వైఎస్ ఉంటే ..పోలవరం పారేది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఉంటే ..పోలవరం పారేది

వైఎస్ ఉంటే ..పోలవరం పారేది

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

పోలవరాన్ని అందరూ ఓట్లురాల్చే ప్రాజెక్టుగానే చూశారు
కానీ వైఎస్సార్ రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చూశారు
ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చని సంకల్పించారు
ప్రాజెక్టు పూర్తయితే 7.21 లక్షల ఎకరాలకు సాగు నీరు,
25 లక్షల మందికి తాగు నీరు అందుతుంది
అందుకే పట్టుదలగా దాదాపు అన్నీ క్లియరెన్సులు సాధించారు
రూ. 3,310 కోట్లు ఖర్చు చేసి 38 శాతం పనులు పూర్తిచేశారు
ఈ చేతగాని పాలకులు ఆ శ్రమనంతా నిర్వీర్యం చేస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 185, కిలోమీటర్లు: 2,456.5

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రతినిధి: ‘‘పాదయాత్రలో నడుస్తూ మీ పంట పొలాలను చూశాను. అంతా మెట్ట భూమే కనిపిస్తోంది. వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టుకు జీవం పోశారు. ఆయన బతికే ఉంటే పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ పాటికి నీళ్లు పారేవి. కానీ ఇప్పుడున్న పాలకులకు చిత్తశుద్ధి లేక దాని ఉసురు తీశారు. కాల్వల తవ్వకాలు అర్ధంతరంగా ఆగిపోయి కనిపిస్తున్నాయి. వైఎస్సార్ మన మధ్యనుంచి వెళ్లిపోయిన తరువాత పోలవరం ప్రాజెక్టును పట్టించుకునే వారే కరువయ్యారు. 

మెట్ట భూములను చూస్తుంటే చాలా బాధనిపించిందమ్మా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్రలో అడుగు కలిపిన రైతులందరూ పోలవరం పనులు పూర్తి కాకపోవడంపై విచారం వ్యక్తం చేయడంతో షర్మిల ఇలా స్పందించారు. ఉద్దండ జగన్నాథపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలోనూ రైతులు పోలవరంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే... 

‘‘వైఎస్సార్ కంటే ముందు, ఆయన తరువాత చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. అందరూ పోలవరం ప్రాజెక్టును ఓట్లు రాల్చే ప్రాజెక్టుగానే చూశారు తప్ప దాని నిర్మాణం చేపట్టాలని ఏ ఒక్కరూ అలోచన చేయలేదు. కానీ రాజన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రాజక్టుపై దృష్టి సారించారు. ధవళేశ్వరం బ్యారేజీ దాటి ఏటా సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీల నీటిలో కనీసం 300 టీఎంసీలనైనా వినియోగించుకోగలిగితే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చనే గొప్ప సంకల్పంతో పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నది ఆ మహానేత ఆశయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు 540 గ్రామాల్లోని 25 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగి రాష్ట్రంలో విద్యుత్తు సమస్య కొంతవరకైనా తీరుతుంది. అందుకే అప్పటికి 62 సంవత్సరాలుగా నానుతున్న ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర జల సంఘం డెరైక్టరేట్ నుంచి ప్రాజెక్టుకు కావల్సిన 20 క్లియరెన్సులను 2008 నాటికి సాధించారు. కీలకమైన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ అనుమతులు కూడా 2009, ఫిబ్రవరిలో లభించాయి. 

నాన్న మన మధ్యనుంచి వెళ్లిపోయే నాటికి రూ.3,310 కోట్లు ఖర్చు చేసి 38 శాతం పనులు పూర్తిచేశారు. స్పిల్‌వే నిర్మాణం 15 శాతం, ఎర్త్‌డ్యాం నిర్మాణం ఐదు శాతం, ప్రధాన కాలువ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఆ తరువాత నుంచి నేటివరకూ ప్రాజెక్టులో పురోగతి లేనేలేదు. మహానేత ప్రాజెక్టు నిర్మాణానికి సర్వశక్తులొడ్డి సాధించిన ఫలితాలన్నింటినీ ఈ చేతగాని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రారంభంలో రూ.1,117 కోట్లతో అంచనాలు వేసిన హెడ్‌వర్క్ పనులు తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి టెండర్లు పిలిచేనాటికి రూ.4,717 కోట్లకు చేరింది. తాజాగా వేసిన అంచనాల ప్రకారం రూ.7,332 కోట్లుగా చెప్తున్నారు’’ అని తెలిపారు. ఇక ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తారో ఎవరికీ తెలియడంలేదని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. 

185వ రోజు... 16 కిలో మీటర్లు...

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 185వ రోజు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శరభవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడినుంచి చింతలూరు, శాంతి ఆశ్రమం, వెంకటనగరం, ఉద్దండ జగన్నాథపురం, కే కొత్తూరు గ్రామాల మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,456.5 కి.మీ యాత్ర పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, కొల్లి నిర్మలకుమారి, స్థానిక నాయకులు చెలమలశెట్టి సునీల్, విప్పర్తి వేణుగోపాల్, కొత్తపల్లి గీత, అనంతబాబు, చింత కృష్ణమూర్తి, జ్యోతుల నవీన్, రొంగలి లక్ష్మి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: