమీటర్లు: 1,893.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విలువలను మరిచిపోయి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. సినీ నటుడు చిరంజీవి ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేసినట్టు.. ఈ చంద్రబాబు నాయుడు కూడా టీడీపీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశారు. వీళ్ల స్నేహం ఇక్కడితో ఆగదు. నిస్సిగ్గుగా అదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాబోయే ఎన్నికల్లో వీళ్లు అక్రమ పొత్తులు పెట్టుకుంటారు.

అయినా సరే మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సాగింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

పసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

జగనన్న సీఎం అవుతారని వీళ్లకు తెలుసు..
‘‘ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదు. ఎందుకంటే ఎన్నికలంటూ జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి వస్తుందని వీళ్లకు తెలుసు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వీళ్లకు తెలుసు. ఎన్నికలు వస్తే ‘‘మాకు కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దు.. చంద్రబాబు వద్దు. మాకు జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలి’’ అని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తారని ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు తెలుసు. ఓటేసే ప్రతి వ్యక్తీ కూడా జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని ఎలుగెత్తి చాటుతారని వీళ్లకు బాగా తెలుసు. జగనన్న బయటే ఉంటే ఈ రెండు పార్టీలకూ మనుగడ కష్టమనే కుట్రలు పన్ని జైలుకు పంపారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం సాధించే దిశగా నడిపిస్తారు.

సమాధానం చెప్పరేం?

జగనన్న బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని నిన్న సీబీఐ లాయర్ మళ్లీ అదే మాట చెప్తున్నారు. కానీ జగనన్న బయట ఉండగా ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారా? చేయడానికి ప్రయత్నించారా? మీరు రుజువు చేయగలరా? అని అడిగితే ఈ సీబీఐ సమాధానం చెప్పలేదు. కేవలం జగనన్న పేరు చార్జిషీట్‌లో ఉన్నందుకు ఆయన్ను జైలుపాలు చేశారు. కానీ అదే చార్జిషీట్‌లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం అధికారంలో ఉన్న మంత్రులకు ఉంటుంది. మరి ఆ మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆడిగితే సీబీఐ సమాధానం చెప్పదు. మంత్రులు సమాధానం చెప్పరు. ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదు.’’

11.9 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 141వ రోజు మంగళవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని పెనగడప గ్రామం నుంచి షర్మిల నడక ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేద్కర్ నగర్, తిప్పనపల్లి మీదుగా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి అయ్యన్నపాలెం మీదుగా రాంనగర్ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.20 గంటలకు చేరుకున్నారు. మంగళవారం ఆమె 11.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,893.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎడవల్లి కృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, భూక్యాదళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు. కాగా నల్లగొండ జిల్లా నుంచి ఇంజం నర్సిరెడ్డి పార్టీ కార్యకర్తలతో వచ్చి షర్మిలను కలిశారు.

12న ‘పశ్చిమ’లోకి ప్రవేశించనున్న యాత్ర

షర్మిల పాదయాత్ర ఈ నెల 12న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ బాలరాజు, పార్టీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పాకలవారంగూడెం గ్రామం పొలిమేర దాటడంతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర పూర్తి అవుతుందని వారు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం ద్వారా షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారని చెప్పారు. జిల్లాలో దాదాపు 20 రోజుల పాటు 275 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని వారు చెప్పారు.

చంద్రబాబూ.. వాళ్లను నిలదీయరేం?

‘‘స్వయంగా ప్రధానమంత్రే బొగ్గు శాఖ నిర్వహిస్తుండగా, బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వలన మన దేశానికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ బయటపెట్టింది. దీనిపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశిస్తే.. సీబీఐ విచారణ చేసి మళ్లీ దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు ఆ రిపోర్టును తీసుకొనిపోయి ప్రధానమంత్రి కార్యాలయానికి, న్యాయశాఖ కార్యాలయానికి, అటార్నీ జనరల్‌కు ఇచ్చింది. వాళ్లంతా తమకు నచ్చిన మార్పులు, చేర్పులు చేసుకున్న తరువాత సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిందట. మంత్రుల తీరు, సీబీఐ తీరు ఇలా ఉంటే.. నిన్న రైల్వే శాఖ మంత్రికి సంబంధించిన మనిషే లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మన దేశంలో మంత్రులు, సీబీఐ ఇలా పని చేస్తుంటే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మటుకు వాళ్లను నిలదీయడం లేదు. చంద్రబాబు నాయుడైనా.. ఆయన ఎంపీలైనా.. ఎమ్మెల్యేలైనా ఈ సీబీఐనిగాని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌నుగాని ఒక్క మాటంటే ఒక్క మాట కూడా నోరు విప్పి అనటం లేదంటే వారి స్నేహం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతోంది.’’
- షర్మిల
Share this article :

0 comments: