పంచాయతీ నగారా! జూలై 3న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంచాయతీ నగారా! జూలై 3న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్

పంచాయతీ నగారా! జూలై 3న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

- మూడో వారంలో ఎన్నికలు.. 25 నాటికి ప్రక్రియ పూర్తి
- నేడు పోలీసు, ఆర్థిక, పంచాయతీశాఖ అధికారులతో ఈసీ భేటీ
- శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం
- రిజర్వేషన్ల నోటిఫికేషన్లు నేడు ప్రభుత్వానికి...
- రేపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పణ

పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జూలై 2 లేదా 3వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. జూలై మూడో వారంలో పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో దఫా ఎన్నికలకు మూడు రోజుల వ్యవధి ఉంటుంది. జూలై 25వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేసినట్టు తెలిసింది. రిజర్వేషన్ల నోటిఫికేషన్ ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదు. అయినా ఎన్నికల నిర్వహణకు శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో, శనివారం పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించింది. 

ఎన్నికల బందోబస్తుకు సంబంధించి పోలీసులతో, ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించేలా సహకరించడంతో పాటు అభ్యర్థుల డిపాజిట్ మొత్తం, ఎన్నికల వ్యయ పరిమితి పెంపు వంటి ప్రతిపాదనలను పార్టీలతో చర్చించనుంది. డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితి పెంపు ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో ఏ గ్రామ పంచాయతీని ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారన్న వివరాలతో కూడిన నోటిఫికేషన్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇంకా చేరలేదు. దాంతో ఆ నోటిఫికేషన్లను గురువారం వారు ప్రభుత్వానికి అందించలేకపోయారు. ఈ రిజర్వేషన్ నోటిఫికేషన్లను శుక్రవారం ప్రభుత్వానికి అందిస్తే, అది వాటిని పరిశీలించి ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల నోటిఫికేషన్ అందగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సంఘం ప్రకటించనుంది. జూలై రెండున మంగళవారం కావడంతో మూడో తేదీన షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

తర్వాత మూడు రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెవెన్యూ డివిజన్లవారీగా మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇదివరకే నిర్ణయించడం తెలిసిందే. అందుకు సంబంధించి జిల్లాల అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు జిల్లాల అధికారుల సంసిద్ధతను జూన్ 24వ తేదీన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడి యో రికార్డింగ్‌తో పాటు మొబైల్ పోలీసింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటుపై నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి కోరారు.

ఇవేం రిజర్వేషన్లు: బీసీ సంఘాలు
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటిని జిల్లా యూనిట్‌గా ఖరారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా కొన్ని జిల్లాల్లో 13 శాతం, కొన్ని జిల్లాల్లో 18 నుంచి 26 శాతం స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని ఆరు బీసీ సంఘాలు మండిపడ్డాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులకు లెక్కలు రావా అని ప్రశ్నించాయి. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రిజర్వేషన్ల ఖరారులో బీసీలకు జరిగిన అన్యాయాన్ని డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. బీసీ రిజర్వేషన్లలో తీవ్ర గందరగోళం సృష్టించారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేశ్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ అధ్యక్షుడు జి. మల్లేశ్‌యాదవ్, రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గా గౌడ్ ఆరోపించారు. 

రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన రొటేషన్ పద్ధతిని బీసీ, జనరల్, మహిళా కేటగిరీల్లో పాటించలేదని వారు విమర్శించారు. నిబంధనల ప్రకారం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు స్థానికంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆరోపించారు. ‘‘జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రతి జిల్లాలో బీసీలకు 34 శాతం సీట్లు రావాలి. అందుకు విరుద్ధంగా జిల్లాల్లోని మొత్తం జనాభాలో బీసీల శాతాన్ని తీసుకుని, దాన్ని రాష్ట్ర జనాభా, రిజర్వేషన్ల శాతంతో భాగించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇది చట్టవిరుద్ధం. గుంటూరు జిల్లాలోని 1,008 పంచాయతీల్లో 34 శాతం లెక్కన బీసీలకు కనీసం 342 స్థానాలు రావాలి. కానీ 201 మాత్రమే కేటాయించారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. రొటేషన్ పద్ధతి ప్రకారం గతంలో రిజర్వ్ అయిన స్థానం మళ్లీ ఆ వర్గానికే రిజర్వ్ కావడానికి వీల్లేకపోయినా పలు జిల్లాల్లో ఆ వర్గాలకే మళ్లీ రిజర్వ్ చేశారని విమర్శించారు.
Share this article :

0 comments: