కిరణ్ ధీమా చంద్రబాబే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ ధీమా చంద్రబాబే

కిరణ్ ధీమా చంద్రబాబే

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

అందుకే ఇంత విర్రవీగుతూ అన్ని చార్జీలూ పెంచేస్తున్నారు: షర్మిల
ఎరువుల ధర ఇప్పటికి 10 సార్లు, ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు
సబ్సిడీ లేని గ్యాస్ ధరను రూ.వెయ్యి చేసేశారు
వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించారు
కరెంటు చార్జీల పేరుతో ప్రజలపై రూ.30 వేల కోట్ల భారమేశారు
చంద్రబాబు అండదండలు ఉన్నంతవరకు ఏం చేసినా చెల్లుతుందనే సీఎం ధీమా


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతులంతా అల్లాడిపోతున్నారు.. పండించిన పంట కు మద్దతు ధర లేదు. ఎరువుల ధరలు ఇప్పటికి 10 సార్లు పెంచారు. లేని కరెంటుకు మూడింతల బిల్లులు వేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు ఇప్పటికి మూడు సార్లు పెంచారు. గ్యాస్ ధర రూ. 305 నుంచి రూ. 420 అయింది. అదీ సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకుంటే ఏకంగా రూ. వెయ్యి. వ్యాటు, రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించారు. ఇలా ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిదీ పెంచేశారు. రూ. 30 వేల కోట్ల కరెంటు భారం ప్రజల నెత్తిన మోపి వాళ్ల రక్తం పిండైనా వసూలు చేస్త్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతగా విర్రవీగుతూ రెచ్చిపోయి పన్నుల పోటు పొడవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు అండదండలు ఉన్నంత వరకు తాను ఏం చేసినా చెల్లుతుందనే ఈ ముఖ్యమంత్రి ధీమా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అని ప్రతిపక్ష పార్టీ లూ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి ఉంటే ఈపాటికి ఈ దుర్మార్గపు ప్రభుత్వం కూలిపోయి ప్రజల నెత్తిన భారం తప్పేది’’ అని అన్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసిన ఈ ప్రతిపక్ష నాయకుడిని నాయకుడు అంటారా? దుర్మార్గుడు అంటారా? అని ప్రశ్నించారు. 

కరెంటు ఇవ్వకుండాబిల్లులు వసూలు చేయ డం అమానుషం అనే సంగతి ఈ ముఖ్యమంత్రికి తెలిసేలోపు ఇంకాఎంత బిల్లు పెంచుతారో అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పల్లెల్లో సాగింది. చండ్రుగొండ మండలం ఎర్రగుంట గ్రామం లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు..
‘‘ప్రజల గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి గాని, చంద్రబాబు గాని ఏ రోజూ ఆలోచన చేయలేదు. వారి కన్నంతా ముఖ్యమంత్రి పదవి మీదే ఉంది. మన రాష్ట్రంలో ప్రజలకు వైఎస్సార్ ఎంత గొప్ప మేలు చేశారో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం కోరుకుంటున్నారంటే దానికి కారణం వైఎస్సార్ చేసిన మంచి పనులు, వైఎస్సార్ సంపాదించుకున్న విశ్వసనీయతే. అవే విలువలు, అదే విశ్వసనీయతను ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిలో చూశారు గనుకనే, రాజన్న రాజ్యం తెచ్చే సత్తా జగన్‌కు ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా జగన్‌ను వైఎస్సార్ ప్రతిరూపంగా చూస్తున్నారు. ఈ విషయం టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారు.

రాజన్న పథకాలకు జగనన్న మళ్లీ జీవం పోస్తారు..
జగనన్న బయటకు రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత.. రాజన్న చేసి చూపించిన ప్రతి పథకానికి మళ్లీ జీవం పోస్తారు. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతూ అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారు. మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్య శ్రీ నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700, వికలాంగులకైతే రూ. 1,000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు తమ పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం.. పదోతరగతి వరకు చిన్నారికి రూ.500 చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు.

ఇలా ఒక్కో కుటుంబంలో ఇద్దరేసి పిల్లలకు పథకాన్ని వర్తింపజేస్తారు. అంటే ఏడాదికి ఒక్కో చిన్నారికీ రూ.6,000 చొప్పున తల్లి ఖాతాలో పడతాయి. ఇంటర్ చదివితే ఏటా రూ. 8,400, డిగ్రీ చదివితే రూ. 12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా జగనన్న ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు జగనన్న ప్రతి పేద కుటుంబానికీనెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు.’’

11.8 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 142వ రోజు బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం గ్రామం నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి దామరచర్ల, ముద్దుకూరు, కట్టుగూడెం, గుంపెన, ఎర్రగుంట, శాంతినగర్ మీదుగా నడుచుకుంటూ రాంనగర్ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. బుధవారం 11.8 కిలోమీటర్లు ఆమె నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,905.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిర్రాజు నగేష్, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, సాదు రమేష్‌రెడ్డి, భూక్యాదళ్ సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
బుధవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 142, కిలోమీటర్లు: 1,905.6
Share this article :

0 comments: