2004 నుంచే ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2004 నుంచే ఎందుకు?

2004 నుంచే ఎందుకు?

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

* సాగునీటి ప్రాజెక్టులపై వ్యాఖ్యలు దారుణం: కృష్ణదాసు
* టీడీపీ, ఎల్లో మీడియా విమర్శలే యథాతథంగా కాగ్ నివేదికలో
* ఆ విమర్శలే పరమ ప్రమాణమన్నట్టుగా రాష్ట్ర ఏజీ మాటతీరు
* చూస్తుంటే కాగ్ ఒక పార్టీ ప్రాపకం కోసం పని చేస్తున్నట్టుంది
* సాగునీటి ప్రాజెక్టులు ప్రజాప్రయోజనార్థం చేసే నిర్మాణాలు
* ఇంగితమున్న వారెవరూ వ్యయ-లాభ నిష్పత్తిని చూడరు
* వైఎస్సే లక్ష్యంగా ‘2004’ నుంచే పరిశీలిస్తున్న కాగ్

అనుమతులు లేనిదే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని, వాటివల్ల ఖర్చు పెరిగిపోతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత ధర్మాన కృష్ణదాసు తీవ్రంగా తప్పుబట్టారు. కాగ్ ధోరణి చూస్తుంటే అది ఏదో రాజకీయ పార్టీ ప్రాపకం కోసం పని చేస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2004-2012 మధ్య కాలంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంపై కాగ్ ప్రత్యేకంగా రూపొందించిన నివేదిక చూస్తే, ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు అనవసరమన్న భావన కలిగేలా ఉందన్నారు. ‘‘కాగ్ ప్రదర్శిస్తున్న ఈ వైఖరినే పాలకులు అనుసరించి ఉంటే భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రతిష్టాత్మకం, దేశానికే తలమానికమైన బహుళార్థసాధక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేవి కావు. భారతదేశంలో, అదీ గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తే మనకేం ప్రయోజనమని నాటి బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్ధర్ కాటన్ అనుకుని ఉంటే గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా పేరు గాంచేవి కావు’’ అన్నారు.

కృష్ణదాసు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు కరువు బారిన పడి విలవిల్లాడుతున్నా తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరే బాగుందన్న రీతిలో కాగ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘దీనికితోడు, బాబు, ఆయన పార్టీ నేతలు, ఆయన కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ఎనిమిదేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలే కాగ్ నివేదికలో చోటుచేసుకున్నాయి. పైగా ఎల్లో మీడియా ఆరోపణలే పరమ ప్రమాణాలన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తీరు చూసి నేను విస్తుపోయాను. కాగ్‌కు తప్పులు పట్టడమే తప్ప ప్రజా సంక్షేమంతో పని లేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత జర్నలిస్టు అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యమని శుక్రవారం నాటి కాగ్ నివేదిక చూశాక నాకనిపించింది.

తప్పులు వెదకడమే తప్ప రాష్ట్ర ప్రజలకు ఆహారభద్రత, ఆరోగ్య భద్రత, విద్యా భద్రత వంటివి కాగ్‌కు పట్టవన్న అభిప్రాయం కలుగుతోంది. ఆహార భద్రతకు దోహదపడే సాగునీటి ప్రాజెక్టులకు కాస్ట్ రేషియో బెనిఫిట్‌ను ఈ దేశంలో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ చూడరు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టొద్దట! వాటి నిర్మాణం వల్ల ఆర్థిక భారం పడుతుందట! కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూరుతుందట! ఏమిటీ వ్యాఖ్యలు? పైగా, ఒక్కసారి ఇన్ని ప్రాజెక్టులు చేపట్టడమేమిటని అకౌంటెంట్ జనరల్ తుమ్మల వాణి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం చూశాను. రైతులకు, రాష్ట్రానికి మేలు కలుగుతుందని భావిస్తే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఎక్కడో ఓ చోట అవకతవకలు జరుగుతాయేమో. ఆరు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి సాగునీటి సౌకర్యం కల్పించడం తప్ప మరో మార్గం లేదు. ఆ ప్రాజెక్టులను ఈపీసీ ద్వారా చేపట్టాలా, లేదా మరో విధానంలోనా అన్నది నిర్ధారించాల్సింది, ప్రజల అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకునేది వారెన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే తప్ప కాగ్ కాదు’’ అని అన్నారు.

2004 నుంచే ఎందుకు?
దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నింటికీ 2004నే కాగ్ ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటోందో అర్థం కావడం లేదని కృష్ణదాసు ఆశ్చర్యం వెలిబుచ్చారు. గతేడాది భూ కేటాయింపులకు సంబంధించి కూడా 2004-09 కాలాన్నే కాగ్ పరిగణనలోకి తీసుకుందని గుర్తు చేశారు. ‘‘అంతకుముందు తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు తన హయాంలో లక్షలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారు. మరి ఆ కేటాయింపులను ఎందుకు సమీక్షించలేదు?’’ అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దివంగత నేత వైఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో అనుసరించిన భూ కేటాయింపుల విధానాన్నే వైఎస్ కూడా కొనసాగించారని ఆయన గుర్తు చేశారు.

‘‘అలాంటప్పుడు ఐదేళ్ల వైఎస్ హయాంనే కాగ్ ఎందుకు పరిగణనలోకి తీసుకున్నట్టు? ఆ నివేదికలోనూ ఎల్లో మీడియా కథనాల మాదిరి వ్యాఖ్యలుండటం ఏమిటి? ఇక్కడ కాగ్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో వీటిని బట్టే అర్థమవుతోంది’’ అన్నారు. కాగ్ పేర్కొన్నట్టుగా ప్రాజెక్టుల అంచనా వ్యయం ఆషామాషీగా పెరగదని గుర్తు చేశారు. ‘‘పునరావాస కార్యక్రమాలు, భూ సేకరణకు వెచ్చించాల్సిన నిధులతో పాటు స్టీలు, సిమెంటు ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతాయి కాబట్టి అంచనా వ్యయంలో మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలను పక్కదారి పట్టించాలని కాగ్ ప్రయత్నించడం సరి కాదు. జలయజ్ఞం పనులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానాన్ని అమలు చేశారు. దానిప్రకారం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

అదనంగా చెల్లింపులుండవు. సరైన పరిశీలన లేకుండా ఇచ్చిన డిజైన్లు అనుమతించబడవు. అదే టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లతో ఆ పార్టీ నాయకులు సిండికేటై టెండర్ బాక్సులే ఎత్తుకెళ్లిన సంఘటనలున్నాయి. మరి కాగ్ తన నివేదికలో వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. 2004 ఎన్నికలకు ముందు జూరాల విద్యుత్ హౌస్‌ను రూ.46.36 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. అంతకుముందు వారు చేపట్టిన ఎస్సారెస్సీ స్టేజ్-2 అంచనా వ్యయాన్ని 28.32 శాతం, వరద కాల్వ అప్రోచ్ కెనాల్‌ను 90 శాతం, హెడ్ రెగ్యులేటర్‌ను 104 శాతం, అలుగునూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 45 శాతం, అవుకు రిజర్వాయర్‌ను 22 శాతం, కే సీ కెనాల్‌ను 50 శాతం (0-16 కి.మీ. వరకు), తెలుగుగంగను 100 నుంచి 150 శాతం పెంచారు. ఎస్సార్బీసీ అంచనాలను ఏకపక్షంగా 90 శాతం పెంచారు. మరి ఇవన్నీ కాగ్‌కు ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని కృష్ణదాసు ప్రశ్నించారు.

నాడు వైఎస్ ఏమన్నారంటే...
సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయన్న టీడీపీ ఆరోపణలపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన సమాధానంలో కొన్ని అంశాలు...

‘‘భవిష్యత్తు ఆహార అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ దేశానికి నీరు ఎంతో అవసరం. ఎక్కువ నీటిని రైతులకు అందుబాటులోకి తేవడమే అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఉన్న ఏకైక మార్గం. అందుకోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. గతంలో ఈ ప్రయత్నం చేయని వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఈ ప్రాజెక్టులను అమలు చేయని రాజకీయ నాయకుల వ్యవహార శైలి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి దశలోనూ తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్లు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానవమాత్రులమైన మనం ఇక్కడ శాశ్వతం కాదు.

మన మేం చేశామనేది మన తర్వాత కూడా నిలిచిపోవాలి. మన దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన విదేశీ ప్రభుత్వ ప్రతినిధి అయిన కాటన్ ఇలాంటి ప్రాజెక్టులను కట్టించడంలో ఉన్న సమస్యలను 1850ల్లోనే ఎదుర్కొన్నాడు. అలానే కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అనేక మేజర్, మైనర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. తొమ్మిదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసినందుకు సిగ్గుపడాల్సిన టీడీపీ, ప్రాజెక్టులు కట్టకుండా మమ్మల్ని అడ్డుకుంటోంది. గత శతాబ్ద కాలంలో దేశ జనాభా 500 శాతం పెరిగింది. వచ్చే 30 ఏళ్లలో మరో 50 కోట్ల జనాభా పెరగబోతోంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆహారధాన్యాలు, కూరగాయల సమస్య, గతంలోలా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తకూడదు. నీటిని సముద్రంలోనికి వదలడం ఒక నేరం. ప్రతిపక్ష పార్టీలు, వారికి అండగా ఉన్న మీడియా సహకారంతో పొందుతున్న వికృతానందాన్ని అంగీకరించేందుకు మేం సిద్ధంగా లేము. జలయజ్ఞంపై వారు చేస్తున్న దుష్ర్పచారాన్ని నేను ఆపలేను. అవినీతి లేకుండా ప్రాజెక్టులు కడితే వాళ్లను ఆపిందెవరు?’’
Share this article :

0 comments: