గ్రామ జనాభా ఆధారంగానే రిజర్వేషన్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామ జనాభా ఆధారంగానే రిజర్వేషన్లు

గ్రామ జనాభా ఆధారంగానే రిజర్వేషన్లు

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

కలెక్టర్ స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు
తాజాగా 282 జీవో జారీ చేసిన సర్కారు

 గ్రామ పంచాయతీల్లో ఆయా కేటగిరీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల అమలు కోసం ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప సవరణ చేస్తూ తాజాగా 282 జీవో జారీ చేశారు. మండల జనాభా అన్న పదాన్ని తొలగించి, గ్రామ జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే పంచాయతీరాజ్ కమిషనర్ ఒక్కో జిల్లాకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్య పంపిస్తారు. ఆ సంఖ్య ఆధారంగా జిల్లాల కలెక్టర్లు జనాభాను బట్టి ఏ గ్రామం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందన్న అంశాన్ని ఖరారు చేస్తారు. ఈ రిజర్వేషన్లను గెజిట్ నోటిఫికేషన్ చేసిన అనంతరం దానిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. గతంలో కమిషనర్ జిల్లాకు రిజర్వేషన్ల సంఖ్యను పంపిస్తే.. జిల్లా కలెక్టర్ మండలాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను పంపించేవారు. మండలాల వారీగా ఏ గ్రామం ఏ కేటగిరీకి రిజర్వ్‌డ్ అవుతుందన్న విషయాన్ని ఆర్డీవోలో చేపట్టేవారు. ఇప్పుడా పద్ధతికి స్వస్తి పలికి జిల్లా కలెక్టర్ స్థాయిలోనే రిజర్వేషన్లు జరపనున్నారు. ఇందులోనూ ముందుగా ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంఖ్య పూర్తయిన తరువాత ఎస్సీలకు, ఆ తరువాత బీసీలకు, ఆ తరువాత అన్ రిజర్వ్డ్ స్థానాలు ఖరారు చేసి, వీటిలో నుంచి మహిళా స్థానాలను రిజర్వ్ చేస్తారు. 

నేడు జిల్లాలకు రిజర్వేషన్ల సంఖ్య వివరాలు..!

రిజర్వేషన్ల ఖరారుకు మంగళవారం పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఉత్తర్వులో జారీ చేయడంతో.. బుధవారం సాయంత్రానికి జిల్లాలకు ఏయే కేటగిరీకి ఎన్నెన్ని స్థానాలు రిజర్వ్ అవుతాయన్న వివరాలను కమిషనర్ రాంగోపాల్ పంపించనున్నట్లు సమాచారం. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వివరాలను పంపిస్తారు. అలాగే ‘పీసా’ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలోని సర్పంచ్ స్థానాలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేయడంతోపాటు, వార్డు సభ్యుల్లో కనీసం 50 శాతం సీట్లను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. వారి జనాభా ఆధారంగా అవసరమైతే అన్ని స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. 50 శాతం వార్డు మెంబర్‌స్థానాలు దాటిన తరువాత ఎస్టీలు లేని పక్షంలో ఎస్సీలకు, ఆ తరువాత బీసీలకు కేటాయించనున్నారు.
Share this article :

0 comments: