Jagan is in jail because people are by his side : YS Bharathi - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Jagan is in jail because people are by his side : YS Bharathi

Jagan is in jail because people are by his side : YS Bharathi

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013


జగన్‌ను అరెస్టు చేసి ఏడాది అవుతూ వుంది. ఈ సంవత్సరంలో కుట్రలు ఎన్ని చూశానో, అంతకంటే ఎన్నో రెట్ల ప్రేమను చూశాను. ఏనాడూ బయటకు రాని ఒక తల్లి తన కొడుకు కోసం తన బాధను దిగమింగుకుని, పట్టుదలతో, ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని, తన కొడుకు తరఫున ప్రజల బాధ్యత భుజం మీద వేసుకున్న ప్రేమను చూశాను. అన్న మాటను ప్రజలతో పంచుకోవడానికి మండుటెండను సైతం లెక్క చేయకుండా, కుటుంబానికి దూరంగా వుంటూ, 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన చెల్లెలు షర్మిల ప్రేమను చూశాను. పెరిగిన కరెంటు ఛార్జీలు, రాని పెన్షన్, పలకని 108,104, అందీ అందని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెరిగిన ధరలు, కరుణించని ప్రకృతి - ఇన్ని సమస్యల నడుమ వున్న ప్రజలు, మా సమస్యను తమ సమస్యగా భావించి, ఇంతలా తాపత్రయపడి జగన్‌కోసం ‘మీకు తోడు మేమున్నాం’ అంటూ ప్రతిరోజూ వాళ్లు చూపించే ప్రేమను చూశాను. మరీ ముఖ్యంగా దేవుడు చూపించే ప్రేమను చూశాను. భయంలో అభయమిచ్చే దేవుడి ప్రేమ, బలంలేనితనంలో బలం ఇచ్చే దేవుడి ప్రేమ - ఆదరణ, ధైర్యంతో నింపే ప్రేమ, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం కలిగించే దేవుని ప్రేమను చూశాను.

ఇంతటి ఆప్యాయత ఒకెత్తయితే, నీతిమాలిన రాజకీయ నాయకులనూ చూశాను. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబునాయుడు గారు ఇద్దరూ కలిసి, సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుతగలడం చూశాను. విశ్వసనీయత లేని చంద్రబాబుగారి పార్టీ నుంచి అందరూ వెళ్తున్నారని, కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత కేబినెట్‌లోనే నిరసన అని విన్నాను! జగన్ బయటకు రాకుండా వుంటే, మూడో మనిషి లేకుండా ఉంటే, వాళ్ల పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని వాళ్లు అనుకున్నారు. కాని, మనిషి ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడంటారు. వాళ్లు చేసేది వాళ్లు చేస్తే, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఒకరికి అన్యాయం చేసి, ఒకరిని బాధపెట్టి, మనం దానినుంచి లబ్దిపొందాలనుకుంటే అది ఎన్నటికీ వాళ్లకు శాపమే కాని, మంచి జరగదు.

హిట్లర్ కాలంలో ఆయన పనిచేయగలిగినవారిని మాత్రమే బతకనిచ్చేవాడట. వాళ్లకు జబ్బు చేస్తేనో, వాళ్లు బలహీనపడితేనో చంపేసేవారట. మన కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఆయన సిద్ధ్దాంతాన్ని నమ్ముకున్నట్టున్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, మోసంచేసి, ఆయనకు వెన్నుపోటు పొడిచి, పదవి తీసుకుని, ఆయన చనిపోయినప్పుడు కూడా రాజకీయాలు చేసి, ఇప్పుడు మళ్లీ అవసరానికి ఆయన పేరును, ఆయన కుటుంబాన్ని చీల్చి చంద్రబాబుగారు వాడుకోవాలని చూస్తున్నారు. హరికృష్ణగారే ఇందుకు నిదర్శనం. ఏ కాంగ్రెస్‌కు అయితే వ్యతిరేకంగా ఎన్టీఆర్‌గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో, అదే తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్‌తో అంతర్గత పొత్తులు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. పదవులకోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు బాబుగారు.

మరి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే... 30 ఏళ్లు ప్రజలతో మమేకమైన వైయస్సార్‌గారు 2003లో మండుటెండలో పాదయాత్ర చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చారు. తిరిగి 2009లో అందరూ ఏకమై మహాకూటమి అని ఏర్పడ్డా, సినీ గ్లామర్‌తో ప్రజారాజ్యం వచ్చినా, ఒంటరిగా నిలబడి, పోరాడి కాంగ్రెస్‌ను గెలిపించారు మహానేత వైయస్సార్. ఇప్పుడు ఆయన లేరని తెలిసి ఆయన మీద ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడే మంత్రులుగాని, ఈ ముఖ్యమంత్రిగాని ఆరోజు 2004లో, 2009లో పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంత పనిచేశారో, వైయస్సార్‌గారు ఎంత పనిచేశారో ఒక్కసారి తమ మనస్సాక్షిని వారే ప్రశ్నించుకోవాలి. ఎందుకూ కొరగానివాళ్లు అంతటి మహానుభావుని గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వుంటే బాధ అనిపిస్తుంది. వైయస్సార్‌గారిని వాడి వదిలేసినట్టే ఈరోజు మంత్రులను వాడి వదలివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభంగా వున్న వైయస్సార్ గారినే వాడి వదిలివేస్తే ఇక మంత్రులెంత, ప్రజలెంత ఈ కాంగ్రెస్ పెద్దలకు!

ఈ రెండు పార్టీల నైజం అంతే! అవసరం ఉన్నంతవరకు వాడుకుని అవసరం తీరాక తీసి అవతల పడేసే నైజం వీరిది. ఒకరు సొంత మామను వాడుకుని వదిలివేస్తే, మరొకరు సొంత పార్టీ నాయకులను బలి చేస్తారు. వీళ్లకు ప్రజలు కూడా అంతే! పదవులకోసం ప్రజల వీపులపెకైక్కి గద్దెనెక్కుతారు. గద్దెనెక్కిన తరువాత అదే ప్రజలను పక్కకు తోస్తారు.

వీరికి భిన్నంగా వైయస్సార్‌గారు తన పదవిని ప్రజలకోసం మాత్రమే అనుకున్నారు. అందుకే ఆయన పాలనలో ఏ కొరతా రానీయలేదు. తన పాలనలో రాష్ట్రంలోని ప్రతి మనిషికి ఆయన ఆసరా అయ్యారు. ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పనిచేశారు. అందుకే ఆయన కాలంలో ఏ కొరతా లేదు. దేవుడు ఆశీర్వదించి మంచి వర్షాలు, మంచి పంటలు, సరిపడా కరెంటు, ఉద్యోగాలు అన్నీ బాగా వున్నాయి. స్వతంత్ర భారతదేశంలో ఎవ్వరూ అందివ్వనంత సహాయ సహకారాలు ప్రతిఒక్క కుటుంబానికి ఆయన అందించారు. ప్రజలను ఏనాడూ ఆయన వాడుకోవాలని అనుకోలేదు. ప్రజలకు తను ఉపయోగపడాలనుకున్నారు. అందుకే అన్నీ చేశారు.

జగన్ కూడా తన తండ్రి నేర్పిన, చూపిన దారినే ఎంచుకున్నాడు. అందుకే ఆజాద్ గారు అన్నట్టు పదవి ఇస్తామన్న కాంగ్రెస్ కన్నా, తను మాట ఇచ్చిన ప్రజలకు కట్టుబడి ముందుకు నడిచాడు. జగన్ తన తండ్రిలాగా రాజకీయాలంటే పదవులు పొందడం కాదు, విశ్వసనీయత, ప్రజాసేవ అని నమ్మాడు. అందుకే జైలులో వున్నా, ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా వోటు వేయించాడు... ఇబ్బందులు పెడతారని తెలిసినా! ఈ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా, పెరిగిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీలంతా కలిసి అవిశ్వాసం పెట్టినప్పుడు తనను ఇంకా ఇబ్బందులు పెడతారని తెలిసినా జగన్ రాజీపడలేదు. అలాగే చంద్రబాబుగారు ఎమ్మార్, ఐఎంజి కేసులలో వ్యవస్థలను మేనేజ్ చేసుకునేందుకు రాజీపడ్డారు కానీ, జగన్ మాత్రం తొణకలేదు, రాజీపడలేదు. నిజాయితీతో కూడిన రాజకీయాలే చేశారు. 15 మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయని తెలిసినా వారికి ప్రజల తరఫున నిలబడేందుకు ప్రేరణ ఇచ్చాడు. బాబుగారి మాదిరిగా వ్యక్తిత్వం అమ్ముకోలేదు. విశ్వసనీయతకే నిలబడ్డాడు. ఆ ప్రజలకు తోడుగా నిలిచాడు. కాని, చంద్రబాబుగారు, ఎఫ్‌డిఐలోనూ, అవిశ్వాసంలోనూ కాంగ్రెస్‌కు అండగా నిలిచాడు.

జగన్ ప్రజలపక్షాన ఉన్నాడు కాబట్టే ఈరోజు జగన్‌ను జైలులో పెట్టారు. జగన్ బయట వుంటే వారి ప్రజావ్యతిరేక విధానాలకు అడ్డుపడతాడని ఈరోజు జైలులో పెట్టారు. జగన్ కూడా వారి మాదిరి ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెడితే ఆయన్ని ఎప్పుడో బయటకు తెచ్చేవారు. కాని జగన్ లోపల వున్నా తనను నమ్ముకున్న ప్రజలకోసం మాత్రమే ఆలోచిస్తాడు. విశ్వసనీయతకే పెద్దపీట వేస్తాడు. అందుకే ఈ కాంగ్రెస్, టీడీపీలకు జగన్ అంటే అంత కక్ష. అంత భయం. అందుకే ఇన్ని కుట్రలు. వారికి కూడా ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే జగన్‌ను చూసి భయపడవలసిన పనేముంది? జగన్‌ను ప్రజలకు దూరంగా ఉంచవలసిన అవసరం ఏముంది?

ఈ కాంగ్రెస్, టీడీపీ వాళ్లను చూస్తే నేననుకుంటాను - పులి బోనులో వున్నా నక్కలకు ఉలికిపాటే - అని! వీళ్లు హృదయపూర్వకంగా చెడు చేస్తూ, రాష్ట్రంలో మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబంతో మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి అన్యాయాన్ని తూచి చెల్లిస్తున్నారు. కాని, నిశ్చయంగా న్యాయం చెప్పే దేవుడు లోకంలో వున్నాడని, తొందరలోనే ప్రజలకు తెలుస్తుంది. మా కుటుంబం అయితేనేమి, రాష్ట్రంలో కష్టాలు పడుతూ కన్నీరుపెడుతున్న ప్రతి కుటుంబానికి అయితేనేమి మంచిరోజులు ఎంతో దూరంలో లేవు. వాడుకుని వదిలివేసే ఈ కాంగ్రెస్, టీడీపీలకు దేవుడు, ప్రజలు బుద్ధిచెప్పేరోజు దగ్గరలోనే వుంది.
Share this article :

0 comments: