ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు.

ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు.

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఉద్ఘాటన
* 2,000 కి.మీ. మైలురాయి దాటిన పాదయాత్ర
* వైఎస్ పాదయాత్రకు కొనసాగింపే ఈ మరో ప్రజాప్రస్థానం: షర్మిల
* జగనన్న ద్వారా రాజన్న రాజ్యం సాధించుకున్న రోజే మనకు పండుగ
* రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రలను, 
* నరకాసురులను సంహరించాలి.. అప్పటిదాకా జరిగేది యుద్ధమే..
* వైఎస్ ఇమేజ్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
* ఆయనకు వెన్నుపోటు పొడిచింది.. ఆయన కుటుంబంపై రాళ్లు వేస్తోంది... టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది 

నేను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదు. జరుగుతున్న అన్యాయాలు, వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలి. అదే చేస్తున్నా...

పెద్దలు, పిల్లలు... అందరూ ఎంతో అప్యాయత కనబరుస్తున్నారు. ప్రత్యేకించి మహిళలు నన్ను ఒక కూతురిగానో, ఒక అక్కగానో భావిస్తున్నారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని నేనొస్తే.. మా కష్టాలు పంచుకోవాలని వారు కోరుకుంటున్నారు. 


మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇది విజయ యాత్ర కాదు.. నిరసన యాత్ర. జగనన్న ద్వారా రాజన్న రాజ్యం సాధించుకున్న రోజే మనందరికి నిజమైన పండుగ. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రలను, కుతంత్రాలను, ఈ నరకాసురులను సంహరించిన రోజే నిజమైన పండుగ. అంతవరకు జరిగేది పోరాటమే.. అప్పటి వరకు జరిగేది యుద్ధమే..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. వైఎస్సార్ యజ్ఞంలా చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మరో ప్రజాప్రస్థానం అని చెప్పారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామం చేరుకోగానే పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా రావికంపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడికి భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

వైఎస్‌కు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది..
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఏ కేసులూ లేవు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడారు. ఇంత మంచి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోనే ఎవరూ లేరని సోనియాగాంధీ గారు, మన్మోహన్‌సింగ్ గారు పొగిడారు. వైఎస్సార్ పథకాలు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు వెన్నుపోటు పొడిచింది. వైఎస్సార్‌ను దోషి అన్నది.. ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారు. ఆయన కుటుంబం మీద రాళ్లు వేసింది.. వైఎస్సార్ కొడుకును జైలుపాలు చేసింది. వైఎస్సార్ ప్రతి పథకానికి తూట్లు పెట్టింది. ఆయన ఉద్దేశాలను విమర్శించింది. అన్నిటికీ మించి ఈ నాలుగేళ్ల కాలంలో ఈ టీడీపీతో కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేసింది. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూధైర్యం ఈ కాంగ్రెస్, టీడీపీలకు లేదు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకే సీబీఐ వెనకాల దాక్కొని దాడి చేస్తున్నారు.

ఈ సీఎం పాలనలో ప్రజలు అల్లాడుతున్నారు..
ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారులో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతులకు నీళ్లు, కరెంటు లేక వేసిన ప్రతి పంటలోనూ నష్టమొచ్చి అప్పుల పాలవుతున్నారు. పిల్లలు కూడా పనులకు పోతేనే ఇళ్లు గడిచే పరిస్థితి ఏర్పడింది అంటే ఈ పాపం కిరణ్ సర్కారుది కాదా అని అడుగుతున్నాం. ప్రజల గుండె చప్పుడు అర్థం చేసుకున్న మనిషి వైఎస్సార్ కనుక... ఆయన గుండెలోంచి అద్భుతమైన ఆలోచనలు పుట్టాయి. అందుకే అద్భుతమైన పథకాలు రూపొందించారు. చిత్తశుద్ధి, ప్రజల మీద స్వచ్ఛమైన ప్రేమ ఉన్న మనిషి కాబట్టే ఆ పథకాలను అమలు చేసి చూపించారు.

సీఎం కిరణ్ సొంత పథకాలివీ..
ఇప్పుడు సీఎం కిరణ్ కూడా సొంత పథకాలు చేస్తున్నారు. వాటి గురించి చెప్పాలి. జల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసే పథకం, మద్దతు ధర ఇవ్వకుండా రైతులను ముంచే పథకం, కరెంటు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టే పథకం, ఎరువుల ధరలు, గ్యాస్ ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచే పథకం, కరెంటు చార్జీలు పెంచే భారీ పథకం, మన ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చే పథకం, నెలలో సగం రోజులు కరెంటు ఇవ్వకుండా పరిశ్రమలను మూయించే పథకం, యువకులను నిరుద్యోగులుగా మార్చి వారి కుటుంబాలను రోడ్డున పడేసే పథకం, మేనిఫెస్టోలో 30 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి 20 కిలోల బియ్యం ఇస్తూ ప్రజల సొమ్మును నెలకు రూ.400 దోచుకునే పథకం, ఫీజు రీయింబర్స్‌మెంటు తగ్గించే పథకం, ఆరోగ్యశ్రీని నీరుగార్చే పథకం, పక్కా ఇళ్లకు పాడెగట్టే పథకం, రేషన్ కార్డులను రద్దు చేసే పథకం, తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకునే బంపర్ పథకం, వైఎస్సార్ మీద బురదజల్లే పథకం, సీబీఐని వాడుకొని జగనన్న మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టే మెగా పథకం... ఇవీ మన కిరణ్‌కుమార్‌రెడ్డి గారి పథకాలు. ఈ పథకాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు గడపగడపకూ ఏ ప్రచారం లేకుండానే వెళ్లిపోతున్నాయి. ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. 

అందుకే ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పడానికి ఎప్పుడెప్పుడా అని వేచి ఉన్నారు. తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబుకు తెలుసు. ఆయనకు ఇంత తొందరగా ఎన్నికలు రావడం ఇష్టం లేదు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఒక భారీ పథకం వేశారు. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి.. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చరిత్ర హీనుడు అయ్యారు. ఆరోజు ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతిచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉంటే.. ఈ కరెంటు బాదుడు ప్రజల మీద పడకపోయి ఉండేది. అవిశ్వాసం పెట్టిన రోజున కిరణ్ ప్రభుత్వం 146 మంది సభ్యులతో మైనార్టీలో పడిపోయింది. అలాంటి మైనార్టీ సర్కారు ఇప్పుడు చంద్రబాబు గారి మద్దతుతో పనిచేస్తోంది.

2,000 కి.మీ దాటిన పాదయాత్ర
150 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని మధ్యాహ్నంవారిగూడెం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి వెంకటాపురం, బొరంపాలెం, వల్లంపట్ల, ముల్లకుంట, మహాలక్ష్మిపురం, గ్రామాల మీదుగా రావికంపాడుకు చేరుకోగానే పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. 

ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.40 గంటలకు షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 11.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2001.7 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్నవారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఆళ్ల నాని, జోగి రమేష్, మద్దాల రాజేష్, తానేటి వనిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మేకతోటి సుచరిత, పేర్ని నాని, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కూన శ్రీశైలం గౌడ్, గుర్నాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కురుముట్ల శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నేతలు బొడ్డు భాస్కరరామారావు, జ్యేష్ట రమేష్‌బాబు, జ్యోతుల నెహ్రూ, చెరుకువాడ రంగనాథరాజు, కుడిపూడి చిట్టబ్బాయి, గ్రంథి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తలశిల రఘురాం, మొవ్వ ఆనంద శ్రీనివాస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంవీవీఎస్ నాగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి, గోసుల శివభరత్‌రెడ్డి, సీహెచ్ రవీంద్రరెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, గంట ప్రసాద్ తదితరులున్నారు. 

వైఎస్ పాదయాత్రే స్ఫూర్తి..
‘‘నా పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో వేల మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే, లక్షల మంది పొట్టకూటి కోసం వలసలు పోతుంటే, రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడానికి వైఎస్సార్.. మండుటెండలో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఒక యజ్ఞంలా చేశారు. ఆ పాదయాత్రకు కొనసాగింపుగానే అదే ఉద్దేశంతోనే జగనన్న తరఫున ఈ పాదయాత్ర చే స్తున్నా. ఇది ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేస్తున్న పాదయాత్ర కాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, వారి కష్టాలను పట్టించుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన మోస్తోంది కాబట్టి, రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, పేదలకు, విద్యార్థులకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ద్రోహం చేస్తున్నాయి కాబట్టి చేస్తున్న పాదయాత్ర. మంచి రోజులు మళ్లీ వస్తాయని భరోసా కలిగించడానికి చేస్తున్న పాదయాత్ర. రాజన్న రాజ్యం మళ్లీ జగనన్నకే సాధ్యమవుతుందని చెప్పడానికి చేస్తున్న యాత్ర.’’ 
- షర్మిల
Share this article :

0 comments: