చదివించే బాధ్యత జగనన్నదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చదివించే బాధ్యత జగనన్నదే

చదివించే బాధ్యత జగనన్నదే

Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013

* ఆరు నెలలో.. ఏడాదో.. ఓపిక పట్టండి
* ‘అమ్మ ఒడి’ పథకంతో మీ పిల్లలను చదివించే బాధ్యత జగన్ తీసుకుంటారు
* టెన్త్ వరకు ఒక్కో విద్యార్థికీ నెలకు రూ. 500 చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు
* ఇంటర్ అయితే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1000 ఇస్తారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా ఒక్క ఆరు నెలలో.. ఏడాదో ఓపిక పట్టండి. మీ పిల్లలను చదివించే బాధ్యత జగనన్న తీసుకుంటారు. ‘అమ్మ ఒడి’ పథకంతో ఆదుకుంటారు. అప్పుడు మీ పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ‘‘అమ్మా... నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి ఏడు పాసయ్యాడు. చిన్నబ్బాయి ఆరు వరకు సదివాడు. ఇల్లు గడిచే దారిలేక ఇద్దరినీ బడి మాన్పించి నాతోపాటే పనికి తీసుకొని పోతున్నానండీ.. పిల్లలను సదివించాలని ఉన్నా వీలుపడడంలేదండీ’’ అని పశ్చిమగోదావరి జిల్లా కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన నాగ సుందరీదేవి.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

ఆమె ఆవేదన వింటూ ముందుకు సాగిన షర్మిల గోపాలపురం నియోజకవర్గంలోని ఈస్ట్ యడవల్లి గ్రామంలో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో సాగింది. ఈస్ట్ యడవల్లి గ్రామంలో షర్మిల ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత.. పిల్లలను చదివించేలా అక్క చెల్లెళ్లను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. ఆ పథకం కింద.. బడికి వెళ్లే చిన్నారికి నెలకు రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరేసి పిల్లల వరకు అమ్మ ఖాతాలోనే డబ్బు వేస్తారు. అంటే ఒక్కో చిన్నారికీ ఏడాదికి రూ. 6,000 చొప్పున అమ్మ అకౌంట్లో పడుతుంది. ఇంటర్ అయితే చిన్నారికి నెలకు రూ. 700 చొప్పున, డిగ్రీ అయితే రూ. 1,000 చొప్పున నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆపై చదువులు చదివే వారికి వైఎస్సార్ అమలు చేసి చూపించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఉండనే ఉంది.

చార్జీలు పెంచని సీఎం వైఎస్
ఏ రాజకీయ పార్టీ అవునన్నా కాదన్నా.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రతి పల్లె, ప్రతి రైతు బాగుపడింది నిజం. వైఎస్ రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు.. నీళ్లిచ్చారు.. అవసరమైనప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు.. ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారు. రైతుల రుణాల మీద వడ్డీ ఒక సారి, కోట్ల రూపాయల రుణాలను మరోసారి మాఫీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అభయహస్తం ప్రవేశపెట్టడంతోపాటు పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛను.. ఇలాంటి ఎన్నో పథకాలు వైఎస్సార్ అద్భుతంగా అమలు చేసి చూపించారు. ఇన్ని పథకాలు చేసి వైఎస్సార్ ఏ రోజూ ఒక్క రూపాయి చార్జీ పెంచలేదు.

రూపాయి పెంచినా ఆ భారం పేదల మీద పడుతుందని, తన అక్క చెల్లెళ్ల మీద పడుతుందని ఆలోచన చేశారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే ఆ భారం తన అక్కచెల్లెళ్ల మీద పడకూడదని చెప్పి.. వైఎస్సార్ ఆ భారం తన ప్రభుత్వం మీదనే వేసుకున్నారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చేనాటికి రూ.305 ఉన్న గ్యాస్ ధరను ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయేంత వరకు రూ.1 కూడా పెంచలేదు. ఇప్పుడున్న పాలకులు ఈ ధరను రూ.420 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకుంటే రూ.1,000 చేసేశారు.

చంద్రబాబు.. ఖల్‌నాయక్
ప్రజలను ఆదుకోవడంలో ఈ కాంగ్రెస్ సర్కారు ఇంత ఘోరంగా విఫలమయినా.. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సర్కారుకే అండగా నిలబడుతున్నారు. ప్రతి పక్ష నాయకుడిగా ఉండి ప్రజల పక్షాన నిలబడకుండా, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి అండగా నిలబడి అది కూలిపోకుండా కాపాడుతున్నారు అంటే ఈయన్ను ఖల్‌నాయక్ అనక మరేమంటారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మీరు బుద్ధి చెప్పి.. జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుంది. ఆ రోజు రైతన్న మళ్లీ తలెత్తుకొని తిరుగుతాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయి.’’

12.2 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 151వ రోజు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కొత్త వెంకటాపురం, పాత వెంకటాపురం, ఈస్ట్ యడవల్లి, దొరసానిపాడు గ్రామాల మీదుగా షర్మిల నడిచారు. ద్వారకా తిరుమల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,013.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, ఎమ్మెల్సీలు మేకాశేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యే కేవీ కృష్ణబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాసు, బొడ్డు వెంకట రమణ చౌదరి, స్థానిక నాయకులు టి. వెంకట్రావు, రాజీవ్ కృష్ణ, డి. సువర్ణ రాజు, జి.ఉమా బాల తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: