జగన్‌పై కుట్రలో కొత్తపుంతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై కుట్రలో కొత్తపుంతలు

జగన్‌పై కుట్రలో కొత్తపుంతలు

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

- జగన్‌పై కేసు నిలవదన్న భయంతో వైఎస్‌పై బురదజల్లుతున్నారు
- అందులో భాగమే ఆర్‌బీఐ-వైఎస్‌పై ‘ఈనాడు’ కథనం
- దున్నపోతు ఈనిందని ఈనాడు అంటే.. దూడను కట్టేయాలన్నట్లు ప్రవర్తిస్తారు టీడీపీ నేతలు
- టీడీపీ హయాంలో చంద్రబాబు, రామోజీరావుల ఆడిటర్ సీతారామయ్యకు మూడు పదవులిచ్చారు కదా!.. దీనిపై టీడీపీ సమాధానమేంటి?
- రిజర్వు బ్యాంకు చట్టాలను రామోజీ ఉల్లంఘించినా పాత పరిచయాలతో మేనేజ్ చేసుకున్నారు
- ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున అవకతవకలు.. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలి..

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమ కేసులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపించారని, అయితే ఇప్పుడు ఆ కేసు నిరూపించలేక కొత్త కుట్ర పన్నుతూ ఎల్లో మీడియా చేత కొత్త కథనాలు ప్రసారం చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. 26 జీవోల్లో ఎలాంటి క్విడ్ ప్రో కో జరగలేదని, వాటిని మంత్రులు చట్టబద్ధంగా విడుదల చేశారని ముఖ్యమంత్రే చెప్పడంతో కేసు ఎక్కడ వీగిపోతుందోనని వీరు భయపడుతున్నారని అన్నారు. దీంతో మీడియాను అడ్డంపెట్టుకొని వైఎస్ కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘ఈనాడు పత్రిక ఏదో ఒక కథనం రాయడం, దాన్ని పట్టుకొని టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం.. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ తంతును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఆ పత్రికలో ‘రిజర్వు బ్యాంక్‌నూ వదలని వైఎస్’ అంటూ ఏదో ఘోరం నేరం జరిగిపోయినట్లుగా ఓ కథనాన్ని ప్రచురించారు. అంతేకాదు సీబీఐ చార్జిషీటులో ఫలానా అంశాలు ఉంటాయంటూ ‘ఈనాడు’ ముందే రాస్తోంది. చార్జిషీట్‌లను కోర్టులో అందజేయకముందే ‘ఈనాడు’ పత్రిక, టీడీపీ నేతలకు ఇవి ఎలా తెలుస్తాయి? అంటే సమాధానం ఉండదు’’ అని విమర్శించారు. లేదంటే చార్జిషీట్‌లో ఫలానా అంశాలు ఉండాలని మీరే నిర్దేశిస్తున్నారా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ‘ఈనాడు’ పత్రిక ‘దున్నపోతు ఈనింది’ అని ప్రచురిస్తే ఆ దూడను కట్టేయండి అనే విధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తుంటారని ఎద్దేవా చేశారు.

సిఫారసు చేయడమే తప్పా..
ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఆర్‌బీఐ డెరైక్టర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించగలరని అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తే తప్పేంటని గట్టు ప్రశ్నించారు. ‘‘ఇదేదో అసాధారణ విషయం అన్నట్టు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఇలాంటి సిఫారసులు చేయలేదా? వారి హయాంలో నియామకాలు ఏవీ లేనట్టు ‘ఈనాడు’ రాయటం.. దాన్నే టీడీపీ మాట్లాడటం అంటే రాష్ట్ర ప్రజల విజ్ఞతను అపహాస్యం చేయటమే అవుతుంది’’ అని అన్నారు. ‘‘విజయసాయిరెడ్డి ఓ ఆడిటర్‌గా ఎంతో పేరున్న వ్యక్తి. ఆయన్ను తప్పుపట్టే నైతిక స్థాయి ‘ఈనాడు’ పత్రికకు గానీ, టీడీపీకి గానీ లేదు’’ అని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, రామోజీరావు వద్ద ఆడిటర్‌గా, ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పనిచేసిన దేవినేని సీతారామయ్యను.. టీడీపీ అధికారంలోకి రాగానే ఏకంగా టీటీడీ చైర్మన్‌గా నియమించిందని గట్టు గుర్తుచేశారు. అంతేకాకుండా సీతారామయ్యను ఏపీఐడీసీ డెరైక్టరుగా, ఆర్‌బీఐ సదరన్ రీజియన్‌లో డెరైక్టర్‌గా నియమింపజేశారని తెలిపారు. ‘‘దేవినేని సీతారామయ్య అసాధారణమైన ప్రజ్ఞా పాటవాలతో సీఏ పరీక్షలు మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిన వ్యక్తి కూడా కాదు. అలాగే అంతకు ముందు జీవితంలో హిందూ ధర్మ కార్యక్రమాలు, చారిటీలు నిర్వహించిన చరిత్ర కూడా ఆయనకు లేదు. 

అలాంటి వ్యక్తిని ఏరకంగా టీటీడీ చైర్మన్ చేశారు? మీ కుటుంబ కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేసిన వ్యక్తిని ఆర్‌బీఐ సదరన్ రీజియన్‌లో డెరైక్టర్‌గా నియమింపచేశారు. రాష్ట్రంలో ఇంతమంది ప్రముఖులు, ఉద్ధండులు అయిన ఆడిటర్లు ఉండగా సీతారామయ్యనే ఎందుకు రికమండ్ చేసి నియమించారు?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీకి వచ్చిన ఎంపీ పదవులతో కేంద్రంలో చక్రం తిప్పిన రోజుల్లో మంత్రి పదవులు తీసుకోకుండా మూడోకంటికి తెలియకుండా కీలకమైన పదవుల్లో తన మనుషుల్ని పెట్టుకున్నారన్నారు. అందుకే రామోజీరావు రిజర్వు బ్యాంక్ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘించినా.. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.2,600 కోట్లు సేకరించినా.. రూ.200 కోట్ల పన్ను ఎగవేసినా ఆయన మీద ఆర్‌బీఐ ఎలాంటి చర్యలకూ దిగకుండా ఆ పాత పరిచయాలతోనే మేనేజ్ చేసుకున్నారని గట్టు పేర్కొన్నారు.

టీడీపీది అడ్డమైన వాదన..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు క్విడ్ ప్రో కో అని టీడీపీ అడ్డదిడ్డమైన వాదన చేస్తోందని గట్టు దుయ్యబట్టారు. ‘‘బ్యాంకుల్లో రుణం తీసుకోవడం కూడా తప్పే అంటోంది టీడీపీ. విజయసాయిరెడ్డి ఓబీసీ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు జగన్ సంస్థలకు ఇచ్చింది రుణం మాత్రమే. అంటే వడ్డీ, అసలు కూడా తిరిగి చెల్లించకోవాల్సిన అప్పు. ఆ రకంగా తిరిగి చెల్లించారే తప్ప, ఏ బ్యాంకులకూ ఏ పైసా ఎగ్గొట్టలేదు. ఓబీసీ అయినా, మరో బ్యాంకు అయినా జగన్ సంస్థలకు ఇచ్చినది ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే వచ్చిన రుణం. అలాంటి అంశాలను ప్రశ్నించే నైతిక హక్కు ఆర్‌బీఐ నిబంధనల్ని తుంగలో తొక్కిన రామోజీకి ఉందా?’’ అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ ట్రస్టుపై విచారణకు సిద్ధమా?
పబ్లిక్ సెక్టార్‌లో ఉన్నఎన్టీఆర్ ట్రస్టుపై చంద్రబాబు విచారణకు సిద్ధపడతారా? అని గట్టు సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్ ట్రస్టు బోర్డు మెంబర్లు ముగ్గురు మాత్రమే. అందులో నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి, దేవినేని సీతారామయ్య మాత్రమే ఉన్నారు. ఎన్నో విరాళాలు సేకరిస్తూ పబ్లిక్ సెక్టార్‌గా ఉన్న ఈ ట్రస్టు బాగోతం, వచ్చే విరాళాలు, టీడీపీ కార్యాలయం నడుస్తున్న తీరుపై సమగ్ర విచారణ జరిపించాలి’’ అని గ ట్టు డిమాండ్ చేశారు. చంద్రబాబు నీతిమంతుడైతే వెంటనే విచారణ జరిపించుకోవాల్సిందిగా హితవు పలికారు. విజయసాయిరెడ్డి ఆర్‌బీఐ డెరైక్టర్ అయితే రూ.5 లక్షల కోట్లు దోచుకునేవారని టీడీపీ నేతలు అంటున్నారని, గతంలో దేవినేని సీతారామయ్యను ఆర్‌బీఐ డెరైక్టర్‌గా పెట్టిన చంద్రబాబు ఇంత మొత్తం కాజేశారా? అని గట్టు ప్రశ్నించారు. టీడీపీ నేతల తీరు గురివింద సామెతలా ఉంటుందని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: